Indo – China Border : నివురుగప్పిన నిప్పులా సరిహద్దులు – చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన ఆ దేశ మాజీ సైనికాధికారి ఎవరు ?

చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇరు దేశాలూ విదేశాంగ మంత్రుల స్థాయిలో పంచసూత్రాల ఒప్పందం కుదుర్చుకున్నా.. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. చైనా సహజ గుణానికి అనుగుణంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. అయితే.. భారత్‌ చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సమాయత్తమవుతోంది. చైనా కుట్రలకు భారత్‌ సరైన వ్యూహాలు రచిస్తోంది.  ఈ క్రమంలోనే చైనా ఆర్మీకి ఆ దేశ మాజీ సైనికాధికారి వార్నింగ్‌ ఇచ్చారు.

 

ఓవైపు సరిహద్దుల్లో కవ్వింపులు, మరోవైపు చర్చల్లో మొసలి కన్నీళ్లు :

ఓవైపు సరిహద్దుల్లో కవ్వింపులు, మరోవైపు చర్చల్లో మొసలి కన్నీళ్లు… చైనా సైన్యం, సైనికాధికారుల తీరు ఇది. దాదాపు గడిచిన ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిగినా, నేరుగా రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య సంభాషణలు సాగినా, చైనా మాత్రం తన కపటబుద్ధిని వదిలిపెట్టడం లేదు.

సరిహద్దుల్లోకి చొచ్చుకురావడం, ఎల్‌ఏసీ దాటుకొని వచ్చేందుకు ప్రయత్నించడం, భారత సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం, మానసికంగా కుంగదీసే విధంగా కోతి చేష్టలకు పాల్పడటం చైనా సైన్యానికే చెల్లింది. అయితే, భారత ఆర్మీ మాత్రం చైనా సైనికుల వెర్రి పనులను భలే ఎంజాయ్‌ చేస్తున్నారని ఆర్మీ అధికారులు కూడా ఓ దశలో వ్యాఖ్యానించారు. అయితే, చైనా సైనికుల చేష్టలను ఎంజాయ్‌ చేస్తూనే నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని, భారత సైన్యానికి భయపడే.. చైనా సైన్యం ఇలా వ్యవహరిస్తోందన్న వాదనలు కూడా వినిపించాయి.

భారత సైన్యం సర్వ సన్నద్ధం :

ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగితే దీటుగా ఎదుర్కోనేందుకు భారత్ సిద్ధమవుతోంది. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పీవోకే, చైనా సరిహద్దుల్లో ఓ ఫార్‌వర్డ్ ఎయిర్‌బేస్‌ను భారత వాయుసేన ఏర్పాటు చేసి.. నిరంతరం పహారా కాస్తోంది. ఈ శిబిరం పాకిస్తాన్‌కు కేవలం 50కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే వ్యూహాత్మకంగా ముఖ్యమైన దౌలత్ బేగ్ ఓల్డీకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాక్, చైనా రెండూ కలిసి దాడి చేసినా దీటుగా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన స్పష్టం చేసింది.

భారత్-చైనా దళాల మధ్య గల్వాన్ నదీ తీరంలో గత జూన్‌ 25వ తేదీన ఘర్షణ జరిగింది. ఈ నది కొంత దూరం ప్రవహించిన తర్వాత ష్యాక్ నదిలో కలుస్తుంది. ఈ ష్యాక్ నదీతీరంలో ఉన్న ఖర్దూంగా పాస్‌లోనే భారత వాయుసేన ఫార్వర్డ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ సుఖోయ్-30ఎమ్‌కేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్టులు ఎగరడానికి సిద్ధంగా ఉంచారు. అలాగే రవాణా కోసం సీ-130జే సూపర్ హెర్క్యూలిస్, ఇయూషిన్-76, ఆంటన్-32 వంటి ప్లేన్స్‌ ఉన్నాయి.

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ శిబిరం 24గంటలూ పహారా కాస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. రాత్రి, పగలూ రెండు పూట్లా గస్తీ తిరుగుతోందని అధికారులు చెప్పారు. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా సైనిక బృందాలు, ఆహార పదార్థాలు, ఆయుధ సామగ్రి వంటివి తీసుకెళ్లి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఎల్‌వోసీ వెంబడి ఉన్న సైనిక శిబిరాలకు చేరుస్తున్నాయి.

 

భారత సైన్యంతో జాగ్రత్త : చైనా మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్చరిక :

మరోవైపు.. చైనా దళాలు భారత సైన్యాన్ని చూస్తేనే వణికిపోతున్నాయని తెలుస్తోంది. అందుకే గతంలో కంటే దుందుడుకు చర్యలకు కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చైనా మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ తమ దేశ సైన్యానికి హెచ్చరికలు జారీచేశారు. భారత్‌ సైలెంట్‌గా ఉందని తేలిగ్గా తీసుకోవద్దని, సమయం చూసి షాక్‌ ఇస్తుంది.. జాగ్రత్త అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తోన్న చైనాకు చెందిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్‌హాంగ్ యాంగ్… తమ దేశ ఆర్మీని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన గతంలో వాన్ జింగ్ మిలటరీ రీజియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. భారత సైన్యం సామర్థ్యం, ధైర్యసాహసాలు, వ్యూహాల గురించి తమ దేశానికి చెందిన ఓ సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఈమేరకు హెచ్చరికలు చేశారని అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

చైనా సైన్యం భారత ఆర్మీని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని చైనా సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్‌హాంగ్ యాంగ్ హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్ షాక్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లిజన్ అనే రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ఓ సోషల్‌ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేసినట్లు చైనా మీడియాలో పేర్కొన్నారు.

చైనా దళాలకు పోటీగా భారత్ కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని తీసుకొచ్చిందని జనరల్ వాంగ్‌హాంగ్ యాంగ్ వెల్లడించారు. నిజానికి ఎల్ఏసీ వద్ద 50 వేల మంది సైనికులు సరిపోతారని, కానీ భారత్ దీనికి అదనంగా మరో లక్షమంది బలగాలను తరలించిందని తెలిపారు. శీతాకాలంలో సాధారణంగా దళాల సంఖ్యను తగ్గించాల్సి ఉంటుందని, కానీ.. ఇప్పుడు మాత్రం ఆ సంప్రదాయానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్‌ వైపు దళాలు పోగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దళాలు మొత్తం చైనా సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని.. యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే చైనాలోకి దూసుకు వచ్చే సామర్థ్యం వీటికి ఉందని కూడా వాంగ్‌హాంగ్‌ యాంగ్‌ పేర్కొన్నారు. అయితే.. ఈ దళాల సంఖ్యను వెల్లడించడం వెనుక.. ఆయన ఏ రిపోర్టును ఆధారంగా తీసుకున్నారన్న విషయం మాత్రం తెలియలేదు.

మరోవైపు.. చైనా- తైవాన్ మధ్య మర్షణలు తలెత్తితే.. అమెరికా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని, అదే జరిగితే చైనాకు ఇబ్బంది తప్పదని వాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. భారత్‌ కూడా అదే సమయంలో దాడి చేయవచ్చని ఆయన అంచనా వేశారు. భారత్‌-చైనా మధ్య ఆరో విడత కోర్‌ కమాండర్ స్థాయి చర్చలు జరిగి సంయుక్త ప్రకటన వెలువడిన తర్వాత.. ఈ ఆర్టికల్ చైనా మీడియాలో ప్రచురితమయ్యింది.

హాంగ్‌కాంగ్‌ విశ్లేషకులదీ అదే మాట :

అంతేకాదు.. హాంకాంగ్‌కు చెందిన సైనిక వ్యవహారాల విశ్లేషకుడు సాంగ్ జాంగ్ పింగ్ కూడా వాంగ్‌హాంగ్‌ యాంగ్‌ అభిప్రాయంపై స్పందించారు. భారత్ తనదిగా భావిస్తున్న ప్రాంతాలు ఇప్పటికీ చైనాలో ఉండటంతో వాటిని భారత సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని జాంగ్‌పింగ్‌ విశ్లేషించారు.

ఇక, చైనాతో చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించక పోవడంతో భారత్ శీతాకాలంలో సరిహద్దులను రక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎల్‌ఏసీ వద్ద భారత్‌కు 50వేల మంది సైనికులు ఉన్నారు. వీరికి మద్దతుగా ట్యాంక్‌లు, శతఘ్నులు, వాయుసేన కూడా మోహరించాయి. శీతాకాలంలో చైనా ఆర్మీ దళాలు ఎంతమేరకు వెనక్కు తగ్గుతాయో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని భారత్‌ భావిస్తోంది.

చైనా మరో కుట్ర :

అటు.. చైనా దళాలు సరిహద్దుల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ వేస్తున్నాయి. దీంతో భారత బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. శాటిలైట్ల సాయంతో భారత్‌వైపు నిఘా పెట్టి ఆ సమాచారాన్ని చైనా దళాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ ద్వారా పంపించే అవకాశం కనిపిస్తోంది. ఆ దృశ్యాల విశ్లేషణ ద్వారా.. భారత్‌వైపు బలహీనంగా ఉన్న ప్రాంతాలను చైనా ఆక్రమించే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా కుటిల యత్నాలపై ముందుగానే ఓ అంచనాలో ఉన్న భారత సైన్యం కూడా దీటుగానే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

6 Comments on “Indo – China Border : నివురుగప్పిన నిప్పులా సరిహద్దులు – చైనాకు వార్నింగ్‌ ఇచ్చిన ఆ దేశ మాజీ సైనికాధికారి ఎవరు ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *