Congress Party : కుమ్ములాటల్లో కాంగ్రెస్ – నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్

congress office

– అతి అంతర్గత ప్రజాస్వామ్యం
– అంపశయ్య మీద కాంగ్రెస్‌
– పార్టీ అజెండా పక్కనబెట్టిన నేతలు
– టీపీసీసీ ఎన్నికపై పిల్లిమొగ్గలు
– తల బొప్పి కట్టిన అధిష్టానం
– ఇదిగో.. అదిగో అంటూ ఊరింపు
– నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్

Congress Party : కుమ్ములాటల్లో కాంగ్రెస్ – నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్

ఊరించి ఊరించి ఉసూరుమనిపించటం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు.. కుమ్ములాటలు, బహిరంగంగానే వ్యక్తిగతంగా విమర్శించు కోవడాలు, పదవుల విషయంలో సొంత పార్టీ నేతల ప్రతికూల అంశాలను ఫోకస్ చేయడాలు వంటివి కాంగ్రెస్ పార్టీకే సొంతమని కూడా చెబుతారు.
తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేతలంతా గర్వంగా చెప్పుకుంటారు కానీ, అంతర్గత కుమ్ములాటలు, బహిరంగంగానే విమర్శలు, ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు, అవసరమైతే బాహాబాహీలు కాంగ్రెస్ సంస్కృతిగా చెబుతారు. తెలంగాణలో ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడి నియామకం విషయంలో ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి.

 

అంపశయ్య మీద కాంగ్రెస్‌ :

అసలే అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి.. జవసత్వాలు తీసుకురావడం సాధ్యమేనా? అన్న సందేహాలు సర్వత్రా ఆవరించిన నేపథ్యంలో.. మరింత కష్టపడాల్సిన, మరింత పకడ్బందీగా వ్యూహాలు రూపొందించాల్సిన పరిస్థితుల్లో.. అవసరమైతే స్వార్థం వీడి పార్టీ కోసం త్యాగాలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి మొదలుకొని.. క్షేత్రస్థాయిలో కింది స్థాయి నాయకుల దాకా తమ సహజ స్వభావాన్ని, నైజాన్ని వదులుకోలేదన్న వాస్తవం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది.

అసలే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. తెలంగాణలో చావుతప్పి కన్నులొట్ట పోయిన చందంగా తయారయింది. ఇక జాతీయ స్థాయిలో కూడా పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా క్రమంగా ఒక్కో రాష్ట్రం నుండి అధికారం చేజారిపోతోంది. అయినా పార్టీ అజెండా కాకుండా వ్యక్తిగత అజెండాలే ఇప్పటికీ ప్రధానమైపోతున్నాయి. వాస్తవ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహం కాకుండా.. అర్థవంతమైన ప్రతిపాదనలు కాకుండా.. కుమ్ములాటలు, బహిరంగ విమర్శలు, వాయిదాలు సర్వసాధారణమై పోతున్నాయి.

తెలంగాణలో పిసిసి చీఫ్ నియామక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నాయకుల మధ్య వ్యక్తిగత విమర్శలకు ప్రదర్శనగా తయారయ్యింది. అంతే కాదు.. కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను సందిగ్ధంలోకి నెట్టి వేస్తోంది. అధిష్ఠానం వ్యవహార శైలి కూడా అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అధిష్టానంపై సొంత పార్టీ నాయకులకు.. అదికూడా సీనియర్ లకే నమ్మకం లేని పరిస్థితి దాపురించింది.

ఇదిగో.. అదిగో అంటూ ఊరింపు :

అదిగో ఇదిగో అంటూ కొద్దిరోజుల పాటు ఎఐసిసి అధిష్టానం తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై హీట్ సృష్టించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా అటువైపు దృష్టి మళ్లించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నియమిస్తారనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడిచింది. అదే సమయంలో పిసిసి అధ్యక్ష పదవికి ఆసక్తిగా ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తాపత్రయపడ్డారు. తమ అనుచరులతో సాగించాల్సిన ప్రచారం సాగిస్తూనే తాము ఎవరికైతే దగ్గరగా ఉంటామో.. అలాంటి అధిష్టానం పెద్దలతో టచ్ లో ఉంటూ పోటీలో నిలబడ్డారు. మరికొందరు బహిరంగ ప్రకటనలతో తాము పిసిసి చీఫ్ బరిలో ఉన్నామన్న సంకేతాలు పంపించారు.

ఈసారి టీ పిసిసి అధ్యక్ష ఎన్నిక గతంలో కంటే భిన్నంగా జరుగుతుందని, పార్టీ ఇంచార్జిలే సర్వే చేసి టీపీసీసీ చీఫ్ ఎవరన్నది ప్రకటిస్తామని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఈ సారి అయిన టిపిసిసి అధ్యక్ష ఎన్నిక నామినేటెడ్ ప్రక్రియలా కాకుండా క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు అభిప్రాయం తీసుకుని అర్థవంతంగా సాగుతుందని పై నుంచి కిందకు అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం ఈసారి కూడా బయటపడింది ఊరించి ఊరించి ఉసూరుమనిపించింది.

సర్వే పేరిట అధిష్టానం సాగించిన తంతు కొన్నాళ్ళ పాటు సాగింది. అందరినీ ఉత్కంఠలో ముంచింది. తుది జాబితాలో కొంత మంది పేర్లు గల్లంతయ్యాయి. మరికొందరి పేర్లలో ప్రాధాన్యత క్రమం మారిపోయింది. సహజంగానే ఆ జాబితా కు సంబంధించిన లీకులు బయటకు రావడంతో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు కాంగ్రెస్ లో ఎగిసిపడ్డాయి. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రకటనలు, విమర్శలు, ఆరోపణలు, పరోక్ష హెచ్చరికలు చేయడం వంటి పరిణామాలు కొనసాగాయి.

అధిష్టానం సాధించిన సర్వేలో, కాంగ్రెస్ పార్టీ నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణలో మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నట్లు తేలింది. కానీ పోటీలో ఉన్న ఇతర నేతలు ఇతర మార్గాల నుంచి నరుక్కు రావడం మొదలుపెట్టారు. మరికొందరైతే కావాలని రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకొని బహిరంగ ప్రకటనలు విమర్శలు చేశారు. అధిష్టానానికి కూడా ఓ రకంగా హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డికి పిసిసి పీఠం దక్కకూడదనే ఒకే ఒక లక్ష్యం తో పలువురు అధిష్టానంపై ఒత్తిడి పెంచినట్లు జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.

పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్న అభ్యర్థులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుమల వెళ్ళిన సమయంలో.. తాను బీజేపీలో చేరనున్నట్లు సమయం చూసి ప్రకటిస్తున్నాననీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక రకంగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేలా అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు.

మరోవైపు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొద్ది రోజుల పాటు అధిష్టానంపై రుసరుసలాడారు. పిసిసి చీఫ్ రేస్ లో ఉన్నప్పటికీ సర్వే పేరిట రూపొందించిన తుది జాబితాలో తన పేరు గల్లంతు కావడంపై బహిరంగంగానే మండిపడ్డారు. అంతే కాదు రేవంత్ రెడ్డినీ కనుక పిసిసి చీఫ్ గా ఎంపిక చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పార్టీ సీనియర్ల అందరి అభిప్రాయం కూడా అదేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి కాకుండా మరెవరికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని తెలిపారు.

ఇక.. మరో సీనియర్ నేత వి.హనుమంతరావు మాత్రం అధిష్టానంపై ఓ రకంగా యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ పై బహిరంగంగా అవినీతి ఆరోపణలు కూడా చేశారు. సర్వే పారదర్శకంగా చేయకుండా డబ్బులు తీసుకొని జాబితాను రూపొందించారని చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి. అధిష్టానానికి వీర విధేయుడుగా ఉండే వీహెచ్.. ఎప్పుడూ లేని విధంగా అధిష్ఠానం మనుషులపై సంచలన ఆరోపణలు చేయడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై అధిష్టానం సీరియస్ అయ్యింది. విచారణకు కూడా ఆదేశించింది. విహెచ్ వివరణ కోరింది.

తల బొప్పి కట్టిన అధిష్టానం :

ఇంత తతంగం జరిగినా.. అధిష్టానం చివరకు పీసీసీ చీఫ్ నియామకం మాత్రం చేయలేదు. ఒకరకంగా పిసిసి చీఫ్ రేస్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధాన్ని లేవనెత్తింది. ఇన్ని పరిణామాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తల బొప్పి కట్టింది. ఏం చేయాలో, పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించాలో తేల్చుకోలేక పోయింది. అసలే పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఇలాంటి పరిణామాలు మరింత సుడిగుండంలో ముంచుతాయని భయపడింది.

నడిసంద్రంలో చుక్కానిలా నాగార్జునసాగర్:

సరిగ్గా ఇదే సమయంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అనే అంశం.. కాంగ్రెస్ పార్టీకి నడి సముద్రంలో సుడిగాలిలో చిక్కుకున్న నావలో చుక్కానిలా మారింది. ఈ సమయంలో పిసిసి చీఫ్ కుంపటి కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేసే పరిస్థితి కనిపించింది. దీంతో కనీసం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసేదాకా నైనా పిసిసి చీఫ్ ఎంపిక ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం కూడా ఏకపక్షంగా అధిష్టానమే తీసుకున్నారు అన్న అపవాదు రాకుండా ఉండేందుకు.. పార్టీ పెద్దలు, విధేయులైన కొందరితో ఈ అభిప్రాయాన్ని వెల్లడించేలా చేసింది. ఇంకేముంది.. అధిష్టానం ఇప్పటికైతే ఊపిరిపీల్చుకుంది. ఇదే ప్రకటన చేయించింది.

– సుజాత గోపగోని
(జాగృతి సౌజన్యంతో…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *