Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ & మీల్స్. ఇదో అద్భుతమైన ఆలోచన ఆలోచన. అవసరంలో క్షుద్బాధను తీర్చే మహత్తర కార్యం. మరి.. ఈ సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్ చరిత్ర ఏంటో తెలుసా? ఇది ఏయే దేశాల్లో అమలవుతుందో చూద్దాం…
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంగా సస్పెండెడ్ మీల్స్, సస్పెండెడ్ కాఫీ అనే క్యాంపెయిన్ గురించి విరివిగా వినిపిస్తోంది. వినడానికే వింతగా ఉన్నా.. పలు దేశాల్లో ఈ క్యాంపెయిన్ విజయవంతంగా నడుస్తోంది. నిరుపేదలకు, యాచకులకు, పూట గడవని వాళ్లకు ఇదో వరంలా పనిచేస్తోంది.
సస్పెండెడ్ కాఫీ లేదా మీల్స్ అంటే…
చాలామందికి మనం సహాయం చేస్తూ ఉంటాం. యాచకులకు ఏదో ఒకటి దానం చేస్తుంటాం. ప్రత్యక్షంగా మనలను అడిగిన వాళ్లకో, యాచించిన వాళ్లకో ఇలా దానం చేస్తుంటాం. అయితే, సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్ అనేది పరోక్షంగా చేసే దానం. మీరు ఎవరికి దానం చేశారన్నది తెలియదు. అయితే.. అవసరార్థులు అడగకముందే మీరు చేసిన దానం వాళ్లకోసం సిద్ధంగా ఉంటుంది. అదే ఈ సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్. ఏదైనా హోటల్‌కో, రెస్టారెంట్‌కో, కాఫీ షాప్‌కో వెళ్లినప్పుడు మనం తిన్నదానికో, తాగిన దానికో బిల్లు చెల్లిస్తాం. ఆ బిల్లుకు తోడు.. ఒక సస్పెండెడ్ కాఫీ, రెండు సస్పెండెడ్ మీల్స్ అని చెప్పి కౌంటర్లో అదనంగా బిల్లు చెల్లించడమే సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్.
ఎప్పుడు మొదలైంది?
సస్పెండ్ కాఫీ ఉద్యమం ఖచ్చితంగా ఎప్పుడు మొదలైందనేదానికి నిర్దిష్టమైన ఆధారాలు లేకున్నా.. ఈ క్యాంపెయిన్‌లో పనిచేస్తున్న వాళ్లు 2013లో మొదలయ్యిందని చెబుతారు.
ఎలా ఆర్డర్ చేయాలి?
కొన్ని దేశాల్లో ఈ క్యాంపెయిన్ విస్తృతంగా కొనసాగుతోంది. అవసరార్థులకు, ఆసరా లేని వాళ్లకు ఉపయోగపడుతోంది. దీనికోసం కొన్నిదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని హోటళ్లు, కాఫీ షాప్స్ ఉన్నాయి. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు తమ బిల్లుతో పాటు సస్పెండెడ్ ఆర్డర్స్ కూడా చేస్తారు.
అవసరార్థులకు ఎలా అందుతుంది ?
సస్పెండెడ్ కాఫీ, మీల్స్ గురించి తెలిసిన యాచకులు, ఆసరా లేనివాళ్లు సంబంధిత హోటల్‌కో, కేఫ్‌కో వెళ్లి.. ఏవైనా సస్పెండెడ్ మీల్స్ గానీ, కాఫీ గానీ ఉన్నాయా? అని అడుగుతారు. వాళ్లను పరిశీలించే కౌంటర్లో ఉండే వ్యక్తి ఉంటే ఉన్నాయని, లేకుంటే లేవని చెబుతారు. ఉంటే ఆ మీల్స్‌ను, లేదా కాఫీని అడిగిన వాళ్లకు ఉచితంగా ఇస్తారు.
ఏయే దేశాల్లో అమలవుతోంది ?
ఈ సస్పెండెడ్ మీల్, సస్పెండెడ్ బ్రెడ్ క్యాంపెయిన్ కొన్ని దేశాల్లో కొనసాగుతోంది. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా అమలవుతోంది.
టర్కీ :
టర్కీలో ‘సస్పెండెడ్ బ్రెడ్’ పేరిట ఈ క్యాంపెయిన్ కొనసాగుతోంది.
ఇటలీ :
ఇటలీలో ‘పెండింగ్ కాఫీ’ ‘సస్పెండెడ్ మీల్’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ఎంపిక చేసిన రెస్టారెంట్లు, కాఫీ షాపుల్లోనే ఇది అమలవుతోంది.
హాంకాంగ్ :
హాంకాంగ్‌లో మొదట సియూ మియ్ రెస్టారెంట్లో ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టారు తర్వాత చాలా రెస్టారెంట్లు ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిపొందాయి. బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్, హోటళ్లలో కూడా ఈ క్యాంపెయిన్ అమలు అవుతోంది.
తైవాన్ :
తైవాన్‌లో ప్రత్యేకంగా సస్పెండెడ్ మీల్స్ కోసం ఓ ఫేస్బుక్ పేజీనే నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న రెస్టారెంట్లు ఆ ఫేస్బుక్ పేజీలో జాయిన్ అవుతున్నాయి. ఆ పేజీలో ఎప్పటికప్పుడు సస్పెండెడ్ మీల్స్ స్టేటస్ కూడా అప్డేట్ చేస్తుంటారు.
దుబాయ్ :
దుబాయ్‌లో 2015లో ‘పెండింగ్ మీల్’ పేరిట సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలయ్యింది. ఈ కాన్సెప్ట్ నచ్చిన రెస్టారెంట్లు క్యాంపెయిన్‌కు ఓకే చెప్పాయి. క్రమంగా షార్జా, అబుదాబి, రస్ అల్ ఖైమా ప్రాంతాల్లోనూ ఇది విస్తరించింది.
నార్వే :
నార్వేలోనూ సస్పెండెడ్ మీల్, సస్పెండెడ్ కాఫీ అమలవుతోంది. అవసరార్థులకు ఈ కాన్సెప్ట్ అన్నం పెడుతోంది.
సౌతాఫ్రికా, చీలీ, శ్రీలంక, నేపాల్ తదితర దేశాల్లోనూ సస్పెండెడ్ మీల్స్ కాన్సెప్ట్ ప్రారంభమైంది.
పరిమితి లేదు :
సస్పెండెడ్ కాఫీ, సస్పెండెడ్ మీల్స్ పేరిట దానం చేయాలనుకునే వారికి పరిమితి లేదు. ఒక సస్పెండెడ్ మీల్‌కు డబ్బులివ్వొచ్చు. లేదంటే పది సస్పెండెడ్ మీల్స్‌కు బిల్ చెల్లించవచ్చు.
కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది కదూ…
కొంతమంది నిజాయితీగా పనిచేసేవాళ్లు ఈ క్యాంపెయిన్‌ను మనం ఉన్న ప్రాంతాల్లో కూడా మొదలుపెట్టవచ్చు.. ఏమంటారు…
One Comment on “Suspended Meals & Coffee : సస్పెండెడ్ కాఫీ &మీల్స్ చరిత్ర – ఏయే దేశాల్లో అమలవుతుందంటే…”