-
టీఆర్ఎస్ గుండెల్లో దుబ్బాక దడ
-
వచ్చే ఎన్నికలను తలచుకొని బెంబేలు
-
జీహెచ్ఎంసీ ఎన్నికలపై మొదలైన హడల్
దుబ్బాకలో బీజేపీ చరిత్ర సృష్టించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ తేదీ దాకా దుబ్బాక కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓట్ల లెక్కింపు రోజున నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. చివరకు బీజేపీ గెలుపు జెండా ఎగురవేసింది.
తొలినుంచీ నువ్వా, నేనా?
తొలినుంచీ దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా ? నేనా ? అన్నట్లు తలపడ్డాయి. ఎన్నికల ప్రచారం దగ్గరినుంచీ పోలింగ్ దాకా రెండు పార్టీలు సై అంటే సై అన్నాయి. క్షేత్రస్థాయిలో తమదైన శైలిలో ఓటర్లను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో పాటు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటం వల్ల.. గెలుపు నల్లేరుమీద నడకే అని ఆ పార్టీ భావించింది. కానీ, బీజేపీ ఇచ్చిన షాక్ చూసి ఒకరకంగా టీఆర్ఎస్ కలవరపడిపోయింది.
దుబ్బాకలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక బైపోల్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశ విదేశాల్లో కూడా ఈ స్థానంలో గెలుపు ఎవరిదన్న అంశంపై బెట్టింగ్‌లు కూడా సాగాయి. ఫలితంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరకు బీజేపీ వశమయ్యింది.
బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు.. తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన సోలిపేట సుజాతపై అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచీ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. మధ్యలో కొన్ని రౌండ్లలో తడబడినప్పటికీ బీజేపీ చివరి దశలో మళ్లీ ఆధిక్యం కొనసాగించింది. చివరిరౌండ్ దాకా ఆధిక్యం కనబరిచి అంతిమంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
తొలినుంచీ దోబూచులాడిన ఫలితం :
దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపు 23 రౌండ్లలో సాగింది. కొద్దిపాటి ఆధిక్యంతోనే తొలినుంచీ రౌండ్ రౌండ్‌కూ ఫలితాలు వెలువడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రౌండ్ రౌండ్‌కూ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గెలుపు దోబూచులాడింది. టీఆర్ఎస్ 10 రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించగా… బీజేపీ 12 రౌండ్లలో ఎక్కువ ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక రౌండ్లో ఆధిక్యం ప్రదర్శించారు.
ఏ రౌండ్లో ఎవరు ఆధిక్యం?
మొదటి ఐదు రౌండ్లలో వరుసగా బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఆ తర్వాత 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 9వ రౌండ్ బీజేపీకి, 10వ రౌండ్ బీజేపీకి ఆధిక్యాన్ని ఇచ్చాయి. మళ్లీ 11వ రౌండ్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే.. 12వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక.. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. 13వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు టీఆర్ఎస్ వరుసగా ఆధిక్యం చూపించింది. ఈ సమయంలో బీజేపీ శ్రేణుల్లో కొంత ఆందోళన కనిపించినప్పటికీ, చివరికి మళ్లీ బీజేపీ పుంజుకుంది. 20వ రౌండ్ నుంచి వరుసగా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 20 నుంచి 23వ రౌండ్ వరకు బీజేపీ లీడ్‌లో కొనసాగింది.
23 రౌండ్లలో పోల్ అయిన ఓట్లను చూస్తే ఈ ఉప ఎన్నికలో మొత్తం బీజేపీ అభ్యర్థికి 62వేల 772 ఓట్లు పోల్ అయ్యాయి. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థికి 61వేల 302 ఓట్లు పోలయ్యాయి. దీంతో, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. 1470 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటినుంచీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య స్వల్ప ఆధిక్యమే కొనసాగడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందన్న అంశంలో చివరి దాకా స్పష్టత రాలేదు.
22వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ 1058 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక.. చివరిదైన 23వ రౌండ్లో బీజేపీని అధిగమించి టీఆర్ఎస్ విజయం సాధిస్తుందా ? లేదంటే బీజేపీకే ఆధిక్యం కొనసాగుతుందా ? అన్న అంశంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, చివరి రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగి.. టీఆర్ఎస్ అభ్యర్థికన్నా 412 ఓట్లు ఎక్కువ రావడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అసెంబ్లీలోకి రఘునందన్‌రావు అడుగుపెట్టనున్నారు. ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. రఘునందన్‌రావు గెలుపుతో అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య రెండుకు పెరగనుంది.
టీఆర్ఎస్కు టెన్షన్ :
దుబ్బాక ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన విజయం నమోదు చేయడంతో గులాబీ పార్టీలో గుబులు చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తర్వాత ఈ స్థాయిలో దుబ్బాక ఎన్నిక ఫలితం ఉత్కంఠ రేపింది. తొలినుంచీ ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్‌కు గురయ్యాయి. ఓపక్క హరీష్‌రావు.. దుబ్బాక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. అక్కడ బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఓ దశలో ఎన్నికల ప్రచారంలోనే సహనం కోల్పోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. ఆ సమయంలోనే బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైపోయిందన్న ప్రచారం జరిగింది. ఎప్పుడూ ఆవేశం చూపించని హరీష్‌రావు.. సహనం కోల్పోవడమే దీనికి నిదర్శనమన్న విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు ఫలితాలు కూడా వెలువడి బీజేపీ విజయదుందుభి మోగించడంతో హరీష్‌రావుకు టెన్షన్ పట్టుకుంది.
పనిచేసిన సానుభూతి :
గతంలో పలుమార్లు పోటీచేసి ఓటమిపాలైన రఘునందన్ రావు పై దుబ్బాక ప్రజాతీర్పులో సానుభూతి స్పష్టంగా కనిపించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, గతేడాది మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగాపోటీ చేసిన రఘునందన్‌రావు ఓటమిపాలయ్యారు. ఆ సానుభూతి ఇప్పుడు పనికొచ్చింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీపై దుబ్బాక ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా ఈ ఫలితాలకు కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రాబోయే ఎన్నికలపై ప్రభావం :
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తు ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన టిఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతోంది. ముందు ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేతలతో పాటు.. ఆపార్టీ శ్రేణులు కూడా పసిగట్టాయి. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు కావడం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో… దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్లో దడ పుట్టించింది.
అయితే, ఈ ఓటమిని హరీష్‌రావుపైకి నెట్టేందుకు కేసీఆర్ అండ్ కో ప్లాన్లు సిద్ధం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
2 Comments on “Dubbaka Bypoll Results : గులాబీ పార్టీలో గుబులు పుట్టించిన బీజేపీ”