Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం – అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం

Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం
అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం
తెలంగాణ ప్రజలు మరోసారి ఫూల్స్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరి పడ్డారు. తెలంగాణ సమాజం ఫూల్స్‌ కావడానికి, కేసీఆర్‌ సహనం కోల్పోవడానికి సంబంధం ఏముందన్న సందేహం కలుగుతుందా ? ఉంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజశైలిలో కోపానికి రావడం, ముందు కనిపించిన వాళ్లను, ఏకంగా మంత్రులనే అందరిముందే ఎడా పెడా తిట్టడమే దీనికి కారణం.
మీడియా కూడా ఫూల్‌ అయిన పరిణామం :

ఇక, ఫూల్స్‌ అయ్యింది.. ఒక్క ప్రజలే కాదు.. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు, విపక్షాలు.. చివరకు మీడియా కూడా ఫూల్‌ కావాల్సి వచ్చింది. దాదాపు పదిహేను రోజుల పాటు.. తెలంగాణ యవనికపై హాట్‌ టాపిక్‌ అయినా, రోజుకో మంత్రి, ఎమ్మెల్యే అదే అంశాన్ని పదే పదే ప్రకటిస్తున్నా, విపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నా, మీడియాలో పూటలకు పూటలు డిబేట్లు నడిచినా, మిన్నకుండిపోయిన కేసీఆర్‌.. పార్టీ కార్యవర్గ సమావేశంలో మాత్రం ఎగిరెగిరి పడ్డారు. అప్పటిదాకా తనకేమీ తెలియనట్లు, అప్పుడే మొత్తం అవగతం అయినట్లుగా వ్యవహరించారు. ఒక్కసారిగా జనం అటెన్షన్‌ను మార్చేశారు.

ఈనెల 7వ తేదీన ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏ జిల్లాలో ఆ వేడుకలు నిర్వహించాలో తర్వాత క్లారిటీ వస్తుందన్నారు. రెండు నెలల పాటు రాష్ట్రమంతటా తిరుగుతానని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. మరో పదేళ్లదాకా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్‌ పేల్చిన ఈ బాంబు తెలంగాణ మొత్తంలో ఒకరకంగా ప్రకంపనలు సృష్టించింది. ఇన్నాళ్లుగా జోరుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

హీటెక్కిన పాలిటిక్స్‌ ఒక్కసారిగా చల్లారిన వైనం :

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, మరో పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్‌ ప్రకటించడానికి కారణముంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఓ సంచలన రాజకీయపరమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నాడని, ఇవాళో.. రేపో కేసీఆర్‌ స్వయంగా ఈప్రకటన చేస్తారని, ముహూర్తం కూడా రెడీ అయ్యిందని మీడియా, సోషల్ మీడియాకోడై కూశాయి. మొట్ట మొదటగా మంత్రి ఈటెల రాజేందర్‌ నోటివెంట ఈ మాట వచ్చింది. ఆ తర్వాత వరుసబెట్టి నాయకులంతా కోరస్‌ అందుకున్నారు. కేటీఆరే మా నేత అని, కాబోయే సీఎం కేటీఆర్‌ అని సందర్భం కల్పించుకొని మరీ బహిరంగ ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనలు మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యేలా, ప్రసారమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కేటీఆర్‌కు ముందస్తు గ్రీటింగ్స్‌ వెల్లువ :

అంతేకాదు.. కొందరు నేతలు కేటీఆర్‌కు ముందస్తుగా బహిరంగంగానే కంగ్రాట్స్ చెప్పారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటంటూ కూడా మాట్లాడారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అభిప్రాయంతో చాలా మంది మంత్రివర్గంలో చోటు కోసం ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌ ముందే, కేటీఆర్‌ పాల్గొన్న సభా వేదికపై నుంచే ఈ సంభోదనలు చేశారు. కేటీఆర్‌నే స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సంభోదించారు. ఆ సమయంలో కేటీఆర్‌ ముసిముసినవ్వులు నవ్వడం తప్ప ఎలాంటి కామెంట్‌ చేయలేదు. ఆ పరిణామం కూడా జరుగుతున్న ప్రచారానికి ఆజ్యం పోసింది. ఇంకేముంది.. మీడియా ఈ అంశాన్ని ఓ మెయిన్‌ టాపిక్‌గా ఎంచుకుంది. రోజుల తరబడి దీనిపైనే చర్చలు, వార్తలు, కథనాలు, ప్రత్యేక కథనాలు అందించింది.

కేసీఆర్‌ ఎలిమెంటరీ టీచర్‌ అవతారం :

ఈ సమయంలోనే జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ ఎలిమెంటరీ టీచర్‌ మాదిరిగా మారిపోయారు. మంత్రులు, ముఖ్య నాయకులు, కార్యవర్గం సభ్యులంతా విద్యార్థుల మాదిరిగా పరిగణనలోకి వచ్చారు. పూనకం వచ్చినట్లు శివాలెత్తిపోయారు. చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తనను రాజీనామా చేయాలని మీరంతా డిమాండ్ చేస్తున్నారా ? అని ప్రశ్నించారు కేసీఆర్‌. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. ఎక్కడైనా నోరుజారినట్లు మాట్లాడితే పార్టీ నుంచి పీకి పారేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా గీత దాటితే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. మరోసారి ఎవరైనా ఇలా మాట్లాడితే బండకేసి కొట్టి బయటకు విసిరేస్తా అన్నారు. ఒక్కొక్కరి తాట తీస్తానని ఘాటు పదజాలం వాడారు. సీఎం మారుతున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.. నేను సీఎంగా ఉంటే మీకు నచ్చట్లేదా? అని సీఎం కేసీఆర్ కార్యవర్గ సమావేశంలోనే వ్యాఖ్యానించారు.

మరో పదేళ్లు సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తానే స్వయంగా ఈప్రకటన చేసిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. ముఖ్యమంత్రిగా తాను ఉండగా, సీఎం మార్పు ఏదైనా ఉంటే తన వైపు నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని స్పష్టంగా ప్రకటించారు.

మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలు కేసీఆర్‌కు తెలియవా? :

వాస్తవానికి మంత్రుల ప్రకటనలు, ఎమ్మెల్యేల అభివాదాలు కేసీఆర్‌కు తెలియకుండా జరిగాయనుకోవడం అమయకత్వమే అవుతుందంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్. మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చిన వార్తలను గురించి తెలియనట్లు నటించడం, అప్పటికప్పుడే తనకా విషయం తెలిసినట్లు సమావేశంలోనే అగ్గిమీద గుగ్గిలమవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్‌ తాజా వ్యాఖ్యలు, విమర్శలు, తిట్లు, హెచ్చరికలు ఓ స్ట్రాటజీ ప్రకారం చేసి ఉంటారన్న సందేహాలు కలుగుతున్నాయంటున్నారు. అయితే, కేసీఆర్‌ ఏ ఆలోచనతో ఇలా చేశారో కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందంటున్నారు.

వ్యూహం మార్పు వెనుక ?

కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దళితుడినే సీఎం చేస్తానంటూ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రకటించిన కేసీఆర్.. ఆ అంశాన్ని పక్కన పెట్టడం రెండు సార్లు తానే సీఎం పీఠాన్ని అధిష్టంచడం, ఇప్పుడు కుమారుడికి ఆ సీటు అప్పగించాలని ప్రయత్నించడాన్ని ఎండగట్టాయి. అంతేకాదు.. కనీసం బీసీ ముఖ్యమంత్రిని అయినా చేయాలంటూ కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఆ కోణంలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. దీంతో ఇప్పటికిప్పుడు సీఎం పీఠం మార్పు సరైన సమయం కాదనుకున్న కేసీఆర్‌.. కార్యవర్గ సమావేశంలో అలా వ్యాఖ్యానించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *