భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీ ఇదే…

భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీపై స్పష్టత వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.

వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన 10 రోజుల్లో టీకాలను ప్రజలకు ఇవ్వనున్నట్లు తెలిపింది. డ్రైరన్‌ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీకి కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13వ తేదీనే భారత్లో వ్యాక్సినేషన్ షురూ కాబోతుంది.  వారం రోజుల్లోనే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అత్యవసర అనుమతులు పొందిన 10 రోజుల్లోపే టీకాను తీసుకొస్తామని స్పష్టం చేసింది.

ఈ నెల 3వ తేదీనే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. జనవరి 13న వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయములో భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

జనవరి 13 నుంచి భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం తాజా ప్రకటనతో స్పష్టమైంది. ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌, భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి.. తొలి దశలో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, వయసు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది.

వ్యాక్సిన్ తయారీ సంస్థలు త్వరలో ముంబై, చెన్నై, కోల్‌కత్తా, కర్నల్, హర్యానాలోని ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు విమానాల ద్వారా వ్యాక్సిన్‌ను తరలించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అక్కడి నుంచి 37 స్టేట్ వ్యాక్సిన్‌ స్టోర్లకు తరలించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జిల్లాల్లోని వ్యాక్సిన్ స్టోర్స్‌కు తరలించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌‌లను నిల్వ చేసేందుకు 29,000 కోల్డ్ చైన్‌ పాయింట్స్‌ను భారత్‌లో సిద్ధం చేసినట్లు ఆరోగ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *