VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి?

VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాక తప్పదా? – కంపెనీపై ఆధారపడిన వాళ్ల పరిస్థితి ఏంటి?
ఆంధ్రులకు గర్వకారణమైన విశాఖ ఉక్కు ..ఇక ప్రైవేటుపరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం కొంతకాలంగా నష్టాలతో నడుస్తోంది. అయితే ప్రస్తుతం అన్ని ఉక్కు కర్మాగారాలదీ ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండ్‌ లేకపోవడంతో ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. పైగా విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ముడి ఇనుమును మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. అయినా ఇతర కంపెనీలతో పోటీ పడుతోంది.

విశాఖ ఉక్కులో 17 వేల మంది శాశ్వత ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. ఇటీవల కరోనా నేపథ్యంలో కర్మాగారం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. అయితే గత డిసెంబరులో స్టీల్‌ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం 2017-18లో 16 వేల 618 కోట్ల రూపాయల అమ్మకాలు జరగ్గా 13 వందల 68 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఆ తరువాత ఏడాది 2018-19లో రూ.20 వేల 844 కోట్ల అమ్మకాలు జరగడంతో నష్టాలను రూ.97 కోట్లకు తగ్గించగలిగింది. 2019-20లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అమరావతిలో నిర్మాణాలు సహా పలు భారీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో అమ్మకాలు రూ.15 వేల 920 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. దాంతో రూ.3,910 కోట్లకు నష్టాలు పెరిగాయి. ఆ తరువాత ముడి ఇనుము, కోకింగ్‌ కోల్‌, డోలమైట్‌ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది.

ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ విశాఖ ఉక్కును సందర్శించి నివేదికను సమర్పించింది. నష్టాల తగ్గింపునకు అనేక చర్యలు తీసుకున్నా ప్రతికూల ప్రభావాల వల్ల ఫలితాలు రాలేదని పేర్కొంది. సంస్థ కూడా నష్టాల తగ్గింపునకు ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేసుకుందని నివేదించింది.

గత కొన్నాళ్లుగా విశాఖ ఉక్కును విక్రయించాలని భావిస్తున్న కేంద్రం ముందుగా పోస్కోను రంగంలో దింపింది. దక్షణ కొరియాకు చెందిన ఈ సంస్థతో విశాఖ ఉక్కుకు చెందిన భూములు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. దీనిని కార్మిక సంఘాలు వ్యతిరేకించినా ముందడుగు వేసింది. ఇప్పుడు ఏకంగా 100 శాతం వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు చేసింది. వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం పేరుతో మొత్తం సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే కేంద్రం ప్రయత్నాలపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరో ఉద్యమం చేసైనా.. సంస్థను రక్షించుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *