DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది : ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా?

DIWALI Rare Story : దీపావళి పర్వదినంపై కంచి పరమాచార్య ప్రబోధించిన పురాణ గాథ ఇది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ గాథ విన్నారా? అయితే, ఈ అరుదైన గాథను చదవండి.

దీపావళి పర్వదినం.. అందరికీ పండుగ రోజు. దేశమంతా ఒకే తరహాలో జరుపుకునే అరుదైన పండుగల్లో దీపావళి ప్రముఖమైనది. దీపావళి ప్రాశస్త్యం గురించి ఎన్నో కథలు, పురాణ గాథలు మనుగడలో ఉన్నాయి. అయితే, కంచి పరమాచార్య చెప్పిన ఈ చరిత్ర.. ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండరు. లోక కల్యాణమే పరమావధిగా కంచి పరమాచార్యులు ఉద్బోధించిన ఆ గాథ మీ అందరికోసం…

అసుర సంహారంతో లోక కల్యాణం :

మనదేశంలో జరుపుకునే పండుగలలో కొన్ని ఉత్తర భారతంలో ప్రసిద్ధి. మరికొన్ని దక్షిణ భారతంలో ప్రసిద్ధి. కానీ దీపావళి పండుగ దేశమంతా ప్రసిద్ధి. దీపావళికి పౌరాణికంగా కూడా ఎంతో వైశిష్ట్యం ఉంది. దీపావళికి సంబంధించి అనేక పురాణ గాథలు నానుడిలో ఉన్నాయి. ఆ గాథలలో పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిన శుభ దినం అని కొందరి అభిప్రాయం. శ్రీరాముడు రావణాది రాక్షసులను అంతమొందించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు అని కూడా అంటారు. అందుకే అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమము పెద్దఎత్తున జరుగుతుంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే త్రేతాయుగంలో భగవాన్ శ్రీ రామ చంద్రుడు రావణాసురుని విజయదశమి పండుగ రోజున సంహరించాడు. అందుకే ఆరోజు రామ్‌లీలా కార్యక్రమం పెద్దఎత్తున చేసుకొంటాము. అదే మాసంలో ద్వాపరయుగంలో భగవాన్ శ్రీ కృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు దీపావళి పండుగ జరుపుకుంటాము.  మొత్తం మీద అసుర సంహారం, అసుర ప్రవృత్తి సంహారము ఎప్పుడైనా లోక కల్యాణానికి దారితీస్తుంది. అందుకే ఆ రోజుల్ని పండుగగా జరుపుకుంటాం.

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన శుభ ఘడియలలో జరుపుకొనేది దీపావళిపండుగ. అయితే, అట్లాగే కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినరోజు గీతాజయంతి జరుపుకొంటాం. ఈరెండింటికి కృష్ణుడుతోనే సంబంధం ఉన్నది. అందుకే దీపావళి భగవద్గీతకు అన్నగారని చెప్పవచ్చు. ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. పండుగలలో దీపావళికి అంతటి ప్రాధాన్యత ఉంది. దీపావళి పండుగ ఈ దేశంలోని బౌద్ధులు, జైనులతో సహా అన్ని మతాలు, సంప్రదాయాల వారు కూడా జరుపుకుంటారు  ఈ పండుగకు ఇంకొక విశేషం కూడా ఉంది. ఈ పండుగను దేశమంతా ఒకే రోజున జరుపుకుంటారు.

కంచి పరమాచార్య ప్రబోధించిన గాథ :

ఎందుకు ఈ పండుగకి ఇంతటి ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలి. ఆ వివరాలు కంచి పరమాచార్య మాటలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

” ప్రస్తుతం ఉన్న అస్సాం ప్రాంతంలో ప్రాగ్జోతిషపురం అనే నగరం ఉండేది. ఆ నగరాన్ని భౌముడు అనే రాజు పాలించేవాడు. అతనికి నరకాసురుడు అనే మరో పేరు ఉండేది. నరకాసురుడు గొప్ప తపస్వి. దాని ద్వారా సాధించిన శక్తులను ప్రజాహితం కోసం కాకుండా లోకాలను హింసించేందుకు ఉపయోగించాడు. ఆధర్మ మార్గంలో లోకాలను హింసిస్తూ లోకకంటకుడైనాడు. అభేద్యమైన దుర్గాలలో అజేయుడుగా ఉండేవాడు. అతడు కొన్ని వేల మంది కన్యలను చెరపట్టాడు. అట్లాగే సాధు సంతులను హింసించాడు. ఇటువంటి లోక కంటకులను సంహరించేందుకు ద్వాపర యుగాంతంలో భగవంతుడు కృష్ణావతారం ఎత్తవలసి వచ్చింది. భగవంతుడు కూడా నరకాసురుని యుక్తితోనే సంహరించ వలసి వచ్చింది. స్త్రీలకు పుత్ర శోకం కంటే గొప్ప శోకం వేరే లేదు. భర్త చనిపోతే తనకున్న రక్షణ పోయిందే, తన సౌకర్యాలను చూసేది ఎవరు, ముత్తయిదువులమైన మాకు హేయమైన వైధవ్యం ప్రాప్తించిందే… అని స్త్రీలు దుఃఖ పడవచ్చు. ఈ దుఃఖంలో కొంత స్వార్థం ఉంది. కానీ, కొడుకు విషయం వేరు. కొడుకు వయసులోఉండి చనిపోయినప్పుడు ఆ తల్లి దుఃఖం మాటలలో చెప్పలేము. నరకాసురుని సంహారము జరిగిన సమయంలో నరకాసురుని తల్లి లోకానికి విరుద్ధంగా పుత్రశోకం పొందకుండా భగవంతుని చేతిలో చనిపోయిన తన కుమారుని మరణానికి సంతోషించింది. ఎంత అదృష్టం ఉంటే ఎంత తపస్సు చేస్తే తన కొడుక్కి అటువంటి భాగ్యం లభించింది, నా పుత్రుడు చనిపోతే పోనీ నాకు పుత్రశోకం కలిగిన ఫర్వాలేదు, కానీ లోకాలకు ఏ విధమైన కష్టం ఉండరాదు.. అని ఆ తల్లి కోరుకుంది. నరకాసురుడు లోకాలన్నిటిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన సార్వభౌముడు. అటువంటి పుత్రుడు చనిపోయిన రోజు లోకాలకు పండుగ కావాలి.. అని ఆ తల్లి భగవంతుణ్ణి ప్రార్థించింది. అట్లాగే యుద్ధరంగంలో భగవానుడి చేత పడిపోయినప్పుడు నరకాసురునికి భగవద్దర్శనం కలిగింది. జ్ఞానోదయం కలిగిన నరకాసురుడు కూడా భగవంతుని ప్రార్థిస్తూ తన స్మృతి చిహ్నంగా మానవజాతి అంతా కూడా పండుగ చేసుకో వాలి.. అని భగవంతుని ప్రార్థించినట్లు ప్రతీతి. అట్లాగే ఆరోజు ఎవరెవరు అభ్యంగన స్నానం చేస్తారో వారికి గంగాస్నాన ఫలం, మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కూడా నరకాసురుడు భగవంతుని ప్రార్థించాడట. ఈ పండుగ వెనుక, పుత్రశోకం కలిగినా లోక క్షేమం కాంక్షించే ఒక తల్లి ప్రార్ధన ఉన్నది. ఇంతకంటే చిత్తశుద్ధిని వేరే ఎక్కడ చూడగలం? మనం అయితే ఈ విధంగా ప్రార్ధించి ఉండేవాళ్లమా? నా కొడుకు పోయిన బాధ నాకు లేదు, లోకం క్షేమంగా ఉండాలి.. అన్న కోరికలో ఎంతటి మహత్తర త్యాగం ఉంది. అందుకే ఈ పండుగని తరతరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మనము కష్టపడుతున్నాం, సుఖ పడుతున్నాం. ఇతరులు దుఃఖించినా, లోకం కష్టపడినా నాకేం పర్వాలేదు.. అనే మనోభావం మనకి ఉండకూడదు. మనకు బాధ కలిగినా పర్వాలేదు, లోకం క్షేమంగా ఉండాలి అన్న నీతిని దీపావళి మనకు బోధిస్తున్నది. అందుకే మన బాధలను మనం సహించుకుంటూ లోక క్షేమం కాంక్షిస్తూ పాటుపడుతూ ఉండాలి. అందుకే ఉపదేశ గ్రంథాలలో గీతకు ఎంత ప్రాధాన్యత ఉందో పండుగలలో లోక క్షేమము అనే మహత్తర ఆకాంక్ష ఉన్న దీపావళికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది”

బృందావనం ఇలా ఏర్పడింది :

ఇక్కడే ఇంకొన్ని విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. నరకాసుర సంహారం తరువాత నరకాసురుని చెరలో ఉన్న కన్యలకు శ్రీకృష్ణుడు విముక్తి కలిగించాడు. ఈ విషయాన్ని లోకానికంతటికి తెలియ చేసాడు. ఎందుకంటే, ఆ కన్యల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకువెళ్లాలని, కానీ కొద్దిమంది మాత్రమే తీసుకొనివెళ్ళారు. దానితో కృష్ణుడికి మరో సమస్య వచ్చిపడింది. వేలమంది ఈ కన్యలను ఎట్లా కాపాడాలి అనే మథనంలోనే బృందావనం ఏర్పడింది. వాళ్ళందరూ కృష్ణుని భక్తులైనారు. అట్లా అప్పుడు తలెత్తిన సామాజిక సమస్య పరిష్కరించబడింది. కృష్ణుడి రక్షణలో వారందరూ గౌరవంగా జీవించారు.

చుట్టూ ఉన్న అసుర భావాలను పారదోలుదాం :

స్త్రీలను చెరపట్టే ప్రవృత్తి ఈ రోజు కూడా మనచుట్టూ కనపడుతున్నది. అటువంటి ప్రవృత్తిని అంతం చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే, మన చుట్టూ అనేక అసుర శక్తులు విజృంభించి పని చేస్తున్నాయి. కుల వివక్ష, స్వార్థ చింతన లక్ష్యంగా పనిచేసే శక్తులు మన చుట్టూ ఉన్నాయి. బాధ్యత లేని పౌరుల దురభిమానాలు, విలువలు లేని విశృంఖల వాతావరణము, కాలుష్యం మొదలైన వికృతులు మన జీవన విధానంగా మారి మన సంస్కృతి సంప్రదాయాలపై ఉదాసీన భావం కలిగిస్తున్నాయి. ఆ ఉదాసీన దృష్టి కలిగిన యువతీ యువకుల విచ్చలవిడితనం, దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రు వ్యూహాలు ఇట్లాంటి అనేక అసురీ ప్రవృత్తులు మనచుట్టూ ఉన్నాయి. అసుర భావాలతో కలిగే దుఃఖం కంటే నరకం ఇంకేముంటుంది? ఇటువంటి నరకాన్ని పోగొట్టి జ్ఞానానంద కాంతులను వెదజల్లడటమే దీపావళి ఆంతర్యం. ఈ శార్వరి (దీని మరోపేరే రాత్రి) ఆ నరకాలు అన్నిటినీ నిర్మూలించి ఆనంద దీప కాంతులను ప్రసరింప చేయవలసిందిగా మనము ” దీపలక్ష్మీ నమోస్తుతే” అని దీపలక్ష్మిని ప్రార్థిద్దాం. స్వదేశీ ఉత్పత్తులతోనే దీపావళి పండుగ జరుపుకుందాం.

అందరికీ దీపావళి శుభాకాంక్షలతో….

– రాంపల్లి మల్లికార్జున రావు (సామాజిక, రాజకీయ విశ్లేషకులు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *