Mohan babu : కలెక్షన్ కింగ్‌కు ఊహించని షాక్ – లక్ష రూపాయల జరిమానా
కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబుకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. భారీగా జరిమానా విధించింది. లక్ష రూపాయల జరిమానా చెల్లించాలంటూ చలానా జారీచేసింది.
మంచు మోహన్‌బాబుకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో ప్రధాన రహదారిపై ఇల్లుంది. ఆ ఇంటిముందు భారీ ఫ్లెక్సీలు ఫిక్స్ చేసి ఉంటాయి. ఎప్పటికప్పుడు మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు సంబంధించిన సినిమాలు, ప్రోగ్రామ్‌ల పోస్టర్లు ఆ ఫ్లెక్సీ బోర్డుల్లో కనిపిస్తుంటాయి. ప్రధానంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మి నటించిన సినిమాలు, సీరియళ్లు, ప్రోగ్రామ్‌ల పోస్టర్లు ఆ భారీ బోర్డులపై కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడూ మంచు కుటుంబానికి చెందిన విద్యాసంస్థల యాడ్లు కూడా ఆ ఫ్లెక్సీ బోర్డులపై ప్రదర్శిస్తుంటారు.
రాత్రివేళ ఆ బోర్డులకు ఎల్ఈడీ లైట్లను కూడా అమర్చారు. అయితే, జీహెచ్ఎంసీ ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ భారీ బోర్డులపై దృష్టిపెట్టింది. యేళ్లుగా ఆ భారీ బోర్డులను అక్కడ ప్రదర్శిస్తున్నట్లు గుర్తించింది. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఆ బోర్డులు ఏర్పాటు చేసినట్లు నిర్దారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం కమర్షియల్ బోర్డులకు జీహెచ్ఎంసీ అనుమతులు తప్పనిసరి.
యేళ్ల తరబడి ఆ బోర్డులు ప్రదర్శితమవుతున్నా.. ఇన్నాళ్లు మిన్నకుండిన జీహెచ్ఎంసీ ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదిల్చింది. వందలు, వేలు కాదు.. ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా ఎందుకు విధించామో వివరంగా చలానా జారీచేసింది.
సినిమాల్లో ఒకప్పుడు వెలుగొందిన మంచు మోహన్‌బాబుకు కలెక్షన్ కింగ్ అనే బిరుదు ఉంది. ఇప్పుడు ఆ కలెక్షన్ కింగ్ నుంచే జీహెచ్ఎంసీ లక్ష రూపాయలు కలెక్షన్ చేయనుంది.