Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు

– నానమ్మది తప్పంటున్న రాహుల్‌గాంధీ
– తల్లిదండ్రులను క్షమించాలన్న తేజస్వియాదవ్

Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు
నానమ్మ చేసింది కచ్చితంగా తప్పే అన్నారు రాహుల్‌ గాంధీ. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను క్షమించమని తేజస్వి యాదవ్‌ ప్రజలను కోరారు. పెద్దలు చేసిన తప్పులకు పిల్లలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో సరికొత్త ధోరణులకు తెర తీస్తున్నాయి.

దేశంలో చీకటి పాలనగా ఇప్పటికీ చెప్పుకునే 1975 నాటి ఎమర్జెన్సీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. తమ నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆనాడు ఎమర్జెన్సీ విధించడం ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు. ఆనాడు జరిగింది ఓ తప్పిదమని, ఈ విషయాన్ని తమ నానమ్మ ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చెప్పారు. వ్యవస్థలను లోబర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎన్నడూ ప్రయత్నించలేదని రాహుల్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

భారత మాజీ ఆర్థిక సలహాదారు, అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కౌశిక్‌ బసుతో జరిపిన సంభాషణలో రాహుల్‌గాంధీ పలు విషయాలపై మాట్లాడారు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ గౌరవిస్తుందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ అని, రాజ్యాంగాన్ని అందించిన పార్టీ అని, ఇపుడు సమానత్వం కోసం నిలబడ్డ పార్టీ తమది అని రాహుల్‌ చెప్పారు. అయితే, వ్యవస్థలను అదుపాజ్ఞల్లో పెట్టుకునేంత సామర్థ్యం తమకు లేదని, కాంగ్రెస్‌ పార్టీ రూపొందిన తీరు అందుకు అంగీకరించదని రాహుల్‌ గాంధీ అన్నారు.

తమ పార్టీ పంథా గురించి మాట్లాడిన రాహుల్‌ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగినదానికి, ప్రస్తుతం మోదీ పాలనలో దేశంలో జరుగుతున్నదానికి మౌలికంగా తేడా ఉందని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ, ఆరెస్సెస్‌ మాదిరిగా దేశ సంస్థాగత నిర్మాణాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం కాంగ్రెస్‌ ఎప్పుడూ చేయలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలికంగా భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోందని, వ్యవస్థల్లో తన భావజాలమున్న వ్యక్తులను జొప్పించిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాము ఎన్నికల్లో బీజేపీని ఓడించినా వ్యవస్థల్లోంచి ఈ వ్యక్తులను బయటకు పంపడం వీలుకాదని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు. అందుకే పరిస్థితులు అప్పటికంటే ఇప్పుడు ఘోరంగా తయారయ్యాయన్నారు.

మొన్నటికి మొన్న బిహార్‌ ఎన్నికల సమయంలో ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తన తల్లి రబ్రీదేవి, తండ్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ పాలనలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే బిహార్‌ ప్రజలు క్షమించాలంటూ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. ఆర్‌జేడీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేజస్వి యాదవ్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్-రబ్రీదేవీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో తప్పు జరిగి ఉండొచ్చు. కానీ తాను అప్పుడు అధికారంలో లేనన్నారు తేజస్వి యాదవ్. అయితే పార్టీ తరఫున ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి అని ప్రజలను కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు తమను వెంటాడుతున్నాయని చెప్పారు. భారత రాజకీయాల్లో ముందెన్నడూ చూడని క్షమాపణల వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. బిహార్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తేజస్వి పలు వ్యూహాలు అనుసరించారు. ఆ వ్యూహాల్లో క్షమాపణలు కూడా ఒక భాగమైనా.. కాలం ఆర్‌జేడీకి కలిసిరాలేదు. మరోసారి ఎన్డీయే అక్కడ గెలిచింది.

ఇప్పుడు రాహుల్‌ గాంధీ, అంతకుముందు తేజస్వి యాదవ్‌ ప్రకటించిన పశ్చాత్తాపం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో సరికొత్త ధోరణులకు తెర తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *