Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం

అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం రైతు నాయకులు, ప్రభుత్వం కదలాలి

2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన రైతు చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆందోళనలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం అందరి దృష్టికి వస్తున్నది. ముఖ్యంగా జనవరి 26 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు దానిలో ఒక కీలక పరిణామం. ఆందోళనలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు కొందరు ఈ సంఘటనపై విచారం కూడా వ్యక్తం చేశారు.

శాంతియుతంగా ”చక్కా జామ్‌” :

అట్లాగే ఈనెల 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ”చక్కా జామ్‌” పేరుతో రహదారి దిగ్బంధన కార్యక్రమానికి రైతు సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాలలో శాంతియుతంగా కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైట్ మాట్లాడుతూ ” అక్టోబర్ 2వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకోకపోతే తదుపరి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించాడు. అట్లాగే ప్రభుత్వం మాపై ఒత్తిడి తీసుకొని వచ్చి మాతో చర్చలు జరపలేదు” అని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కోసం అనేక రాయితీలను ఇప్పటికే ప్రకటించామని, వ్యవసాయ రంగానికి కొత్త పెట్టుబడులను తీసుకొని రావటం అత్యంత ఆవశ్యకమని కూడా ప్రభుత్వం చెబుతున్నది. భారతదేశ 9. 29 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిది 15 శాతం. దానిని గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా విస్మరించాయి. నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము అని కూడా చెబుతుంది. అలాగే దేశ శ్రామికశక్తిలో సగం శక్తి వ్యవసాయ రంగానిదే అందుకే ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ రైతు సంఘాల నాయకులు ఆందోళన చేయడానికి ముఖ్యమైన అంశం కొనుగోలు చేసే కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ లాభం చేకూర్చేవిధంగా రైతు చట్టాలు ఉన్నాయని. అట్లాగే ప్రభుత్వం కూడా క్రమంగా గోధుమలు, బియ్యం కొనుగోలు చేయడం ఆపి వేసే ప్రమాదం కూడా ఉన్నదని చెబుతున్నారు.

జరుగుతున్న పరిణామాలను గమనించినట్లయితే ఇక్కడ మనం మూడు విషయాలపై పూర్తి అవగాహన చేసుకోవలసిన అవసరం ఉన్నది.

1] హింసపై నమ్మకం ఉన్నవారు, జాతి వ్యతిరేక శక్తుల ప్రాబల్యం క్రమంగా ఉద్యమంలో పెరుగుతున్నది. రైతు సంఘాల నాయకులకు దానిని అదుపులో ఉంచగలిగే శక్తి ఉందా? అనేది ఒక పెద్ద ప్రశ్న.
2] ఉద్యమంపై రాజకీయ ప్రాబల్యం కూడా క్రమంగా పెరుగుతున్నదనిపిస్తున్నది. ఎందుకంటే గడిచిన ఒక సంవత్సర కాలం నుండి దేశంలోని ప్రతిపక్షాలకు ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఉంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని, మోడీని ఎట్లాగయినా బలహీనం చేయాలి. ఈ సమయంలోనే నాయకులకు రైతు ఉద్యమం అయాచితంగా దొరికింది. వివిధ రాష్ట్రాలలో జరగబోయే శాసనసభ ఎన్నికల వరకు ఈ ఆందోళన ఇట్లాగే కొనసాగించగలిగితే బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చు.. కాబట్టి అప్పటివరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించేందుకు దారులు వెతుకుతున్నారు. పార్టీలలోని రెండవ శ్రేణి, మూడవ శ్రేణి నాయకులు ఉద్యమ నాయకులను కలవడానికి క్యూలు కడుతున్నారు.
3] రైతు చట్టాలలో ఏముందో స్పష్టంగా తెలియక పోయినా దానిలో తమకు లాభం, నష్టాలు ఎట్లా ఉంటాయో అంచనా వేయలేక పోయినా రాజకీయ ప్రభావంలో పడి దేశంలోని మిగతా ప్రాంతాలలోని రైతులు ఆలోచనలో పడుతున్నారు. ఇంకొక ప్రక్క ఇన్ని రోజులుగా ఉద్యమం సాగటం అంటే రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకమని తప్పుడు సంకేతాలు కూడా దేశంలో మిగతా రైతులకు వెళుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన శుక్రవారం రైతు ఉద్యమానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌లో పది వేల మందికి పైగా రైతులు నిరసన ప్రదర్శన చేశారు. భాగ్‌పాట్ జిల్లాకు చెందిన రైతు నాయకుడు రామ్ కుమార్ చౌదరి బైన్‌స్వాల్ రైతులతో మాట్లాడుతూ ”ఇప్పటి వరకూ గ్రామాల నుండి ఒక్క శాతం రైతులు కదిలారు, అదే 50 శాతం మంది రైతులు కదిలితే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. అట్లాగే ఒక పత్రిక విలేకరితో మాట్లాడుతూ.. రైతు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే మేము కూడా ఢిల్లీ బయలు దేరవలసి వస్తుంది” అని అన్నాడు. ఉత్తర ప్రదేశ్ రైతుల కదలికలు పెరిగితే సమస్య ఇంకా జటిలం అవుతుంది. ఉత్తర ప్రదేశ్ జాతీయ రాజకీయాలకు యుద్ధభూమి. ఆ రాష్ట్రంలోని చెరుకు రైతుల నిరసన అందరికి ఆందోళన కలిగిస్తున్నది. ఇవన్నీ ఎటు దారి తీస్తాయి?

ఐక్యరాజ్యసమితి ట్వీట్‌ :

మరో ప్రక్క రైతుల కోసం రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. వారిలో పాప్‌స్టార్ రిహానా, పర్యావరణ ప్రచారకుడు గ్రేట్ ధన్ మొదలైన వారు ఉన్నారు. అట్లాగే ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 6వ తేదీన ట్విట్టర్ లో ”ఆందోళనకు ఒక దగ్గరే చేరటం, శాంతియుత నిరసన తెలియ చేయటం రైతుల మానవ హక్కులు.. ఆ హక్కులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, నిరసన కారులు కూడా సంయమనం పాటించాలి” అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హై కమిషనర్ కార్యాలయం ట్వీట్ చేసింది. రైతులతో తిరిగి చర్చలు ప్రారంభించి సమస్యలు పరిష్కరించాలని అమెరికా కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నది. భారత ప్రభుత్వం కూడా ఒక్క అడుగు వెనక్కి వేసి చట్టాలు అమలు కొంతకాలం వాయిదా వేయడానికి, చట్టాలలో ఎటువంటి సవరణలు అయినా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చర్చలకు ఎప్పుడూ మేము సిద్ధం అని కూడా చెప్పింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ రైతు ఉద్యమంపై స్పందించి మాట్లాడారు.

ఖలిస్తాన్‌ మద్దతు సంకేతాలతో ఆందోళన :

అనేకమంది అనేక రకాలుగా రైతు ఉద్యమం గురించి వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించడం కూడా మనం చూస్తున్నాం. వ్యాఖ్యానాలు చాలా దూరం వెళ్లాయి. రైతు ఉద్యమం ప్రభుత్వానికి, దేశానికి ఒక జాతీయ సమస్య అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతులు, రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్యమిస్తున్నారా? అనేది ఒక ప్రశ్న. ఈ ఉద్యమం వెనుక ఖలిస్తాన్ వేర్పాటు వాదుల పరోక్ష మద్దతు ఉన్నదని జనవరి 26న జరిగిన హింసాత్మక సంఘటనలతో అర్థమవుతోంది. రైతు నాయకుల పై రాజకీయ ఒత్తిడి కూడా ఎంతమేరకు ఉన్నదనే విషయం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని గమనించవలసి ఉన్నది.

రాజకీయ ప్రయోజనాలకోసం రైతు ఉద్యమంతో మమేకం :

దేశ రాజకీయ ముఖచిత్రం జాగ్రత్తగా గమనించినట్లయితే పార్లమెంట్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్నదని, ఒక జాతీయ పార్టీగా వ్యవహరించవలసిన తీరుకు భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని అర్ధమవుతున్నది. కాంగ్రెస్ వ్యవహారిస్తున్న తీరు కారణంగా కాంగ్రెస్‌కు లాభం చేకూరకపోగా సంకుచితంగా ఆలోచించే ప్రాంతీయ పార్టీలు లాభపడుతున్నాయా? అనే సందేహం కలుగుతున్నది. ఎందుకంటే దేశంలోఎక్కువ సమస్యలు ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలోనే ఉన్నాయి. కాంగ్రెస్ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. రాబోవు రాష్ట్రాల ఎన్నికలలో అధికారం అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఆమడ దూరంలో ఉన్నదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. దేశంలో స్వతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి అధికార పక్షంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఇంతటి దయ నీయంగా మారటం కూడా దేశానికి ఒక పెద్ద సమస్య. ప్రాంతీయ పార్టీలు తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసం ప్రాంతీయ తత్వాలు, భావోద్వేగాలను ఎలా రెచ్చగొడుతున్నాయో దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తున్నాయా? అనే ప్రశ్న ముందుకు వస్తున్నది.

అందరికీ ఆమోదయోగ్య పరిష్కారమే అంతిమ లక్ష్యం :

అసలు భారతదేశం యొక్క ఆత్మ ”గ్రామీణ భారతం”. ఈ విషయాన్ని దశాబ్దాలుగా పరిపాలించిన కాంగ్రెస్ విస్మరిస్తూ వచ్చింది. దాని ఫలితం దేశం మొత్తం అనుభవిస్తున్నది. దేశం ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలి అనుకుంటే గ్రామీణ భారతాన్ని విస్మరించలేము. నిర్లక్ష్యానికి గురి అయిన గ్రామీణ భారతం అభివృద్ధి గురించి ఇప్పుడున్న ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. అటువంటి ప్రభుత్వము రైతులకు నష్టం కలిగిస్తుందా? అనే ప్రశ్నను దేశంలో అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇవాళ రైతుల గురించి మాట్లాడుతుండటంతో.. ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్ సమర్థన తీసుకుంటూ ఉంటే ఈ ఉద్యమం ఎటువంటి మార్పులు తీసుకుంటుంది.. అనేది అంత పెద్దగా ఊహించ వలసిన అవసరం లేదు. సమీప భవిష్యత్తులో ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు మధ్య ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలు జరపవలసి ఉన్నది. ఉద్యమ నాయకులు కూడా చట్టాలలో సవరణలు చెయ్యటానికి సూచనలు ఇవ్వాలి. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి అనే వాదనను పరిశీలించుకోవాలి. ఆట్లాగే ప్రభుత్వం కూడా రైతు చట్టాల సవరణలకు సంబంధించి రైతు నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని దేశమంతా కోరుకుంటోంది.

  • రాంపల్లి మల్లికార్జున్‌ (సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
    న్యూస్‌ భారతీయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *