‘కింగ్’ ఆర్థర్ (కంటతడి పెట్టించే వాస్తవ కథనం)


నవంబర్ నెల చివరి రోజులు, అమెరికా పడమటి మధ్య ప్రాంతంలోని సిన్సినాటి పట్టణం. ఆఫిస్ పని అయిపోయి బయటికొచ్చేసరికి ఆఫీస్‌కు డౌన్‌టౌన్ కు మధ్య నడిచే మెట్రో షటిల్ బస్ వెళ్ళిపోయింది. మాడిసన్ విల్ ను దాటి డక్ క్రీక్ కాలనీ అవతల ఉండే బస్టాప్ కి వెళితే 15 నిమిషాల్లో మరో బస్ ఉంది. అందమైన ఇళ్ల మధ్య ఉన్న కాలిబాటలో చకచకా నడుస్తున్నా, రాబోయే రోజుల్లో కురవబోయే భారీ మంచుకు భయపడి పరిసరాలన్నీ ముందే సుప్తావస్థలోకి వెళ్లిపోయాయి. రోడ్డుపక్కన నిలుచున్న నలభై అడుగులున్న పైన్ వృక్షం ఒకటి పిశాచిలా తలవంచుకొని నన్నే చూస్తోంది. రోడ్డు మీద పురుగు లేదు, స్మశాన నిశ్శబ్దం వినబోయే కీడునేదో ముందే సూచిస్తోంది.


నగర మున్సిపాలిటీ ఆధ్వర్యంలో gps అనుసంధానంతో నడిచే  సిటీ బస్‌లు, వాటి సిబ్బంది అత్యంత పంక్చువల్ గా ఉంటారు. వాచ్ లోని సెకండ్ల ముళ్ళుకు సవాల్ విసురుతూ మెట్రో బస్సు వచ్చి నా ముందు ఆగింది. ఆటోమేటిక్ డోర్ ఓపెన్ చేస్తూ, హాయ్ అన్నాడు బస్ డ్రైవర్ కం కండక్టర్. అంతకుముందు చాలాసార్లు చూసా ఆ డ్రైవర్ ని , మనిషి చాలా మర్యాదస్తుడు. వెళ్లి ఖాళీగా కనిపించే సీట్ లో కుర్చున్నానేగాని ఉండపట్టలేకపోయా. టికెట్ తీసుకొనే నెపంతో డ్రైవర్ కేబిన్ దగ్గరికి వెళ్ళా, ఎస్ సర్ అన్నాడు..దిగవలసిన స్టాప్ ఏదో చెప్పమన్నట్టుగా. సమాధానం చెబుతూ సంభాషణ కొనసాగించే నెపంతో మరో రెండు మూడు అసందర్భపు మాటలు మాట్లాడి అసలు విషయం అడిగా మీ కొలీగ్ ఆర్థర్ గురించి ఏమైయినా తెలుసా అని, అప్పటిదాకా డ్రైవ్ చేస్తూనే నా మాటలని సగం సగం వింటూ కనీస మర్యాదగా  తలఊపుతున్న డ్రైవర్, ఆర్థర్ పేరు వినడంతో ఒక్క సారిగా కంగారుపడుతూ నాకై చూసి వాట్, హూ, ఆర్థర్? , దట్  46 రూట్ ఆర్థర్? (ఏంటి, ఎవరు, ఆర్థర్? ఆ 46 రూట్ ఆర్థరా? ) అని అడిగాడు. నెమ్మదిగా కళ్ళు మూస్తూ, నిలువుగా కొద్దిగా తలను ఊపుతూ అవును అని చెప్పా. స్థిరమైన నా ఎక్స్ప్రెషన్ చూసి నాకు ఆర్థర్ బాగా పరిచయమన్న నిర్ధారణకు వచ్చి ముభావంగా చెప్పడం ప్రారంభించాడు. ఆఫ్రికాలో ఉండే ఆర్థర్ కుటుంబం మొత్తం రోడ్ యాక్సిడెంట్ కు గురిఅయిందట, అమెరికాకు బయలుదేరే క్రమంలో ఎయిర్పోర్ట్ రోడ్డులో జరిగిందట ప్రమాదం. దాదాపుగా అందరూ చనిపోయారట భార్య, పిల్లలు, మనవళ్లు, మూడేళ్ళ మనవరాలు, అంతా,… ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు, ఇంక వినలేనట్టుగా కాళ్లు మిగతా శరీరాన్ని వెనక్కు లాక్కుపోయాయి. బస్ లో వచ్చిన కుదుపుకో, ఈ వార్త విన్నాక మనసులో వచ్చిన కుదుపుకో తెలీదు సీట్లో కూలబడిపోయా. దుఃఖంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గుండె బాధను పంచుకుంటూ మనసు అప్రయత్నంగా కళ్ళలో నీళ్లను, మెదడులో గతాన్ని ఉంచింది.
                      **********


అమెరికాకు వచ్చిన కొత్తలో, ఆఫీస్‌లో జాయిన్ అయిన రెండో రోజు అనుకుంటా డౌన్ టౌన్లో,  హడావిడిగా ఆఫీసుకు వెళ్లాల్సిన 46 బస్ యెక్కాను,  బస్ బయలుదేరింది, తీరా టికెట్ తీసుకోవడానికి దిగే స్టాప్ చెబుదునుకదా ఈ బస్ ఆ రూట్ కు వెళ్ళదు నెంబర్ అదే కానీ రూట్ వేరే డిస్ప్లే బోర్డు చూడలేదా అన్నాడు డ్రైవర్ కం కండక్టర్. ఇంక చూస్కో ఆఫీస్ కి టైంకి ఎలా చేరాలా అని టెన్షన్ తో హడలి పోయాను, కొత్త దేశం, కొత్త ఊరు, కొత్త యాస అన్నిటికీ మించి కొత్త ఉద్యోగం. మేనేజర్ నుంచి నా కింద పనిచేసే వాడిదాకా నా  పంక్చువాలిటీ, నా వర్క్ క్వాలిటీ తూకమేసే పనిలో నిమగ్నమైఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు రావటం ఎంత కష్టమో ఏ చిన్న తేడా వచ్చినా పోవడం అంత సులువు.  ఇప్పుడు ఎక్కడ దిగాలి?, దిగి ఆ కొత్త ప్లేస్ నుంచి ఆఫీస్ దాకా ఎలా వెళ్ళాలి? పోనీ ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో దిగి ఏ ఆటోనో ఎక్కేద్దామనుకుంటే ఇది హైదరాబాద్ కాదాయే. ఇలా మెదడులో టెన్షన్ తో కూడిన ఆలోచనలు ఆ బస్ టైర్ కంటే స్పీడ్ గా తిరుగుతున్నాయి. అలవోకగా స్టీరింగ్ తిప్పుతూ రోడ్డువైపు చూస్తూనే నా భావాలు ఎలా గమనించాడో తెలీదు టెన్షన్ పడకు, ‘నేనున్నాగా’… నీ ఆఫీసుకి దగ్గరయ్యే స్టాప్ లో నిన్ను దింపుతా, అక్కడినుంచి నువ్వు సులువుగా నీ ఆఫీసుకి చేరుకోవచ్చు, రిలాక్స్ అన్నాడు ఆ డ్రైవర్. నాకు బాగా ఆశ్చర్యం అనిపించిన మాటేంటంటే ‘నేనున్నాగా’ అనడం!!. చిన్నప్పటి నుండి నాతోపాటు పెరిగిన నా దగ్గరి బంధువులు కూడా నేను ఫోన్ చేస్తే పొడిపొడిగా మాట్లాడి పెట్టేసారు గానీ నేనుఉన్నాగా అని ఎవరూ ఏ చిన్న విషయంలో కూడా భరోసా ఇవ్వలేదు. కొత్త ప్రపంచంలో కనీసం మాట సహాయంకూడా లేకుండా బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్న రోజుల్లో మొదటి సారిగా ఒకళ్ళు నన్ను ఉద్దేశించి అన్న మాట అది. “సహాయం విలువ ఆ క్షణానికి ఉన్న అవసరాన్ని బట్టి ఉంటుంది”. ఆలోచనలకు తెరపినిచ్చి అతన్ని చూశా, యాభై  ఐదేళ్లు ఉంటాయేమో, ఆఫ్రికన్ దేశస్థుడు, నెరసిన గడ్డం, నవ్వు మొహం, మీ పేరేంటి అని అడిగా, ఏదో చెప్పాడు ..కింది దవడ ముందరి పళ్ళు ఒకటో, రెండో లేవనుకుంటా మాట ముద్దగా వస్తోంది, మళ్ళీ అడిగా … ఈ సారీ అర్థం కాలేదు. ఇబ్బంది గా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా..తను మాత్రం నవ్వుకుంటూ ఓపిగ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ సారి డో యు నో “కింగ్ ఆర్థర్” ? దట్ ఆర్థర్ (నీకు కింగ్ ఆర్థర్ తెలుసునా ఆ ఆర్థర్ ) అన్నాడు గట్టిగా నవ్వుతూ. ఓహ్ ఐ యామ్ సారీ, నౌ ఐ గాట్ ఇట్ ( క్షమించండి నాకు ఇప్పుడు అర్థమైంది) అన్నాను. ఇంక ఆ నలభై అయిదు నిమిషాల ప్రయాణంలో నేను సీట్లో కూర్చున్నదే లేదు పక్కనే నిలబడి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నేను దిగబోయే స్టాప్ నుంచి ఆఫీసుకి షార్ట్ కట్లో ఎలా వెళ్లాలో చక్కగా వివరించి చెప్పాడు. నా స్టాప్ రావడంతో బై బై కింగ్ ఆర్థర్ అన్నా, ఏమరపాటులో అతి చనువు తీసుకున్నానా అని  దిగబోతూ చివాల్న వెనుతిరిగి తప్పుచేసిన వాడిలాగా అతనికై చూశా. నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో ఆఫ్రికా లో ఉండే నా చిన్న కొడుకు నన్ను ఉడికిస్తూ అప్పుడప్పుడూ ఇలా పిలుస్తాడు, టక్కున వాడు గుర్తొచ్చాడు, నువ్వు ఎప్పుడూ ఇలాగే పిలవొచ్చు అని అపురూపంగా నవ్వాడు. నేను ప్లాట్ఫారం మీదకు వెళ్ళే దాకా ఆగి ఆత్మీయుడు ఎవరో విడిపోతున్నట్టు ఆప్యాయంగా చేయి ఊపుతూ ముందుకువెళ్లిపోయాడు.


అదిమొదలు రాబోయే బస్‌లో డ్రైవర్ ఆర్ధరా  కాదా అని వెతికేవాన్ని. బస్ ఆగకముందే నేను స్టాప్ లో నిలబడ్డానా లేదా అని తన కళ్ళతో ఆర్థర్ వెతకటమూ నా దృష్టిని దాటిపోలేదు. జాతి, మతం, వయసు, ఉద్యోగం ఇలా ఏ విషయంలోనూ మా ఇద్దరికీ సారూప్యతలేదు ఒక్క ఒంటరితనంలో తప్ప. వేలమైళ్ల దూరంలో ఉన్న భార్య, పిల్లల జ్ఞాపకాలు, వందల కోట్ల ప్రాజెక్ట్‌ల కోసం మేనేజర్లు పెట్టించే పరుగులో  అలసిపోయిన నాకు ఆర్థర్ సావాసం గొప్ప ఊరట. తొందరలోనే నాకు ఆత్మ మిత్రుడిగా మారిపోయాడు. ఆఫీసుకి వచేప్పుడో పోయేప్పుడో వారంలో కనీసం నాలుగైదు సార్లు కలిసేవాడు, చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా కుటుంబం గురించి వివరాలు అడిగేవాడు, ఉద్యోగం కోసం  కుటుంబానికి దూరమయ్యానని బాధ పడుతూఉంటే, నన్ను చూడు బ్రతుకుతెరువు కోసం, రెండు తరాల కుటుంబ సభ్యులను వదిలి ఈ వయసులో అనారోగ్యంతో పోరాడుతూకూడా ఎంత సంతోషంగా ఉన్నానో అని ధైర్యం చెప్పేవాడు. నాతో దైర్యం గా మాట్లాడినా వాళ్ళను గుర్తుచేసుకోగానే అయన గుండెల్లో తడి కళ్ళలో పోరగా మారడం చాలా సార్లు గమనించా. చాలా ఏళ్లకింద పొట్ట చేత పట్టుకొని ఒక్కడే ఈ దేశానికి వచ్చాడట. భార్యతో సహా మిగిలిన వాళ్లంతా ఇప్పటికీ ఆఫ్రికాలోనే ఉన్నారట. ఎంత చనువుగా ఉన్నా మర్యాద హద్దు దాటే వాడు కాదు, ఎప్పుడైనా టిక్కెట్టుకు పోగా తిరిగి ఇవ్వడానికి 10 సెంట్ల చిల్లర తక్కువపడ్డా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో నోచ్చుకుంటూ వివరణ ఇచ్చేవాడు. ఒక రోజు ఆఫీస్ నుంచి తిరిగివస్తుంటే చాలా సంతోషంగా పలకరించాడు, డ్రైవింగ్ సీట్ పక్కనే రంగురంగుల కాగితపు బహుమతులున్నాయి. ఏమిటి సంగతి అని అడిగా. తన కుటుంబసభ్యులు అంతా తన దగ్గరికి వచ్చేస్తున్నారట, తన ఏకైక మూడేళ్ళ మనమరాల్ని వీడియోల్లో తప్ప ఇంతవరకూ నేరుగా చూడలేదట. ఆ బహుమతులన్నీ తనకోసమేనట. రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోబోతున్నానని ఆనందంగా చెప్పాడు. మరి క్వీన్ ఆర్థర్ కి ఏమీ గిఫ్ట్ లేదా కింగ్ ఆర్థర్ అని కన్ను గీటి అడిగితే తనదైన గొంతుతో ఓ పెద్ద ఆర్గానిక్ నవ్వు నవ్వాడు. ఆర్థర్ లో అన్నిటికంటే నిష్కల్మషమైన ఆ నవ్వే నాకు ఎక్కువ ఇష్టం.  అంతే ఆ రోజే ఆర్థర్ని చివరిగా చూడటం. మూడువారాలుగా ఎదురుచూశా, మెట్రో బస్ ఆఫీస్ లో కూడా ఎంక్వైరీ చేశా ఏ వివరాలూ తెలియరాలేదు. ఇప్పుడు ఇదిగో ఈ ఊహించని వార్త . పాపం ఎలా ఉన్నాడో ఆర్థర్, కనిపించని  శక్తిని బలంగా కోరుకున్నా..ఒక్కసారి కలవాలి, ఓదార్చాలి. ఆ తరువాత కూడా చాలా వెతికా కానీ లాభం లేకపోయింది.
                           *****


ఆర్థికంగా స్థిరపడటం, వాతావరణం అలవాటు కావడంతో నా భార్య, పిల్లల్ని అమెరికాకు పిలిపించుకున్నా. సొంతంగా కార్ కొనుక్కున్నా. పిల్లల మురిపెంలో పడి రోజులు గడిచి పోతున్నాయి, ఆర్థర్ జ్ఞాపకాలు వెనకపడిపోయాయి. ఆ ఊర్లో నా ప్రాజెక్ట్ అయిపొయింది వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఊరుమారే  ముందు ఒక సారి ఉన్న ఊరు తిప్పి చూపించమని భార్య పిల్లలు అడిగారు. కార్ తీయబోతుంటే మా చంటోడు లేదు అద్దాల  మెట్రో బస్సు ఎక్కుదామని మారం చేశాడు. సరే చిన్న కొరికేగా అని అందరం బస్ స్టాప్ కి బయలుదేరాము.  అక్కడే పొరపాటు జరిగింది దగ్గరగా వస్తున్న సిటీ బస్సు ని చూసి పొరపాటున నా చేతిలో ఉన్న చంటోడితో రోడ్ మధ్యలోకి వెళ్లి బస్సు ఎక్కబోయా, ఆలా రోడ్ మధ్యలోకి వెళ్లి అదీ పిల్లలతో బస్సు ఆపడం అక్కడి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పెద్ద తప్పు. బస్సు ఎక్కక చాలా రోజులు కావడం వల్లనో, బస్సు మిస్ అవుతుందన్న గాబరానో మరోటో తెలీదు మొత్తానికి క్షణంలో తప్పు జరిగిపోయింది. నేనేందుకు అలా వెళుతున్నానో  అర్థం కాక నా భార్య రోడ్డుపక్కనే షాక్ అయ్యి నిలుచుండి పోయింది.  బస్సు డ్రైవర్ తో పాటు ముందు కూర్చున్న మిగితా ప్రయాణికులు గట్టిగట్టిగా కేకలు వేస్తున్నారు. మొత్తానికి బస్,  తేరుకున్న నేను, ఒకే సారి బస్‌స్టాప్ కి రావడం, డోర్ ఓపెన్ కావడం వేగంగా జరిగిపోయాయి. డోర్ ఓపెన్ అయ్యాక అర్థమైంది నాకు, ఇంతకుముందు ఎందుకు నేను  ఆ పొరపాటు చేశానో, డ్రైవింగ్ చేస్తుంది ఆర్థర్, అది చూసే ట్రాన్స్‌లో ఏమీ ఆలోచించకుండా బస్ దగ్గరికి వెళ్ళిపోయా. నేనెవరో గుర్తుపట్టనట్టు చూసాడు ఆర్థర్, సరే ఇందాకటి కోపంలో ఉన్నాడేమో అని కాసేపాగి డ్రైవింగ్ క్యాబిన్‌కు వెళ్ళా, ఏ స్టాప్‌లో దిగాలి కటువుగా అడిగాడు, ఎదో మాట్లాడేలోపే టికెట్ చేతిలో పెట్టి వెనక్కువెళ్ళి కూర్చోమన్నాడు.  పరిస్థితులు ఎంతటి స్థితప్రజుడిని అయినా మారుస్తాయి అంటారు, ఆర్థర్ విషయంలో కూడా అంతేనేమో, కఠినమైన ఆ పరీక్ష తనని బండగా మార్చిందేమో అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఖాళీగా వున్న సీట్లో కూర్చున్నా. కాసేపటికి యధాలాపంగా డ్రైవర్ ఎదురుగా ఉన్న రేర్ వ్యూ మిర్రర్ వైపు చూశా, అక్కడినుంచి ఆర్థర్ మొహం స్పష్టంగా కనపడుతోంది, కళ్లలోనుంచి ధారగా నీళ్లు కారుతున్నాయి, చాలారోజులుగా ఈ తంతుకు అలవాటు పడ్డట్టుగా మిగతా ముఖ భాగాలు ఆ కన్నీటి ధారకు పెద్దగా స్పందించట్లేదు, మనిషి బాగా క్రుంగి పోయాడు, మొహం బాగా వడలిపోయింది. అది చూసిన నాకూ దుఃఖం ఆగలేదు, ఒకప్పటి నా బాధను పంచుకున్న నా మిత్రుడి దుఃఖాన్ని నేను ఓదార్చలేకపోతున్నానే అని కుమిలి కుమిలి బాధపడ్డాను. నేను దిగాల్సిన స్టాప్, ఆ బస్సుకు ఆఖరి స్టాప్ రానే వచ్చింది. భార్య పిల్లలు చూడకుండా కళ్ళు తుడుచుకొని నా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్లి డ్రైవింగ్ కేబిన్ పక్కన నిలబడ్డా అలా అయినా  పలకరిస్తాడేమోనని, అప్పటికే కళ్ళు తుడుచుకున్న ఆర్థర్ వాళ్ళ వైపు చూసి ముభావంగా ఒక అర నవ్వు నవ్వి ఊరుకున్నాడు. దుఃఖంతో కూరుకుపోయిన గొంతుతో, జరిగింది తెలిసింది, ట్రాన్స్ఫర్ కావడంతో నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నానని, బహుశా ఇదే ఆఖరి సారి నిన్ను కలవడమని చెప్పా, ఎవ్రీ జర్నీ హ్యస్  టూ ఎండ్ సం వేర్ మై ఫ్రెండ్ (ప్రతీ ప్రయాణం ఎదో ఒక చోట ముగియాలి మిత్రమా ) అని శూన్యం లోకి చూస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు. ఇంక లాభంలేదని పిల్లల్ని దింపి నేను బస్ ఆఖరి మెట్టుకు చేరుకున్నా. ఇంకొక్క అడుగుతో మా ఇద్దరి అపురూప స్నేహానికి శాశ్వత ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉంది ఆటోమేటిక్ డోర్. ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి  ఒక్క సారి, ఆఖరి సారి నిన్ను “కింగ్ ఆర్థర్” అని పిలవొచ్చా అన్నాను.  అప్పుడు లేచాడు డ్రైవింగ్ సీట్ మీదినుంచి,.. చివాలున లేచి వచ్చి  నన్ను గట్టిగా కౌగిలించుకొని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. రోజులతరబడి ఘనీభవించిన మేఘం ఒక్క సారిగా వర్షించినట్టుగా, బాధను పంచుకునే ఆత్మీయులు లేక ఇన్నాళ్లూ గుండెలోనే సుడులు తిరిగిన దుఃఖం అంతా ఒక్క సారిగా బయటకు వచ్చింది. మొదటి సారిగా నా గుండె దగ్గరకు వచ్చిన నా మిత్రుడి గుండె గుసగుసలాడుతోంది, ఇంకా నాకు మిగిలిన ఆత్మ బంధువు నువ్వొక్కడివేనని నన్నెప్పుడూ  వీడిపోవద్దని.
                                                                      
  — ఫణి మోహన్ (అమెరికా)

https://m.facebook.com/story.php?story_fbid=2925017417731744&id=100006705431953

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *