Drunken Driving : సందేశాలిస్తారు – వీడియోలు రిలీజ్‌ చేస్తారు – వాళ్లే తాగి నడుపుతారు

Drunken Driving : సందేశాలిస్తారు – వీడియోలు రిలీజ్‌ చేస్తారు – వాళ్లే తాగి నడుపుతారు… తప్పించుకునేందుకు తంటాలు పడతారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీల డ్రంకెన్‌ డ్రైవింగ్‌పై ఫ్యాక్ట్‌ఫుల్ కథనం.
తాగొద్దు.. తాగి డ్రైవింగ్‌ చేయొద్దు. వ‌చ్చినా రోడ్ల మీద‌కు రావొద్దు అని ఎవ‌రెన్ని చెప్పినా వినడం లేదు. ఇష్టమొచ్చిన‌ట్లు తాగి రోడ్ల మీద‌కు వ‌చ్చి నానా ర‌చ్చ చేస్తున్నారు. అందులో సామాన్య ప్రజ‌లు ఉంటే ప‌ర్వాలేదు. కానీ, సెలబ్రెటీలు కూడా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ అలా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయారు. అయితే, డ్రంకెన్‌ డ్రైవ్‌లపై అవగాహన కల్పిస్తున్నవాళ్లే మద్యం మత్తులో పోలీసుల ముందు కుదేలవుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన సెలెబ్రిటీలే ఫుల్‌గా మందుకొట్టి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో, రూల్స్ ఉన్నది కేవలం సామాన్యులకేనా? సెలెబ్రెటీలకు పట్టదా? అంటూ కొందరు సోషియల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు యాంకర్‌ ప్రదీప్‌ :

భాగ్యనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు తగ్గడం లేదు. ఒకవైపు పోలీసులు ఎంత కఠినంగా వ్యహరించినా మందుబాబుల తీరు మారడం లేదు. సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు సైతం ఫుల్‌గా మందు కొట్టి పోలీసులు ముందు కుదేలవుతున్నారు. ప్రముఖ టీవీ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజు రెండేళ్ల క్రితం నూతన సంవత్సర వేడుకల్లో ఫుల్‌గా మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే, బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్‌లో ఆల్కహాల్ పర్సెంటేజ్ 178 పాయింట్‌లు రావడంతో పోలీసులు ప్రదీప్‌పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. 19 రోజులపాటు నాటకీయ పరిణామాల మధ్య ప్రదీప్‌కు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్ట్ ముందు హాజరు పరిచారు. దీంతో, న్యాయస్థానం ప్రదీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేసింది. రెండు వేల ఒక వంద రూపాయల జరిమానా కూడా విధించింది. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్న ప్రదీప్‌.. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకుంటానంటూ న్యాయమూర్తి ముందు తప్పును ఒప్పుకున్నాడు.

రాజ్‌తరుణ్‌ పరుగులు :

సినీనటుడు రాజ్ తరుణ్ కారు అలకాపురి సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ప్రమాదానికి గురైన తర్వాత కారును వదిలి రాజ్ తరుణ్ పరుగులు తీశాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. అయితే మద్యంమత్తు, అతివేగంగా డ్రైవ్ చేయడం తోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానించి రాజ్ తరుణ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. కారు యాక్సిడెంట్ అయిన తర్వాత రాజ్‌తరుణ్‌ పరారవుతున్న దృశ్యాలను ఓ యువకుడు రికార్డ్‌ చేశాడు. దీంతో, తనను వదిలిపెట్టాలంటూ రాజ్‌తరుణ్ కాళ్లబేరానికి వచ్చి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ హల్‌చల్‌ :

ఇక ఇటీవల యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ జూబ్లీహిల్స్‌లో మద్యం మత్తులో వాహనం డ్రైవ్ చేస్తూ మూడు వాహనాలను ఢీకొట్టాడు. రెండుకార్లు, ఓ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడున్న వాహనదారులు అడ్డుకోవడంతో షణ్ముఖ్‌ జశ్వంత్‌ హంగామా చేశాడు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా.. 170 పాయింట్లుగా నమోదయ్యింది. యూట్యూబ్‌ స్టార్‌ అయిన షణ్ముఖ్ తన స్కిట్స్, డాన్స్‌తో అందరికి కట్టి పడేస్తాడు. మద్యపానంపై ఓ షార్ట్ ఫిలింలో కూడా షణ్ముఖ్ నటించాడు. ఆ వీడియోతో.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

గతంలో పట్టుబడ్డ పలువురు స్టార్లు :

గతంలోనూ చాలామంది సెలబ్రిటీలు డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కారు. హీరో నవదీప్ కారును ఆపి ట్రాఫిక్‌ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఇక హీరో నిఖిల్ తప్పతాగి పోలీసులపై చిందులు వేసిన ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. అలాగే, బిగ్‌బాస్-1 విన్నర్, హీరో శివబాలాజీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు నిరాకరించడం, పోలీసులపై చిందులు తొక్కడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇంకాస్త గతంలోకి వెళ్తే.. హీరో రవితేజ సోదరుడు భరత్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులపై దాడి చేసి కోర్ట్ మెట్లు ఎక్కాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఔటర్ రింగ్‌రోడ్డుపై లారీని ఢీకొట్టి దుర్మణం పాలయ్యాడు.

స్టార్‌ రైటర్లు కూడా…

సినిమా హీరోలే కాదు, స్టార్ రచయితలు కూడా మందు కొట్టి పోలీసులకు పట్టుబడిన సంఘటనలున్నాయి. సినీ రచయిత కోనా వెంకట్ కూడా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. మరో రచయిత బీవీఎస్ రవి కూడా బ్రీత్ ఎనలైజర్ ముందు బుక్ అయ్యాడు. ఇక రవితేజ స్నేహితుడు, మేనేజర్ రాజా రవీంద్ర సైతం ఆల్కహాల్ సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడమే కాదు.. పోలీసులపై చిందులు తొక్కడం, తప్పించుకొనే ప్రయత్నాలు చేయడం కూడా పలుసార్లు చర్చలకు దారి తీస్తున్నాయి.

టెర్రరిస్టులే అంటున్న పోలీసులు :

ఇలా మద్యం తాగి డ్రైవింగ్‌ చేయొద్దంటూ ప్రచారం కల్పించిన ఈ సెలెబ్రిటీలు… పోలీసుల కౌన్సిలింగ్, కోర్ట్ ఫైన్‌లతో బయటపడ్డారు. మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే మారిన రూల్స్ ప్రకారం వీళ్లు జైలు శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యం. ప్రభుత్వం నుండి మందుబాబులు సేఫ్‌గా ఇంటికి చేరేందుకు బార్‌లకు ఓలా క్యాబ్‌లు అనుసంధానం చేస్తూ స్మార్ట్ రైడ్ యాప్ తీసుకొచ్చినా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గణనీయంగా పెరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం సేవించి వాహనం నడిపి అమాయకుల ప్రాణాలను తోడేస్తున్న మందుబాబులకు కఠిన శిక్షలు విధించకపోతే రాబోయే రోజుల్లో ఇదే కీలక సమస్యగా మారబోతోందన్నది విశ్లేషకుల మాట. మరోవైపు.. సైబరాబాద్‌ పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపే వారు టెర్రరిస్టులతో సమానం అంటున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *