లాంగ్కరోనా, పోస్ట్ కరోనా అంటే తెలుసా?
వాటి పర్యవసానాలేంటి?
Corona Reactions : కరోనాతో పొంచి ఉన్న ముప్పు – 55 రకాల దీర్ఘకాలిక సమస్యలు
దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్నా ఆ.. మహమ్మారి ప్రభావిత బాధలు వీడట్లేదు.. దాదాపు 55 రకాల దీర్ఘకాల సమస్యలుతో బాధపడుతున్నట్లు నిపుణుల పరిశోధనలో వెల్లడైన నమ్మలేని విషయాలపై లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. చైనాలో పురుడు పోసుకున్న వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిని సైతం వైరస్ ప్రభావిత బాధలు వీడట్లేదు.. దాదాపు ఒళ్లంతా ఏదో ఒక రూపంలో మహమ్మారికి సంబంధించి దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. చికిత్సానంతరం 14 రోజుల నుంచి 110 రోజుల వరకు కూడా వేదనలు తప్పడం లేదు. దాదాపు 58 శాతం మంది త్వరగా చిన్నపనికే అలసటకు గురవుతుండగా.. 44 శాతం మందిలో తరచూ తలనొప్పి బాధిస్తోంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 55 రకాల దీర్ఘకాల సమస్యలున్నట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. దాదాపు 80 శాతం మందిని ఒకటికి మించి ఎక్కువ బాధలు పీడిస్తున్నట్లుగా స్పష్టమైంది.
కరోనా ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందనేది ఇప్పటి వరకూ నిపుణులు చెబుతున్నా.. వైరస్ తగ్గిన తర్వాత అత్యధికుల్లో ఏదో ఒక బాధ ఒళ్లంతా కమ్మేస్తోందని తెలుస్తోంది. వెంట్రుకలు మొదలుకొని పాదం వరకూ అవయవాల వారీగా కూడా దీర్ఘకాల బాధలు బాధిస్తున్నాయి. ఎక్కువ మందిని మానసిక సమస్యలు వేధిస్తున్నాయి. కోలుకున్నా ఇంకా ఆరోగ్య సమస్యలు వస్తాయేమోననే ఆందోళన ఒకవైపు మానవాళికి ఉంటే.. కుటుంబ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార తదితర ఆర్థికపరమైనవి మరోవైపు అదనంగా చేరి.. బాధితుల్లో ఒత్తిడి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో నిద్రపట్టకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం వంటి సమస్యలతో బాధపడుతున్నారట.
అయితే తీవ్ర వ్యాధుల బారిన అతి తక్కువ మంది మాత్రమే బారిన పడుతున్నట్లు ఊరట నిచ్చే అంశాన్ని నిపుణులు వెలిబుచ్చారు. పక్షవాతానికి గురైన వారు 3 శాతం ఉండగా.. ఓసీడీ, ఆలోచనలు తరచూ మారుతుండడం, దిగులుతో ఇబ్బంది పడేవారు 2 శాతం చొప్పున ఉన్నట్లు తెలిపారు. గుండెపోటు, అధిక రక్తపోటు, పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు బారిన పడినవారు ఒక శాతం చొప్పున ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
కొవిడ్ చికిత్సానంతరం కూడా 34 శాతం మందిలో ఛాతీ సీటీ స్కాన్, ఎక్స్రే అసాధారణంగా కనిపిస్తున్నాయట. 20 శాతం మందిలో డీ-డైమర్, 11 శాతం మందిలో ఎన్టీ-ప్రొబీఎన్పీ, 8 శాతం మందిలో సీఆర్పీ, 8 శాతం మందిలో సిరమ్ ఫెర్రిటిన్, 4 శాతం మందిలో ప్రొకాలిసిటొనిన్, 4 శాతం మందిలో ఐఎల్6 నిర్ధారణ పరీక్షల్లో సాధారణంగా ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.
కొవిడ్ చికిత్స పొందిన అనంతరం కొన్ని రకాల బాధలు ఎదురవడం సాధారణమేనంటున్నారు వైద్యులు. దీన్ని వైద్య పరిభాషలో లాంగ్ కొవిడ్ అని కూడా పిలుస్తుంటారని తెలిపారు. వీటి గురించి ఆందోళన చెందక్కర్లేదని.. విధుల్లో అసౌకర్యంగా అనిపిస్తుంటే కొంత విశ్రాంతి తీసుకోవడం మేలని తెలిపారు.