MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌

MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌
అంగారక గ్రహంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ -నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్‌ మరో ముందడుగు వేసింది. రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తచేసింది. అరుణ గ్రహంపై దిగిన రోవర్‌.. 33 నిమిషాల పాటు 6.5 మీటర్ల దూరం ప్రయాణించినట్టు నాసా తెలిపింది. రోవర్‌ పంపిన చిత్రాలను విడుదల చేసింది.

అరుణ గ్రహంపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2020 జూలై 30న పర్సెవరెన్స్‌ పేరుతో ఓ వోమ్యనౌకను పంపింది. అది ఫిబ్రవరి 18న అంగారక గ్రహంపై రోవర్‌ విజయవంతంగా దిగింది. తాజాగా పర్సెవరెన్స్ రోవర్‌ తన తొలి టెస్ట్‌ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన చిత్రాలను రోవర్‌ పంపింది. ఆ చిత్రాల్లో రోవర్‌ ట్రాక్‌ జాడలు స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం.

నాసా నిర్వహించిన టెస్ట్‌ డ్రైవ్‌లో ఆరు చక్రాలు ఉన్న పర్సెవరెన్స్‌ రోవర్‌… అంగారకుడి ఉపరితలంపై 6.5 మీటర్ల దూరాన్ని 33 నిమిషాల వ్యవధిలో ప్రయాణించింది. మొదట నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి.. ఆ తరువాత 150 డిగ్రీల కోణంలో ఎడమవైపునకు తిరిగి.. వెనక్కి మరో 2.5మీటర్ల దూరం ప్రయాణించింది. అంగారకుడిపై రోవర్‌ ప్రయాణించిన తీరు అద్భుతమని..ఈ మిషన్‌లో ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని నాసా తెలిపింది.

రోవర్‌ను నడిపించేందుకు మాకు లభించిన తొలి అవకాశాన్ని వినియోగించుకున్నామని పర్సెవరెన్స్‌ మొబిలిటీ టెస్ట్‌ బెడ్‌ ఇంజనీర్‌ అనైస్‌ జరిఫ్యాన్‌ తెలిపారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. త్వరలో రోవర్‌తో దూర ప్రయాణాలను చేపట్టనున్నట్టు చెప్పారు. అంగారకుడి ఉపరితలంపై రోవర్‌ తిరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలపై పరిశోధిస్తున్నామని అనైస్‌ జరిఫ్యాన్‌ తెలిపారు. నాసా మార్స్‌ మిషన్‌లో ఇప్పటి వరకు ఎలాంటి అవరోధాలు ఎదుర్కోలేదని పర్సవరెన్స్‌ డిప్యూటీ మిషన్‌ మేనేజర్‌ రాబర్ట్‌ హాగ్‌ తెలిపారు.

పర్సెవరెన్స్‌ రోవర్ సాయంతో అంగారకుడిపై జీవం పుట్టుకతో పాటు మరెన్నో అంతుచిక్కని విషయాలు కనుగొంటామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా మార్స్ 2020 మిషన్‌లో భాగంగా అంగారకుడిపైకి నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్, అక్కడి జీవావరణం, కనుగొనడంతో పాటు మట్టి నమూనాలను భూమిపైకి పంపనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *