America China Relations : బిడెన్‌ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా?

America China Relations : బిడెన్‌ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా?


అమెరికా-చైనా మధ్య శత్రుత్వం ఇంకా పెరిగిపోతుందా? అవసరమైతే చైనాతో యుద్ధానికి కూడా జో బిడెన్‌ సిద్ధమవుతారా? బిడెన్‌ బలహీనమైన అధ్యక్షుడా ? చైనా ప్రభుత్వ సలహాదారుడొకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

అమెరికా, చైనా మధ్య నిన్నా మొన్నటిదాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే, ఆ తీవ్రత ఇప్పుడంతగా లేదని, ఆ దేశాల మధ్య శత్రుత్వం తగ్గిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు. అమెరికాలో అధికార మార్పిడే దీనికి కారణం. ఇన్నాళ్లూ డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో ఢీ అంటే ఢీ అన్నారు. కానీ, మొన్నటి ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి పాలయ్యారు. జో బిడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో.. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతర్జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.

ట్రంప్ పాలనలో చైనా-అమెరికా సంబంధాలు అత్యంత దారుణమైన స్థాయికి దిగజారాయి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు మరింత సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో బిడెన్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇరు దేశాల మధ్య బంధాలు మళ్లీ బలోపేతమవుతాయని పలువురు చైనా నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే చైనా ప్రభుత్వ సలహాదారుడు, అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కంటెంపరరీ చైనా స్టడీస్ డీన్ అయిన జెంగ్ యాంగ్నియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నెలకొన్న అభిప్రాయాలను పటాపంచలు చేశారు.

అసలు బిడెన్‌ పాలనలో అమెరికా-చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే భ్రమల నుంచి చైనా బయటకు రావాలని జెంగ్ యాంగ్నియాన్ చైనా ప్రభుత్వానికి సూచించారు. అమెరికాతో కఠినమైన వైఖరిని అనుసరించడానికి సన్నద్ధం కావాలని సూచించారు. గతంలోని మంచి రోజులు ముగిసి పోయాయని జెంగ్ చెప్పారు. చాలా ఏళ్లుగా చైనాతో ఉన్న కోల్డ్ వార్ రాత్రికి రాత్రే ఆగిపోదని అభిప్రాయపడ్డారు. చైనాపై అమెరికా ప్రజల్లో ఆగ్రహాన్ని జో బిడెన్ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు.

అంతేకాదు.. జో బిడెన్ ఒక బలహీనమైన అధ్యక్షుడు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు జెంగ్‌. అమెరికా అంతర్గత సమస్యలను బిడెన్ పరిష్కరించలేకపోతే, ఆయన దౌత్యపరంగా ఏదైనా చేసే అవకాశం ఉందని జెంగ్‌ విశ్లేషించారు. ట్రంప్‌ యుద్ధం మీద ఆసక్తి చూపించలేదని, కానీ, బిడెన్‌ అలా కాదని, కయ్యానికి కాలు దువ్వుతాడని, యుద్దానికి కూడా సై అనే అవకాశం ఉందని చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఓవైపు.. చైనా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే.. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెంగ్‌ చెప్పారు. అమెరికాతో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని తాము ఆశిస్తున్నామని తెలిపారు.. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

One Comment on “America China Relations : బిడెన్‌ బలహీన అధ్యక్షుడా ? చైనాపై యుద్ధం చేస్తాడా?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *