-
బిహార్‌లో చూసినా, దుబ్బాకలో చూసినా నిజమైన సర్వేలు
-
మిగతా సర్వేలన్నీ బొక్కబోర్లా పడ్డ పరిస్థితి
అటు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చూసినా, ఇటు దుబ్బాక ఫలితం చూసినా మిషన్ చాణక్య సత్తా చాటింది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఖచ్చితమైన లెక్కలను ముందుగానే పసిగట్టింది. ఇతర సంస్థలు చేసిన ఏ సర్వే నిజం కాలేదు. దుబ్బాకలో ఆరా సర్వే అటూ ఇటూగా ఫలితాన్ని అంచనా వేసింది. బిహార్‌లో ఏబీపీ సీ-ఓటర్ సర్వే కూడా మిషన్ చాణక్యను అనుసరించింది.
ఎగ్జిట్ పోల్స్.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ ప్రాంతంలో పోలింగ్ సాగినా అంతటా వీటిపైనే చర్చ జరుగుతుంది. కాస్త అటూ ఇటూగా ఎగ్జిట్‌పోల్ సర్వేలు గెలుపు లెక్కలను ముందుగానే జనం ముందుకు తెస్తాయి. ఓట్ల లెక్కింపులో ట్రెండ్ ఎలా ఉంటుందో, ఫలితాలు ఎవరికి మొగ్గు చూపిస్తాయో తెలియాలంటే ఎగ్జిట్పోల్స్పైనే భారం వేస్తాయి రాజకీయ పార్టీలు. ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ ఎగ్జిట్‌పోల్స్‌నే నమ్ముతారు.
షరా మామూలుగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలపై ఆయా సంస్థలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిర్వహించాయి. బిహార్‌లో మూడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే సర్వేల వివరాలు బయటపెట్టాయి. ఓట్ల లెక్కింపు జరిగేదాకా దేశవ్యాప్తంగా వాటిపైనే చర్చ జరిగింది.
నిజమైన మిషన్ చాణక్య ఎగ్జిట్‌పోల్ సర్వేలు :
అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, దుబ్బాక ఉప ఎన్నికలో చూసినా మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ఒక్కటే నిజమయ్యింది. ఎన్నికల ఫలితాలు ఈ మిషన్ చాణక్య సర్వే ఫలితాలను ప్రతిబింబించాయి. బిహార్‌లో ఎన్డీయేకు మ్యాజిక్ ఫిగర్ స్థానాలు వస్తాయని చాణక్య కుండబద్దలు కొట్టింది. కానీ, మిగతా ఏ సర్వేలు కూడా ఎన్డీయేకు మొగ్గు చూపలేదు. అక్కడ మహా ఘట్ బంధన్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తాయని మిగతా అన్ని సర్వేలు చెప్పాయి. అయితే, మ్యాజిక్ ఫిగర్ రాదని తేల్చాయి. ఓట్ల లెక్కింపు సాగినకొద్దీ, రౌండ్ రౌండ్‌కూ ఫలితం బయటకు వస్తున్న కొద్దీ ఇతర సంస్థల సర్వే ఫలితాలన్నీ బొక్కబోర్లా పడ్డాయి.
దుబ్బాకలో బీజేపీ ఘన విజయాన్ని సాధిస్తుందని మిషన్ చాణక్య ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనా వేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 51.82 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని, టీఆర్ఎస్ రెండోస్థానంలో నిలుస్తుందని చెప్పింది. ఆ పార్టీకి 35.67 శాతం ఓట్ల లభిస్తాయని పేర్కొంది. టీఆర్ఎస్కు సానుభూతి పవనాలు కూడా పనిచేయకపోవచ్చని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలుస్తారని, అయితే, ఓట్ల శాతంలో అతిస్వల్పంగా తేడా ఉంటుందని ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పింది. టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతకు 48.72 శాత మేర ఓట్లు పడే అవకాశం ఉందని ఆరా అంచనా వేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన రఘునందన్ రావుకు 44.64 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని ఆరా సర్వేలో తేలింది. అంతేకాదు.. ఫలితాలు అటూ ఇటూగా ఉండవచ్చని కూడా ఆరా సర్వే అంచనా వేసింది. అయితే థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందని పేర్కొంది. టీఆర్ఎస్ అభ్యర్థికి 51 నుంచి 54శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ, ఆ అంచనా నిజం కాలేదు.
ఇక, బిహార్‌లో మాత్రం మిషన్ చాణక్య, ఏబీపీ-సీఓటర్ సర్వేల్లో మాత్రమే ఖచ్చితమైన లెక్కలు వచ్చాయి. ఈ రెండు మినహా బిహార్‌లో ఎగ్జిట్‌పోల్ సర్వే చేసిన అన్ని సంస్థలూ కళ్లు తేలేశాయి. మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్‌లో ఎన్డీఏ కూటమి 128 సీట్లతో అతి పెద్ద కూటమిగా అవతరిస్తుందని చెప్పింది. గట్టి పోటీ ఇస్తున్న మహా ఘట్ బంధన్ కూటమికి 105 స్థానాల్లో విజయం వరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఏబీపీ, సీ ఓటర్ సర్వే చూస్తే.. ఎన్డీఏకు 104 నుంచి 128 సీట్లు, యూపీఏకు 108 నుంచి 121 సీట్లు లభిస్తాయంది. పీపుల్స్ పల్స్ సర్వే.. మహాఘట్ బంధన్‌కు 95 నుంచి 120 స్థానాలు, ఎన్డీయేకు 75 నుంచి 105 స్థానాలు దక్కుతాయని చెప్పింది. టైమ్స్ నౌ, సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. మహా ఘట్ బంధన్ కూటమికి 120 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. ఎన్డీఏ కూటమి 116 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొన్నాయి. రిపబ్లిక్ టీవీ, జన్ కి బాత్ సంయుక్తంగా చేసిన సర్వేలో మహాఘట్ బంధన్‌కు 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీఏకు 91 నుంచి 117 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. మహా ఘట్ బంధన్‌కు 120 సీట్లు, ఎన్డీఏకు 116 సీట్లు వస్తాయని తేల్చాయి.
బిహార్‌లో అధికారం దక్కించుకోవాలంటే 122 స్థానాలు గెలుచుకోవాలి. మిషన్ చాణక్య, ఏబీపీ సీ ఓటర్ సర్వేలు మాత్రమే ఎన్డీయే కూటమికి మ్యాజిక్ ఫిగర్ సీట్లు వస్తాయని చెప్పాయి. మిగతా అన్ని సర్వేలు మహా ఘట్ బంధన్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పాయి. అంతేకాదు.. స్పష్టమైన మెజారిటీ ఏ కూటమికీ రాదని కూడా మిగతా సర్వేలు చెప్పాయి. అంటే.. ఈసారి ఒంటరిగా పోటీ చేసిన ఎల్జేపీ, ఇండిపెండెంట్లు కీలకంగా మారవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. కానీ, ఎన్డీయే సత్తా చాటింది, అధిక సీట్లే కాదు.. మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్లింది. దీంతో మిగతా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ప్రామాణికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
One Comment on “Exit polls : ఎగ్జిట్‌పోల్స్‌లో సత్తా చాటిన మిషన్ చాణక్య”