మళ్లీ కన్నీరు పెట్టించే దిశగా ఉల్లి – అక్టోబర్‌లో ధర ఆకాశాన్నంటొచ్చని అంచనాలు

ఇటీవలి కాలంలో ఓసారి ఉల్లిగడ్డ కన్నీరు తెప్పించింది. ధర ఆకాశానికంటి, కనీసం నిల్వలు దొరక్క ఇబ్బంది పెట్టింది. నిత్యం కూరల్లో ఉల్లి లేకుండా ముద్ద నోట్లోకి దిగలేని విధంగా అలవాటు పడిపోయిన జనం.. ఉల్లిగడ్డల కోసం తహతహలాడిపోయారు. అయితే.. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి రాబోతుందట.

అక్టోబర్‌ నెలలో ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగా కురియడంతో పంట పాడైపోయింది. అలాగే.. పండించిన పంటను సరిగ్గా నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా రిటైల్, హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మార్కెట్లలో ఖరీఫ్ సీజన్ మొదట్లో పండించిన ఉల్లిపాయలను జూలై నుండి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తారు. ఈ యేడాది భారీగా కురిసిన వర్షాల కారణంగా పంట పాడైపోయింది. దీంతో స్థానికంగా నిల్వ చేసుకునే మార్గాలు లేకుండా పోయాయి.

ఇక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లోనూ వర్షాల కారణంగా నిల్వచేసిన పంట దెబ్బతిన్నది. దీంతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హోల్ సేల్, రిటైల్ ధరలు రెట్టింపయ్యాయి. ముంబయి, కోల్‌కతాల్లో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర 50 రూపాయలకు చేరగా ఢిల్లీలో కిలో ఉల్లి ధర 60 రూపాయలు పలుకుతోంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్ అయిన నాసిక్ లో ఆగస్టు 28వ తేదీన కిలో ఉల్లిపాయల ధర 12 రూపాయలు ఉంటే… సెప్టెంబర్‌ 8వ తేదీ నాటికి ఆ ధర 29 రూపాయలకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం 25 నుంచి 30రూపాయల మధ్య ఉల్లిధర ఊగిసలాడుతోంది. అలాగే ప్రాంతాన్ని బట్టి ధర మారుతూ ఉంది. ఈ నెలలోనే ఉల్లిధర 50 రూపాయలు దాటి, వచ్చే నెలకల్లా ఉల్లి కిలో 100 రూపాయలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవంబర్‌లో గానీ కొత్త పంట వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు కనబడుతున్న మార్కెట్ సరళిని పరిశీలిస్తే.. అక్టోబర్‌ నాటికి కిలో ఉల్లి ధర 100రూపాయలకు చేరుతుందని వ్యాపారులు అంటున్నారు.