VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్‌ వడ్డి విజయసారథి

VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్‌ వడ్డి విజయసారథి

కుడిచేత్తో చేసేదానం ఎడమచేతికి తెలియనీయక పోవటం పాతమాట. ప్రభుత్వ యంత్రాంగం వెయ్యికాళ్ల జంతువు. కాళ్లన్నీ కదులుతూనే ఉంటాయి. అది ఉన్నచోటనుండి కదలదు(రాజాజీ చెప్పిన మాట). ఒక అంగంచేసేపని మరొక అంగానికి తెలియదు. పరస్పర వ్యతిరేకంగా పనిచేసుకు పోవటం కద్దు. అంతేకాదు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు (ప్రభుత్వ విభాగాలు) కోర్టులకెక్కి ప్రజాధనం వ్యయపరచటమూ మామూలే.

ఒక కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఏర్పడు తున్నపుడు కావలసిన భూమి, ఇతర వనరులు (నీరువగైరా), ముడిసరుకు, మానవశక్తి (కార్మికులు), యంత్ర చాలనశక్తి (ఇంధనం), విక్రయానికి అనువైన విపణి (మార్కెట్), నిర్వహణాసామర్థ్యం దండిగా ఉన్న యాజమాన్యం, మూలధనం(పెట్టుబడి).. ఇవన్నీ చూసుకొని పెట్టాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పేవారని ఏకాత్మ మానవదర్శనంలో దీనదయాళ్ ఉపాధ్యాయ ఉటంకించారు. ఇవేవీ చూసుకోకుండా “జనవాక్యం తు కర్తవ్యం” అంటూ ఎవరినో మెప్పించడానికి కర్మాగారాలు ఏర్పరిస్తే నష్టాలే వస్తాయి.

2004-14 మధ్య UPA ప్రభుత్వం ఎంత కంగాళీ చేసిందో చెప్పలేము. ఎమర్జెన్సీ అత్యాచారాల గురించి జస్టిస్ షా కమిషన్ వేసినట్లే దీని గురించి కూడా ఒక కమిషన్ వేయాలి. వారి పదేళ్ల పాలన ముగిసి 2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోదీ దేశంలో ఉత్పాదన స్తంభించిపోవటము, నిరుద్యోగం ప్రబలటము, డిగ్రీలు ఉన్నవారిలో సామర్థ్యము, నైపుణ్యమూ కొరవడటమూ, మన పారిశ్రామిక వేత్తలు తమ పెట్టుబడులను విదేశాలకు తరలించ టమూ గమనించి “Make in India” అని పిలుపునిచ్చారు.

గత అయిదారు సంవత్సరాలలో జనాభిప్రాయానికి కొద్దిగానో, గొప్పగానో స్పందిస్తున్న ప్రభుత్వం కనబడుతున్నందున మనం ఈ మాత్రం మాట్లాడుతున్నాం గాని 2014 ముందు ఇలాంటి చర్చలు, సలహాలూ ఉండేవా? ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ మళ్ళీ ఓనమాలతో ప్రారంభించినవేళ ఉత్పాదన మొదలు కావటానికై అనేక రకాల సూచనలను పరిశీలిస్తుండేవారు. అలాంటి సమయంలో 2018లో కొరియాకు చెందిన పోస్కో వచ్చి విశాఖ ఉక్కు కర్మాగారం అదుపులో వృథాగా పడిఉన్న భూమిలోంచి 200 ఎకరాలు ఇస్తే తామొక ఉక్కుకర్మాగారం ప్రారంభిస్తామని చెప్పింది.

2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పోస్కో వారిని పిలిపించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి అనుసంధానం చేశారు. ఈ మేరకు అవగాహన కుదిరింది. (మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ -నాన్ బైండింగ్) వ్రాసుకున్నారు.

ఈ ఆరేళ్లలో మనదేశపు ఆర్థిక స్థిరత్వం గురించి మనకు నమ్మకం కుదిరింది. కాబట్టి అమ్ముకోవటమేమిటని ప్రశ్నించడానికి ధైర్యంవచ్చింది. మంచిదే.. అయితే ఏప్రశ్న ఎవరిని అడగాలో వారిని అడగాలి. ఆ వివేకం మేలు కొంటుందని ఆశిస్తాను. పెట్టుబడి దారులకు అనుకూలంగా, ఆంధ్రులపట్ల చిన్న చూపుతో కేంద్రం నష్టదాయకమైన నిర్ణయం తీసుకొంటున్నదనే విమర్శలు నిలిపేద్దాం.

– డాక్టర్‌ వడ్డి విజయసారథి (నవయుగభారతి ప్రచురణల సంపాదకులు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *