FACTCHECK – ఏదినిజం? : ఈ ఫోటో తీయడానికి 16 కెమెరాలు ఉపయోగించారా? 62 రోజుల సమయం పట్టిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్‌చెక్ కథనంలో వాస్తవమేంటో చూద్దాం…
పొడవైన సమాంతర చెట్ల మధ్య పైభాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోను తీయడానికి ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించారని ఈ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. అలాగే, ఈ ఫోటో తీయడానికి 62 రోజులు పట్టిందని ఆ పోస్ట్ వివరిస్తోంది.
వైరల్ అవుతున్నది ఏంటి?
రెండు ఎత్తైన సమాంతర చెట్ల మధ్య పై భాగంలో ఒకే సరళ రేఖపై పైన చంద్రుడు కింద సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ ఫోటో ఈ యాంగిల్లో తీయడానికి ఒక జర్మన్ ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించాడు, మరియు 62 రోజులు వేచి చూడాల్సి వచ్చింది. దీనిని ఇలా మళ్లీ 2035లో మాత్రమే చూడవచ్చు’ అని ఈ పోస్ట్‌లో పేర్కొంటున్నారు.
ఇది నిజమేనా?
రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి ఆన్లైన్లో ఈ ఫోటో కోసం శోధించడం జరిగింది. అయితే, బెస్ హమితి అనే ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోను తీసినట్లు మాకొక లింక్ దొరికింది ఆ లింక్ theglobalartcompany.com ఇది.
ఈ ఇమేజ్ను బెస్ హమితి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 2016, జనవరి 31న అప్లోడ్ చేశాడు.
వైరల్ అవుతున్న పోస్ట్‌ను పోలిన మరో ఫోటో కూడా దొరికింది. అయితే, దాని బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా భిన్నంగా ఉంది.
అయితే, ఇది నిజమా, కాదా… అని తెలుసుకునేందుకు బెస్ హమితిని సంప్రదించగా.. ఈ ఇమేజ్ ఫోటోషాప్‌లో ఎడిట్ చేసిన ఇమేజ్ అని చెప్పారు. అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్‌లో ఈ ఇమేజ్ను రూపొందించానని, దీనికి సంబంధించి.. తాను ఇమేజ్ను ఎలా రూపొందించానో.. ఆ ప్రాసెసింగ్ అంతా వీడియో రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశానని బెస్ హమితి చెప్పాడు.
16 కెమెరాలను ఉపయోగించడం, 62 రోజులు వెయిట్ చేసి ఈ ఫోటో తీశానంటూ జరుగుతున్న వాదన నిజం కాదని ఈ ఇమేజ్ను ఫోటోషాప్‌లో తయారుచేసిన బెస్ హమితి తెలిపారు.
బెస్ హమితి చెప్పినట్లుగా అతని అధికారిక యూట్యూబ్ ఛానెల్లో వెతికితే ఈ వీడియో లభించింది. అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటోను ఎలా రూపొందించాడో ఆ వీడియోలో వివరంగా చెప్పాడు. ఈ వీడియో 2012 లో అప్లోడ్ చేశాడు.
ఫ్యాక్ట్‌ఫుల్ ఫ్యాక్ట్ చెక్ – ఇది అబద్ధం :
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీ పోస్ట్. ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగించి అడోబ్ ఫోటోషాప్‌లో ఈ ఫోటోను ఎడిట్ చేశారు.