Sharmila New party : షర్మిల ఎవరు వదిలిన బాణం? తెలంగాణలో చోటు దక్కేనా?

Sharmila New party : షర్మిల ఎవరు వదిలిన బాణం? తెలంగాణలో చోటు దక్కేనా?
అందరి చూపు తెలంగాణ పైనే..అందరి టార్గెట్‌ అధికార టిఆర్‌ఎస్సే.. చంద్రుడి ఇలాఖాలో రాజన్న రాజ్యం తెస్తామంటున్నారు. మరి, ఆంధ్రా పాలిటిక్స్‌కు తెలంగాణలో మళ్లీ చోటు లభించడం వెనుక ఎవరి వ్యూహం ఉంది. అధికార కాంక్ష చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుంది. పరాజితులుగా మిగల్చనుంది.

ఏపీలో సమైక్య పాలిటిక్స్‌ :

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కుటుంబం రెండు రాష్ట్రాల్లో విభిన్న వ్యూహంతో ముందుకు పోతోంది. సమైక్య పాలిటిక్స్‌తో ఆంధ్రలో అధికారం సొంతం చేసుకున్నారు వైఎస్సార్ కుమారుడు వైసీసీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి. రాజకీయ యవనికపై ఇప్పటికే తన మార్క్‌ చూపించుకున్న వైఎస్‌ తనయ షర్మిల తెలంగాణ వైపు దూసుకొస్తున్నారు. రాజన్న రాజ్యం పేరుతో అధికారం సొంతం చేసుకుని తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ పేరు అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ సన్నాహక సమావేశాలతో సమరానికి తెరలేపారు. వైఎస్‌ కుటుంబ పాలిటిక్స్‌ ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రా పార్టీలకు, కుటుంబాలకు స్థానముందా అనే చర్చకు తెరలేపారు షర్మిల..

అన్న జైలుకెళ్లినప్పుడు అన్నీ తానై…

తండ్రి అకాల మరణంతో చనిపోయిన అభిమానుల కుటుంబాల ఓదార్పుతో రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల.. అన్న జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారు. ఆంధ్రాలో జగన్‌ అధికారంలోకి వచ్చాక షర్మిలకు చోటు లేకుండాపోయింది. పవర్‌ పాలిటిక్స్‌ కోసం తహతహలాడుతున్న షర్మిల అన్నను కాదని ఆంధ్రాను వీడి అత్తగారిళ్లు తెలంగాణ కేంద్రంగా పార్టీ ఏర్పాటుకు డిసైడైపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలో తిరిగారు షర్మిల. మారిన పరిస్థితుల్లో ఈ బాణంపై రకరకాల పేర్లు వస్తున్నాయి. జగనన్న వదిలిన బాణం అని కొందరు, కేసీఆర్‌ వదిలిన బాణమని మరికొందరు, కాదు కాదు జగనన్న వదిలేసిన బాణమని ఇంకొందరు, లేదు లేదు రామ బాణమని మరికొందరు రకరకాల విశ్లేషణలు చేసుకుంటూ పోతున్నారు.

కేసీఆర్‌ అస్త్రమేనా? :

తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా సెటిలర్స్‌ పార్టీల పాలిటిక్స్‌ ఇక ముగిసిన అధ్యాయమని సెంటిమెంట్‌ రగిల్చే కేసీఆరే.. షర్మిలను తీసుకువచ్చారనే టాక్‌ విస్తృతమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారం నిలుపుకునేందుకు షర్మిల చేత బాణమేయిస్తుందీ టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే అని అనుమానం వ్యక్తం చేసేవారూ లేకపోలేదు. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చానని జగన్‌ గెలుపులో తన పాత్ర ఉందని చెప్పకనే చెప్పి కేసీఆర్‌ సంబరపడిపోతారని కొందరు పొలిటికల్‌ వ్యూస్‌ చెబుతుంటారు. తాజాగా తను మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్‌ కుటుంబాన్ని ఇలా వాడుకుంటున్నాడనే పొలిటికల్‌ టాక్‌ వస్తోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌-కేసీఆర్‌ మధ్య సత్సంబంధాల గురించి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లకుండా, టీడీపీని మరోసారి ఇక్కడ లేకుండా చేసేందుకు, కాంగ్రెస్‌లోని వైఎస్సార్‌ అభిమానుల ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు ఇలా పలు కోణాలు షర్మిల పార్టీ పెట్టేందుకు కేసీఆర్‌ వేసిన ఎత్తుగడగా ఏ రెండు పార్టీల కార్యకర్తలు కలిసినా మాట్లాడుకునే మాటలుగా వినిపిస్తున్నాయి. ఇందులో ఇంకా మైనారిటీ, అగ్రవర్ణాల మెజార్టీ ఓటు బ్యాంకును షర్మిల పార్టీకి పడేట్లు చేస్తే ఆటోమెటిక్‌గా కాంగ్రెస్‌, బీజేపీ వీక్‌ అయిపోయి టిఆర్‌ఎస్‌కు సునాయాస విజయం సాధిస్తుందనే టాక్‌ బాగా నడుస్తోంది.

సొంత బలం, సొంత అజెండా లేకుండా చిన్న పార్టీలుగా ఒకరి గెలుపు కోసం, మరొకరి ఓటమి కోసం ఆంధ్రా కేంద్రీకృత ఆత్మీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయే అవకాశముంది. బిగ్ షేర్‌ను కాపాడుకుంటూ అసంతృప్త ఓటు బ్యాంకును ఒకే పార్టీకి మళ్లకుండా ఉండేందుకు టిఆర్‌ఎస్ ఆడుతున్న గేమ్ ప్లాన్‌లో గెలుపెవరిది అవుతుందో? చూడాలి. మరో విశ్లేషణ ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ కనీస ఓటు బ్యాంకు, మజ్లిస్‌ సామాజిక ఓటు లెక్కలు, ఆంధ్రా ఓటర్ల నాడి, తెలంగాణ సెంటిమెంట్‌ ఓటు, అసలు సిసలు హిందుత్వ ఓటు బ్యాంకుగా ఇలా ఓటర్లు చిలీపోతే బీజేపీకి లాబిస్తుందనేవారూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్‌లో మరో కొత్త పార్టీకి, కొత్త రకం కూటములకు స్థానముందనే విషయం మాత్రం తేటతెల్లమవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *