Uttarakhand Massive Floods Consequence : ఉత్తరాఖండ్ ప్రళయానికి కారణాలేంటి?
ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రళయానికి కారణమేంటి? ఒక్కసారిగా అంతటి భీకరమైన వరద పోటెత్తడానికి దారి తీసిన పరిస్థితులేంటి.. అన్నదానిపై శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. దీనికి ప్రధాన కారణం భూతాపమేనని స్పష్టం చేస్తున్నారు. అంటే.. పర్యావరణ మార్పులేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నందాదేవి పర్వతంపై జరిగిన గ్లేషియర్ బరస్ట్ వల్ల వరద పోటెత్తినట్లు నిర్థారణకు వచ్చారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందా?
మన గంగానది సహా.. ప్రపంచంలో చాలా నదులకు హిమనీనదాల నుంచి వచ్చే నీరే మూలం. ఈ హిమనీనదాల్లో ఉండే మంచు గడ్డల లోపలి భాగాల్లో నీరు ప్రవహిస్తుంటుంది. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మంచుగడ్డ పగులుతుంది. లోపలి నుంచి నీరు ఉధృతమైన వేగంతో బయటకు దూకుతుంది. పర్యావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో నీరు కరుగుతుంది. హిమాలయాల్లోని మంచునదులకు ఈ తరహా ముప్పు ఉందని ఏడాది క్రితమే ఒక అధ్యయన నివేదిక వెలువడింది. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర పెరిగితే చాలు.. 2100 నాటికి హిందుకుష్ హిమాలయన్ ప్రాంతంలోని హిమనీనదాలు మూడో వంతు మేర కరిగిపోతాయని ఆ నివేదిక హెచ్చరించింది.
హిందూకుష్ హిమాలయన్ ప్రాంతమంటే చిన్నా చితకది కాదు.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మియన్మార్, చైనా దేశాల్లో 3,500 కిలోమీటర్ల మేర విస్తరించిన సువిశాల ప్రాంతం. దీన్ని థర్డ్ పోల్ గానూ వ్యవహరిస్తారు. ఎందుకంటే.. ప్రపంచంలో ఉత్తర, దక్షిణ ధ్రువాల తర్వాత మంచినీరు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ హిందుకుష్ హిమాలయన్ ప్రాంతమే. అలాగే.. ప్రపంచపు అత్యంత ముఖ్యమైన నీటి బురుజుగా కూడా ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తారు. ఇక్కడి హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు జలధారను అందిస్తున్నాయి. ఎనిమిది దేశాల్లోని దాదాపు 180 కోట్ల మందికి నీటి అవసరాలు తీర్చే ప్రాంతమిది.
హిమనీ నదాల్లో మార్పులు వస్తున్నాయా?
హిందూకుష్ ప్రాంతంలోని హిమనీనదాలన్నీ 7 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని అంచనా. అప్పటి నుంచి 1970 దాకా వాటికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ.. ఆ దశకంలో మొదలైన భూతాప సమస్య శ్రుతి మించుతుండడంతో హిమనీనదాలు కరగడం ప్రారంభమైంది. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకు పైగా హిమానీనదం మంచు నిక్షిప్తమై ఉంది. పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ ప్రాంతంలో మనుషుల ప్రభావం ఎక్కువ కావడమూ ఇలాంటి ప్రమాదాలకు ఒక కారణమని పర్యావరణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా హిమానీనద చరియలు విరిగిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీనదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాలు నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని పేర్కొంటున్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లో దాదాపు 200కుపైగా ప్రధాన హిమానీ నదాలు ఉన్నాయి.
హిందుకుష్ హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు తాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్నాయి. హిమానీనదాల కరుగుదలవల్ల వీటికి ప్రమాదం ఏర్పడుతోంది. నీటి లభ్యత కూడా తగ్గిపోతుంటుంది. ఈ కొరత 20-70 శాతం మేర ఉందని హిమాలయ ప్రాంతంలోని 8 పట్టణాల్లో జరిగిన సర్వేలో వెల్లడైంది. 2050 నాటికి ఇది రెట్టింపు కావొచ్చని అంచనా.
మంచు చరియలు కరిగిపోతున్నాయా?
1975-2000 సంవత్సరాల మధ్య కరిగిన మంచు కంటే ఆ తర్వాత కరుగుతున్న పరిమాణం రెట్టింపు మేర ఉంది. భూగోళం వేడెక్కుతుండడంతో హిమాలయ ప్రాంతంలో మంచుకొండలు ఏటా 0.25 మీటర్ల మేర మంచును కోల్పోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇది ఏటా 0.5 మీటర్లకు పెరగడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. నిర్దిష్టమైన అంచనాలు వేయకపోయినా గత నాలుగు దశాబ్దాల్లో మంచు చరియలు తమ మొత్తం పరిమాణంలో నాలుగో వంతును కోల్పోయి ఉంటాయని భావిస్తున్నారు.
పర్యావరణ సమతౌల్యం దెబ్బతినేలా ఎలా పడితే అలా భారీ నిర్మాణాలు చేపట్టడం వంటి పనులు చేపట్టకూడదని.. కానీ ఇప్పుడక్కడ జరుగుతోంది అదేనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిర్మాణాలకు చెక్క, రాతిని వంటి వాటిని వాడకుండా కాంక్రీట్‌ను వాడడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో వస్తున్న పర్యావరణ మార్పులపై నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.
ఇవికూడా చదవండి :
Vivekananda in Hyderabad : స్వామి వివేకానంద హైదరాబాద్ వచ్చారు తెలుసా? ఆ పర్యటన విశేషాలు ఏంటంటే?
Telangana-KCR : మరోసారి ఫూల్స్ అయిన తెలంగాణ జనం – అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం
Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం