బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు

బీజేపీలో దుబ్బాక హుషారు – జీహెచ్‌ఎంసీలో టీఆర్ఎస్‌కు చుక్కలు

దుబ్బాక దంగల్‌ సర్కారులో భయం పుట్టిస్తోంది. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఆ ఒక్కసీటే తమ సామ్రాజ్యానికి బీటలు పుట్టిస్తోందని హడలెత్తిపోతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుముందెన్నడూ లేని విధంగా కష్టపడుతోంది.

ఏక ఛత్రాధిపత్యాన్ని షేక్‌ చేసిన షాక్‌ :

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఒక్కసీటు మాత్రమే కాదు. ప్రత్యేక తెలంగాణలో ఇప్పటిదాకా ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నామనుకుంటున్న తెలంగాణ రాష్ట్రసమితి ముఖ్యుల నియోజకవర్గాలను షేక్‌ చేసిన ఒక షాక్‌. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ అంటేనే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావు అనే మాదిరిగా పాలన సాగుతోంది. కేసీఆర్‌.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనతను తనొక్కడి ఖాతాలోనే వేసుకున్నారు. కేసీఆర్‌ కుమారుడిగా కేటీఆర్‌కు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదురు లేదు. ఇక, పార్టీ ఆలోచన, ఆవిర్భావం నుంచీ కేసీఆర్‌కు నమ్మిన బంటులా, పార్టీని పునాదుల నుంచి పటిష్టంగా మార్చారు హరీష్‌రావు. ట్రబుల్‌ షూటర్‌గా, గెలుపు వ్యూహకర్తగా పేరు పొందారు. అయితే ఈ ముగ్గురి నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగి ఉంది దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడానికి టీఆర్‌ఎస్‌ అనుసరించని వ్యూహం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చేయని ప్రయత్నం లేదు.

 

ప్రత్యర్థి, ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అత్యంత బలంగా మారాడన్న సంకేతాలు రావడంతోనే పోలీసులనూ ప్రయోగించారన్న ఆరోపణలున్నాయి. నిత్యం అడుగడుగునా బీజేపీ అభ్యర్థి కాన్వాయ్‌ని తనిఖీలు చేయడం, బీజేపీ అభ్యర్థి ఇంట్లోనూ ముందస్తు సమాచారం లేకుండా సోదాలు జరపడం, దుబ్బాకకు సంబంధం లేకున్నా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ అభ్యర్థి బంధువుల ఇళ్లపై దాడులు చేయడం, భారీగా నగదును స్వాధీనం చేసుకొని.. అవి దుబ్బాక బీజేపీ అభ్యర్థివే అని ప్రకటించడం వంటి పరిణామాలతో టీఆర్‌ఎస్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటన్నింటి నడుమ, టీఆర్‌ఎస్‌ బలమైన వ్యూహాల నడుమ బీజేపీ దుబ్బాకలో జెండాను ఎగరేయడం, అదీ ముగ్గురు ప్రధాన నేతల నియోజకవర్గాలను ఆనుకొని ఉన్న స్థానం కావడం టీఆర్‌ఎస్‌కు అతిపెద్ద ఝలక్‌. అంతేకాదు.. రాష్ట్రంలో అధికారంలో ఉండి… సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోవడం అంటే టీఆర్‌ఎస్‌కు కోలుకోలేని కొరడా దెబ్బ. అభ్యర్థి మరణంతో సానుభూతి వెల్లువెత్తాల్సిన చోట.. ఓటర్ల నుంచే ఈ రకమైన ప్రతిఘటన ఎదురుకావడం.. అదికూడా తమకు కంచుకోటగా టీఆర్‌ఎస్‌ భావించే స్థానాన్ని చేజార్చుకోవడం ఆ పార్టీకి ఆశనిపాతమే.

దుబ్బాక దడతో జీహెచ్‌ఎంసీలో నిలువెల్లా వణుకు :

దుబ్బాక దడ పట్టుకోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలన్న భయం టీఆర్‌ఎస్‌ను నిలువెల్లా వణికిస్తోంది. తొలుత ఎన్నికలను సంక్రాంతి దాకా వాయిదా వేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలోచించింది. కానీ, ఆ గ్యాప్‌లో మరిన్ని షాక్‌లు తగిలే సూచనలు కనిపించాయి. దీంతో, ఆలస్యం అమృతం విషం అన్న నానుడిని నెమరేసుకున్న టీఆర్‌ఎస్‌ ఎదుటివాళ్లకు ఆ ఛాన్స్‌ ఇవ్వొద్దని భావించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సై అంది. ఇక, తన కార్యాచరణ మొదలెట్టింది.

ఆస్తిపన్నులో 50శాతం రాయితీ :

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇంటి యజమానులకు ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ప్రకటించారు. 15వేల రూపాయల లోపు ఇంటిపన్ను చెల్లిస్తున్న వాళ్లకు డిస్కౌంట్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని టీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. కానీ, ప్రజలకు అర్థమైపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ఈ కొత్త నిర్ణయానికి టార్గెట్‌ అని తెలిసిపోయింది. అయితే, ఒక్క జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో కూడా 10వేల రూపాయలలోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31.30 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13.72 లక్షల కుటుంబాలకు, ఇతర మున్సిపాలిటీలలో 17.68 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ప్రకటించింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.326.48 కోట్లు భారం పడుతుందని కూడా అంచనా వేసింది. అంటే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా తాము ఈ పథకాన్ని ప్రకటించలేదని వాదించే ప్రయత్నం చేసింది. కానీ, లోగుట్టు ఏంటో అందరికీ అర్థమైపోయింది.

పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపు :

ఇక, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు పెంచారు. అతి తక్కువ జీతాలకే పని చేస్తున్న ఆ విభాగానికి చెందిన కార్మికులకు మూడు వేల రూపాయల వేతనాన్ని పెంచారు. ఇప్పటిదాకా రూ.14500 వేతనం అందుకుంటున్న సిబ్బందికి జీతాన్ని రూ.17,500కు పెంపుదల చేశారు. ఈమేరకు 610 జీవోను జారీచేశారు. ఆస్తిపన్ను రాయితీతో పాటే ఈ ప్రకటన కూడా చేశారు. ఫలితంగా ఎన్నికల్లో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కావాలా? :

దుబ్బాకలో బీజేపీని గెలిపించినందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంటిపన్నులో 50శాతం డిస్కౌంట్‌ ప్రకటించిందని, ఇక, జీహెచ్‌ఎంసీలో కూడా బీజేపీని గెలిపిస్తే రాష్ట్రప్రజలందరినీ వెంటాడుతున్న కొత్త ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ రద్దు అవుతుందని, ఓటర్లు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని బీజేపీ ప్రచారం మొదలెట్టింది. సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఈ నినాదం వైరల్‌ అయిపోయింది.

వరద సాయం పంపిణీలో బొక్కబోర్లా పడ్డ టీఆర్‌ఎస్‌ :

అంతకు ముందు, హైదరాబాద్‌ వరద బాధితులకు సహాయం పంపిణీ విషయంలో టీఆర్‌ఎస్‌ బొక్కబోర్లా పడింది. కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చేసిన ప్రకటన వాళ్లకే సెల్ఫ్‌గోల్‌ అయ్యింది. ఇటీవల హైదరాబాద్‌ను ఈ తరంలో ఎన్నడూలేని విధంగా వరదలు ముంచెత్తాయి. హైదరాబాద్‌ నగరమంతా మునిగిపోయింది. వందేళ్లక్రితం ఇలాంటి వరదలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ స్థాయిలో వరదలు వచ్చాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునిగిపోయాయి. వేలు, లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు నీళల్ల్లో మునిగిపోయాయి. మూసీనది వెంట ఇళ్లు కొట్టుకుపోయాయి. వందల ట్రాన్స్‌ఫార్మర్లు నీటిపాలైపోయాయి. జనం తీవ్రంగా నష్టపోయారు. కొద్దిరోజుల పాటు ఇళ్లల్లోనుంచి బయటకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. అసలే కరోనా లాక్‌డౌన్‌ పుణ్యమాని ఎనిమిది నెలలుగా అవస్థలు పడుతున్న జనానికి ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా పరిణమించింది. అయితే, ఇంతటి భారీ నష్టాన్ని ఎదుర్కొన్న హైదరాబాద్ వాసులకు ఇంటింటికీ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే రూ.550 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే, అక్కడే అసలు అంకానికి తెర లేచింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ఈ ప్రకటనకు ప్రధాన కారణమన్న విషయం రాజకీయ వర్గాల్లోనే కాదు.. సామాన్యులకూ తెలిసిపోయింది. ఎలాగంటే, టీఆర్‌ఎస్‌ నాయకుల ద్వారానే వరద సాయాన్ని పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టింది. ఫలితంగా ఓటర్లకు టీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుండిపోతారని, త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తారని టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ భావించింది. కానీ, అది బూమరాంగ్ అయ్యింది.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల కక్కుర్తి :

సాధారణంగా ప్రకృతి విపత్తులతో జనం నష్టపోతే తక్షణ సాయం, ప్రభుత్వం ప్రకటించిన సాయం ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగానే పంపిణీ చేస్తారు. ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే సాయానికి ఓలెక్క ఉంటుంది. బాధ్యత ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్‌ ఉంటుంది. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసాధారణంగా వ్యవహరించింది. టీఆర్ఎస్ స్థానిక నేతల ద్వారా ఈ వరద నష్టం సాయాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులే వరద నష్టం సాయం పేరిట హడావిడి చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో బాధితులకు ఏం అందిందనే దానికి నిత్యం జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం… వరద సాయం పంపిణీ విషయంలో టీఆర్ఎస్‌ నాయకుల కక్కుర్తి బట్టబయలవుతోంది. కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అనుకున్న వాళ్లకే కొంతమంది వరద సాయాన్ని అందిస్తున్నారట. అలాగే, సొంత ఇల్లు ఓనర్లకు కాకుండా అద్దెకు ఉంటున్నవాళ్లకు ఈ సాయం డబ్బులు పంపిణీ చేస్తున్నారట. కొన్ని ప్రాంతాల్లో అయితే, 5వేల రూపాయల చొప్పున మాత్రమే బాధిత కుటుంబానికి ఇచ్చి.. మిగతా ఐదు వేల రూపాయలు టీఆర్‌ఎస్‌ నాయకులే తీసుకుంటున్నారట. ఇంకొన్ని ఏరియాల్లో ఓట్ల జాబితాను పక్కనబెట్టుకొని జాబితాలో పేర్లున్న వాళ్లకే అందిస్తున్నారట. అయితే ఇది కూడా పూర్తిస్థాయిలో జరగడం లేదు. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ వరద సాయం గురించిన ప్రస్తావనే లేదని కూడా చెబుతున్నారు. ఇక.. టీఆర్‌ఎస్‌ నాయకులు వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖర్చుకూ కలిసొచ్చేలా ఈ వరద సాయాన్ని ఇలా పంపిణీ చేయిస్తున్నారన్న చర్చకూడా జరుగుతోంది.

ఇవీ లెక్కలు :

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వం మాత్రం లెక్కలు చెబుతోంది. బాధితులకు వరద సాయాన్ని ఉద్యమ రీతిలో పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తోంది. ఇటీవల చేసిన ప్రకటనలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 4 లక్షల 75వేల 871 కుటుంబాలకు 475 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశామని గర్వంగా చెప్పుకుంది ప్రభుత్వం. అంటే.. ప్రభుత్వం కేటాయించిన 550 కోట్ల రూపాయల్లో నివేదికల ప్రకారం సింహభాగం పంపిణీ పూర్తయ్యింది. కానీ, నిత్యం జీహెచ్‌ఎంసీ కార్యాలయాల దగ్గర, కార్పొరేటర్లు, మంత్రుల పర్యటనల్లో బాధితులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అట్టహాసంగా ప్రకటించిన వరద సాయం తమకేదని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకోసం దాదాపు గత ఆరు నెలల నుంచే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, మరోసారి గులాబీ జెండా ఎగురవేయడమే ఆశయంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఉంటుంది. తన వ్యూహాలు అమలు చేయడానికి మిగతా ఏ పార్టీకి లేని అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లుగా ఆ వెసులుబాటునే వాడుకుంది టీఆర్‌ఎస్‌. ఎన్నికల్లో గెలుపు బావుటా వెనుక ఈ తంత్రం దాగి ఉందనేది బహిరంగ రహస్యమే.

బీజేపీ పకడ్బందీ వ్యూహం :

మరోవైపు.. దుబ్బాక ఎన్నికల ఫలితంతో జోరుగా, హుషారుగా ఉన్న బీజేపీ జీహెచ్‌ఎంసీలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇదే జోరును కంటిన్యూ చేయాలని తాపత్రయపడుతోంది. ఎన్నడూ లేని విధంగా జాతీయస్థాయి నేతలతో ఎన్నికల సమన్వయ కమిటీని ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బీజేపీ ఇంచార్జ్‌గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్‌ను నియమించారు. అలాగే సహ ఇంచార్జ్‌లుగా కర్నాటక మంత్రులు సతీష్‌రెడ్డి, సుధాకర్‌, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఆశిష్‌, గుజరాత్‌కు చెందిన నేత ప్రదీప్‌ సిన్హ్‌ వాగేలాను నియమించారు. ఈమేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కమిటీ వివరాలను ప్రకటించారు.

అంతేకాదు.. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా 23 మంది సభ్యులతో స్థానికంగా జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చైర్మన్‌గా, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మాజీ ఎంపీ వివేక్‌, గరికపాటి మోహన్‌రావు, చింత రామచంద్రారెడ్డి జాయింట్‌ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో డీకె అరుణ; మురళీధర్‌రావు, రాజాసింగ్‌, రామచంద్రారావు, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, మోత్కుపల్లి నర్సింహులు, రవీంద్రనాయక్‌, పొంగులేటి సుధాకర్‌రావు, కె.రాములు, రాపోలు ఆనంద్‌భాస్కర్‌, రఘునందన్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శృతిని సభ్యులుగా నియమించారు.

ఓవైపు జాతీయస్థాయి పరిశీలనా కమిటీ, మరోవైపు స్థానికంగా రాష్ట్ర నేతలతో రూపొందించిన ఎన్నికల నిర్వహణ కమిటీతో బీజేపీ పూర్తిస్థాయిలో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగినట్లు సంకేతాలు ఇచ్చింది. ఓవైపు.. దుబ్బాకలో ఊహించని ఎదురుదెబ్బ తగలడం, మరోవైపు.. జీహెచ్‌ఎంసీలో వరద సాయం అవకతవకలు, మరోవైపు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పాటు.. జాతీయ నాయకత్వం కూడా దృష్టిపెట్టడం వంటి అంశాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఫలితంగా ఇప్పుడు జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ స్వరూపాన్నే మార్చివేయవచ్చంటున్నారు విశ్లేషకులు.

– సుజాత గోపగోని
(జాగృతి సౌజన్యంతో…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *