– దుబ్బాక, జీహెచ్ఎంసీ దెబ్బలు
– ఢిల్లీ టూర్ పర్యవసానాలు
కొత్త సంవత్సరం ఆరంభంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన స్టెప్పులు వేశారు. అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. 2021 ఆరంభానికి ముందు 2020 డిసెంబర్ చివర్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇన్నాళ్లూ కేసీఆర్ గంభీరంగా చేసిన ప్రకటనలు, నిర్ణయాలన్నీ యూటర్న్ బాటలో పయనించాయి. కొత్త యేడాది అంతా తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఇదే విధంగా ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఏమాత్రం హడావిడి లేకుండా, సైలెంట్‌గా తన నిర్ణయాలు, ప్రకటనలను మార్చేశారు కేసీఆర్.
వరుసగా యూటర్న్లు :
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను తెలంగాణలో అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే, డిసెంబర్ తొలి వారలోనే కేంద్ర వ్యవసాయ చట్టాలను బహిరంగంగానే వ్యతిరేకించిన కేసీఆర్.. చివరి వారం వచ్చేసరికి యూటర్న్ తీసుకున్నారు. ఆ చట్టాల అమలుకు సహకరించడంలో భాగంగా.. తెలంగాణలో అమలు చేస్తున్న నియంత్రిత సాగు పద్ధతికి స్వస్తి పలికారు. ఎల్ఆర్ఎస్పై వెనుకడుగు వేశారు. యేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. పీఆర్సీ, పదోన్నతుల ప్రక్రియపై ఉద్యోగులను ఆకర్షించే ప్రకటన చేయించారు. ఖాళీల భర్తీ తేనెతుట్టెను కదిపారు. అటు.. ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇన్నాళ్లుగా, యేళ్లుగా ఎదురుచూస్తున్న పలు అంశాలపై అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్. ఎల్ఆర్ఎస్ కారణంగా ఇబ్బందిపడుతున్న సామాన్య ప్రజానీకం.. ఉద్యోగుల విషయంలో.. విద్యార్థులు, రైతన్నలే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆకర్షించే ప్రకటనలతో ముందుకు వెళుతున్నారు.
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ :
రెండున్నర సంవత్సరాలుగా ఆయుష్మాన్ భారత్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే, ఆరోగ్యశ్రీ పథకం మెరుగైందని తొలి నుంచి కేసీఆర్ వాదించారు. దానిని అమలు చేయటానికి నిరాకరించారు. దీనిపై కార్పొరేట్ హాస్పిటల్స్ ఒత్తిళ్లు, తెలంగాణ సర్కారు వ్యూహాలు ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలోనూ ఆయష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయటానికి సుముఖత వ్యక్తంచేశారు.
వ్యవసాయ చట్టాలపై యూటర్న్ :
కేంద్ర వ్యవసాయ చట్టాలను బహిరంగంగానే విమర్శించిన కేసీఆర్.. డిసెంబర్ మొదటివారంలో చేపట్టి కిసాన్ భారత్ బంద్‌కు కూడా మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులతో ఆ బంద్‌పిలుపు విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అది జరిగిన నాలుగు రోజులకే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన కేసీఆర్.. ప్రధామంత్రి సహా.. కేంద్రంలోని పెద్దలను కలిసి వచ్చారు. కనీసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల్లో పాల్గొంటున్న రైతులనుగానీ, రైతు సంఘాలను గానీ కలవలేదు. వాళ్లకు సంఘీభావం ప్రకటించలేదు. అప్పుడే కేసీఆర్ తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ.. కేసీఆర్ ఢిల్లీనుంచి తిరిగి రాగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత సాగు పద్ధతికి స్వస్తి చెప్పారు. అంతేకాదు.. తెలంగాణలో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని సంచలన ప్రకటన చేశారు.
ఎల్ఆర్ఎస్పై వెనుకడుగు :
అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పైనా కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పై ప్రజానీకం నుంచి తొలినుంచీ తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అంతేకాదు.. న్యాయస్థానాల్లో కేసులు కూడా వేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టతనిచ్చింది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఉద్యోగులకు తీపి కబుర్లు :
ఇప్పటిదాకా ఉద్యోగులను అసలు ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్.. ఉన్నట్టుండి సడెన్‌గా వరాల జల్లు కురిపించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షుడిగా కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సరళమైన రీతిలో ఉద్యోగులకు సర్వీస్ రూల్స్.. పదవీ విరమణ రోజు ఆఫీసులోనే ఘనంగా సన్మానం.. ఇకపై విరమణ రోజే బెనిఫిట్స్ వంటి కీలక నిర్ణయాలతో ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే పీఆర్సీపైనా, ఖాళీల భర్తీపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ రాష్ట్రంలో నియామకాల ఊసే ఎత్తని కేసీఆర్.. తాజాగా భారీగా భర్తీలు చేయాలని నిర్ణయించారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం.. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని వెల్లడించారు.
ఆర్టీసీ ఉద్యోగులనూ ఆకట్టుకునే ప్రయత్నం :
అలాగే.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కేసీఆర్ శుభవార్తలు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ఇకపై ఆర్టీసీపై భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తామని, ప్రభుత్వానికి సంబంధం లేదని ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కారకుడైన కేసీఆర్, న్యాయస్థానంలోనూ వెనక్కితగ్గని కేసీఆర్.. ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకోవడం ఇప్పుడు ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు.. రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యింది.
కారణమిదే :
ఈ పరిణామాలతో కరోనా నామ సంవత్సరమైన 2020 చివరి మాసం తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఊహించని మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎందుకు..? ఏమిటి? అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదంటున్నారు విశ్లేషకులు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల దెబ్బ కేసీఆర్‌కు దారుణంగా తగిలిందనడంలో సందేహం లేదు. ఇకపై కూడా ఇదే శైలిని కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినాల్సి వస్తుందన్న సత్యాన్ని తెలుసుకుని ఉండొచ్చు. అందుకే వెంటనే అలర్ట్ అయ్యారు. ఎవరిని ఊరుకోబెడితే పరిస్థితి అదుపులోకి వస్తుందో అంచనా వేశారు. అంతే.. ఎవరూ ఊహించని రీతిలో వరుస యూటర్న్లు తీసుకున్నారు. తానే మోనార్క్ అనే ఆలోచనను పక్కనబెట్టి కేసీఆర్ వరుసగా కీలక నిర్ణయాలే తీసుకుంటూ వస్తున్నారు.
ఢిల్లీలో ఏం జరిగిందబ్బా ?
ఇటీవలికాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గడం వెనుక ఆంతర్యం.. కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో ముడిపడి ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తిరిగి పాత పద్ధతిలో కొనసాగిస్తుండటం, ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేయడం, నియంత్రిత సాగు విధానం, ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గడం.. అందులో భాగమేనని అంటున్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ వేయనున్న కీలక అడుగులకు వీటిని ప్రారంభంగా చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరిస్తాననే ప్రకటనలతో ముందుగా వాళ్లందరినీ మచ్చిక చేసుకునే ప్రయత్నం కేసీఆర్ చేసినట్లు అర్థమవుతోంది. అలాగే, జమిలి ఎన్నికల చర్చ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి టీఆర్ఎస్ విజయ పతాకం ఎగరేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ పక్కా వ్యూహంతో ఇలాంటి ప్రకటనలు చేసుకుంటూ పోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు.. తీసుకుంటున్న యూటర్న్‌లను ఎంత మేర ప్రజలు నమ్ముతారో చూడాల్సి ఉంది.