FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఆ లేఖలో ఉన్న మూడు లోపాలేంటి ?

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఈ దుమారం రేపింది ఎవరు ? అసలు ఈ వ్యవహారానికి మూలకారణమేంటి? ఫుల్‌ డీటెయిల్స్‌ చూద్దాం…

హైదరాబాద్‌లో గత నెల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. వందేళ్ల క్రితం నాటి వరదలను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్‌ నగరం దాదాపు సగం మునిగిపోయింది. అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇది ఎన్నికల తాయిలంగా ఉపయోగపడుతుందన్ననది బహిరంగ రహస్యమే. అయితే, ఇదే సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ – జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. తొలుత ఈ వరద సాయం పంపిణీ కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ, ఆ తర్వాత ఈ పంపిణీని ఎన్నికలు పూర్తయ్యేదాకా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరద నష్టం వద్దంటూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారని, అందుకే ఎలక్షన్‌ కమిషన్‌ వరద సాయం పంపిణీని నిలిపివేసిందని ఆరోపణలు గుప్పిస్తున్న పోస్టులు వైరల్‌ అయ్యాయి. దీంతో జనంలో బీజేపీ పై వ్యతిరేకత వచ్చింది. తమకు అందించే సాయాన్ని అడ్డుకున్నారంటూ విమర్శలు చోటు చేసుకున్నాయి.

పరిశోధన :

అయితే, సోషల్ మీడియాలో తిరుగుతున్న లేఖపై ఫ్యాక్ట్‌ఫుల్‌ న్యూస్‌కు సందేహం కలిగింది. పరిశీలనలోనే పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో, ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్‌చెక్‌ చేసింది. పరిశీలనలో ప్రధానంగా మూడు లోపాలు కనిపించాయి. అవేంటంటే…

1. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో జరిగే ప్రక్రియ. కానీ, బండి సంజయ్‌ రాసిన లేఖ.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు అడ్రస్‌ చేశారు. అంటే.. అవగాహన లేకుండా రూపొందించిన ఫేక్‌ లెటర్‌గా అర్థమవుతోంది.

2. ఏ లేఖలో అయినా తేదీ రాయడం పరిపాటి. అధికారిక లేఖలకు తప్పనిసరి. ఈ లేఖలో ఏ రోజు రాశారో ప్రస్తావన లేదు.

3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన లెటర్‌ హెడ్‌లో ఆ ప్రస్తావన కూడా ఉండాలి. కానీ, ఈ తప్పుడు లేఖలో ఆప్రస్తావన లేదు.

ఈ మూడు అంశాలు పరిశీలనలోనే బయటపడ్డాయి. దీనికి తోడు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ లేఖపై స్వయంగా స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ లేఖ తాను రాసింది కాదని, తనకు, తన పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు ఎవరో తప్పుడు లేఖను సృష్టించారని, అందులో ఉన్న సంతకం కూడా తనది కాదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు కాపీని తెలంగాణ డీజీపీకి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా పంపించారు. ఆ లేఖను కింద చూడొచ్చు.

అలాగే, బీజేపీ తెలంగాణ కమిటీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ ట్విట్టర్‌లో ఏముందో కింద చూడొచ్చు.

FACT CHECK – ఏదినిజం ? : ఇది అబద్ధం

బండి సంజయ్‌ రాశారంటూ ప్రచారమవుతున్న లేఖపై చేసిన ఫ్యాక్ట్‌చెక్‌లో ఇది అబద్ధమని నిరూపితమయ్యింది. బీజేపీకి ఆదరణను తగ్గించే కుట్రగా అర్థమవుతోంది. కాబట్టి.. ఆ లేఖను ఎవరూ పరిగణనలోకి తీసుకోవొద్దంటూ ఫ్యాక్ట్‌ఫుల్‌ న్యూస్‌ వెబ్ పోర్టల్‌ విజ్ఞప్తి చేస్తోంది.

 

ప్రచారం : హైదరాబాద్ వాసులకు వరదసాయం నిలిపేయాలంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు.

వాస్తవం : బండి సంజయ్‌ ఆ లేఖ రాయలేదు. స్వయంగా ఆయనే ఈవిషయాన్ని ప్రకటించడంతో పాటు.. తప్పుడు లేఖపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంక్లూజన్‌ : లేఖను పరిశీలిస్తేనే పలు దోషాలు బయటపడ్డాయి. కాబట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలో భాగమే ఈ లేఖ అని అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *