ఈ విషయం తెలుసా ? : కరోనాతో చనిపోయిన వాళ్లకు రూ.2 లక్షలు బీమా సొమ్ము – అందరికీ తెలియజెప్పండి

ఆరునెలలుగా దేశవ్యాప్తంగానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. వేలాదిగా జనం కరోనా బారిన పడగా.. చాలామంది మృత్యువాత పడ్డారు.

    • ఈ కథనాన్ని యూట్యూబ్‌లో చూసేందుకు కింది లింక్‌ క్లిక్‌ చేయండి

 

అయితే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కరోనా రోగులకు సంబంధించి కనీసం ఆసుపత్రుల బిల్లులు కూడా కుటుంబసభ్యులు కట్టుకోలేని పరిస్థితులు కూడా చూశాం. అయితే.. కరోనాతో చనిపోయిన వాళ్లలో అధికశాతం మందికి 2 లక్షల రూపాయల బీమా సొమ్ము అందుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది.

కేంద్రప్రభుత్వం 2015లో ఈ ఏర్పాటు చేసింది. దేశంలో బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్న వారందరికీ బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. తొలుత ఒక్కసారి మాత్రం ఈ బీమా పథకానికి సంబంధించి ఖాతాదారులతో ఓఫారం నింపించారు బ్యాంకు సిబ్బంది. ఆ తర్వాత ప్రతియేటా బ్యాంకు ఖాతాలో నుంచి ఆటోమేటిక్‌గా ఆ బీమా మొత్తాన్ని బ్యాంకులు కట్ చేసుకుంటున్నాయి.

ఆ బీమా పథకాల పేర్లు :

1) ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) రూ.330

2) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్‌బివై) రూ.12

ఈ రెండు బీమా పథకాల కింద 2 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది.

తొలి పథకం PMJJBY కింద రూ.330 రూపాయలు ఖాతానుంచి బ్యాంకు కట్‌ చేసుకుంటుంది. ఈ బీమా చెల్లించిన వారు ఏ కారణంతో మరణించినా.. రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. కుటుంబసభ్యులకు ఈ మొత్తాన్ని అందజేస్తారు.

ఇక రెండో పథకం PMSBY కింద రూ.12 కూడా బ్యాంకుఖాతా నుంచి ప్రతియేటా కట్‌ చేసుకుంటారు. ఈ బీమా చెల్లించిన వారు ప్రమాదంలో చనిపోతే, శాశ్వత అంగవికలురు అయితే.. రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. ఆ పథకంలో పేర్కొన్న నిబంధనల మేరకు ప్రమాదానికి గురైన వారికి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల ప్రమాదబీమా చెల్లిస్తారు.

దాదాపు మనదేశంలోని బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్న వారిలో 95శాతానికి పైగా ఈ బీమాకోసం ప్రతియేటా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఖాతాదారునికి తెలియకుండానే బ్యాంకు అధికారులు ఈ ప్రీమియంను తీసుకుంటున్నారు.

ఏ బీమా వర్తిస్తుంది ?

ఇప్పుడు కరోనా బారిన పడి చనిపోయిన వాళ్లకు మొదటి బీమా (PMJJBY) వర్తిస్తుంది. అంతేకాదు.. ఏ కారణంగా చనిపోయినా ఆ బీమా కింద చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు లభిస్తాయి.

మనమేం చేయాలి ?

ఈ బీమా వర్తించడానికి పెద్ద తతంగమేమీ అవసరం లేదు. ఈ యేడాది మే తర్వాత చనిపోయిన వాళ్లకు ఈ బీమా వర్తిస్తుందో లేదో తెలియాలంటే వాళ్ల బ్యాంకు అకౌంట్లు ఏయే బ్యాంకుల్లో ఉన్నాయో తెలుసుకోండి.

– ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు స్టేట్‌మెంట్‌ తీసుకోవాలి.

– ఈ యేడాది మేనెలకు ముందే చనిపోయి ఉంటే.. గతేడాది అంటే.. 2019 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు స్టేట్‌మెంట్ తీసుకోండి.

– ఎందుకంటే ప్రతియేటా మే 31వ తేదీన ఈ బీమా పథకాలకింద ప్రీమియం కట్‌ చేసుకుంటారు.

– స్టేట్‌మెంట్‌లో రూ.12, రూ.330 ఖాతానుంచి డెబిట్‌ అయ్యాయో లేవో గుర్తించండి.

– ఏదైనా బ్యాంకు ఖాతానుంచి ఈ ప్రీమియం డెబిట్‌ అయ్యి ఉంటే కుటుంబసభ్యులు సంబంధిత బ్యాంకులో సంప్రదించాలి.

–  అవసరమైన ఫారాలు పూర్తిచేసి, డెత్‌సర్టిఫికెట్‌ బ్యాంకు అధికారులకు సమర్పిస్తే.. రూ.2 లక్షలు బీమా సొమ్ము కుటుంబసభ్యులకు అందుతుంది.

ప్రస్తుత కరోనా కాలంలో రూ.2 లక్షలు అంటే మామూలుగా తీసిపారేసే పరిస్థితి లేదు. సకల రంగాలూ కుదేలై ఇంటినుంచి మొదలుకొని దేశాల దాకా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఛిన్నాభిన్నమైపోయింది.

ఇలాంటి తరుణంలో PMJJBY బీమా డబ్బులు గనక అందితే ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుంది.

ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతోపాటు.. ఇటీవల చనిపోయిన వాళ్ల కుటుంబసభ్యులకు కూడా తెలియజేయండి.

కరోనాతో గానీ, ఇతర సమస్యలతో గానీ, ఏ కారణంగా చనిపోయిన వాళ్లకైనా ఈ బీమా వర్తిస్తుందని మర్చిపోకండి.