VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ఉద్యమం – పూర్వాపరాలు 1

VIZAG STEEL – RINL – Privatisation : విశాఖ ఉక్కు ఉద్యమం – పూర్వాపరాలు 1
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ఉద్యమం విశాఖపట్టణంలో ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించారు. టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటి నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించారు.

Vo: విశాఖ ఉక్కు కర్మాగారానికి దశాబ్దాల చరిత్ర ఉంది. దీన్ని సాధించడం వెనుక ఎందరో మహానుభావుల కృషి ఉంది. 1967లో సాధారణ ఎన్నికల కోసం అన్ని రాజకీయ వర్గాలూ సిద్ధమవుతున్నాయ్. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ అంతర్గతంగా ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. అప్పటికే మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత.. మద్రాసు నగరాన్ని కోల్పోయామన్న అసంతృప్తి ప్రజల మనసులోంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికి పదేళ్లు అయ్యాయి. పారిశ్రామిక ప్రగతితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని అప్పుడప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కానీ మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో.. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు ఏవీ దక్కలేదని జనంలో అసంతృప్తి ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఓడిశాలో రూర్కెలా , మధ్యప్రదేశ్ భిలాయ్, పశ్చిమబెంగాల్ అసన్‌సోల్ లో మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. భిలాయ్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. కొత్తగా స్థాపించే స్టీల్ ప్లాంట్లలో ఒకటి బిహార్ బొకారోలో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. అలా విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు బీజం పడింది….

1964 శీతాకాల సమావేశాల్లో ఆ ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు.. పరిశ్రమల విషయంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిచేయటానికి.. ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి. అలా నెలకొల్పే వరకూ అసమతుల్యత తొలగిపోదు. రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు.ఈ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు మద్దతిచ్చారు. అయితే.. ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం మీద మొదట హిందుస్తాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక.. విశాఖపట్నానికి అనుకూలంగా లేదు. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన.. 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం పేరుతో ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు. ఉక్కు పరిశ్రమను స్థాపించటానికి అనువైన ప్రదేశం గురించి నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయం తెలుసుకోవటం ఆ కన్సార్షియం ఏర్పాటు లక్ష్యం. ఇది ఆరు వేర్వేరు స్థలాలు విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించింది. ఆ బృందం 1965 జూన్ 25వ తేదీన నివేదిక సమర్పించింది. దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది.

ఈ కన్సార్షియం తన నివేదికను పూర్తి చేసే సమయానికే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను చాటడానికి తెన్నేటి విశ్వనాథం సారథ్యంలో.. బలమైన అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఐదేళ్లు జైలులో కూడా ఉన్న తెన్నేటి.. విశాఖ స్టీల్ ప్లాంటుకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించటంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికే రెండు మూడేళ్ల నుంచి విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చ జరుగుతుండటంతో ప్రజల్లో దీనిపై అంచనాలు పెరిగాయి. ఒక భారీ కర్మాగారం ఏర్పాటైతే లభించే ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధి గురించిన ఆశలు మొలకెత్తాయి. కన్సార్షియం నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం స్థాపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహజంగా భావించారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న లాల్‌బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ప్లాంటు ఏర్పాటు గురించి ప్రకటన చేయటంలో జాప్యం.. ప్రజల్లో అపోహలకు, అసంతృప్తులకు, ఆందోళనలకు దారితీసింది.

విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్పష్టత కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయంలోనే 1966లో లాల్ బహుదూర్‌ శాస్త్రి ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు.దీంతో మళ్లీ ప్లాంట్ ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టు మారింది. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్లాంట్ ఏర్పాటు వరకూ ఏం జరిగింది?

ఇందిరాగాంధీ ప్రధాని కాకముందే…1965లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం బ్రహ్మానందరెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ఐదో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రాంతం గురించిన ప్రకటనలో జాప్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను అత్యవసరంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా.. ఐదో ఉక్కు కర్మాగారం నెలకొల్పటం సాధ్యం కాదని ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక తేల్చి చెప్పారు. ఎన్నికల ఏడాది కావడంతో స్టీల్ ప్లాంట్ కోసం పలు రాష్ట్రాలు పట్టుబడుతున్నపుడు ఒకచోట ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో అసంతృప్తి తలెత్తుతుందన్నది కాంగ్రెస్ భావన అనే విమర్శలొచ్చాయ్….

కర్ణాటక, తమిళనాడు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయ్. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే…. సేలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన తలెత్తింది. ఈ క్రమంలో నీలం సంజీవరెడ్డిని ఉక్కు శాఖ నుంచి పర్యాటక, విమానయాన శాఖకు బదిలీ చేశారు ఇందిర. ఉక్కు శాఖ మంత్రిగా టి.ఎన్.సింగ్ నియమితులయ్యారు..

ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మధ్య ఆదిపత్య పోరు మొదలైంది. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాసు, నీలం వర్గం పరస్పరం పైచేయి సాధించటానికి ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు సాగేవి. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డికి రాష్ట్రంలో పార్టీ మీద ఉన్న పట్టును దెబ్బతీసేందుకు.. విశాఖ ఉక్కుకు ఆయనే అడ్డమనే అభిప్రాయం కలిగించటానికి ఈ ఉద్యమాన్ని ప్రేరేపించారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని విశాఖ పర్యటనలో నీలం సంజీవరెడ్డి చెప్పారంటూ అప్పట్లో వార్తలొచ్చాయ్

1966 అక్టోబర్, నవంబర్‌లో ఉద్యమం బలపడింది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నాయి. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, యం.వి.భద్రం, రావిశాస్త్రి తదితరులు ప్రసంగించారు.

1966 నవంబర్ 1న విశాఖలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. దీంతో ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. హింసాత్మకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. రైల్వే స్టేషన్లు ఆందోళనకారుల లక్ష్యమయ్యాయి…

విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి ఏపీలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

1966 నవంబర్ 3న దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సరేనందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది. అయితే.. ఉద్యమాన్ని చల్లార్చటానికి కేంద్రం ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఆ ఉపసంఘం విశాఖకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని వార్తలు రాగా.. అసలు అలాంటి నివేదిక ఏదీ కేబినెట్ ముందుకు రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం ఒత్తిడికి తలొగ్గితే.. మిగతా రాష్ట్రాల్లోనూ ఉద్యమించాలన్న సంకేతం ఇచ్చినట్లు అవుతుందన్నది నాటి ఇందిరాగాంధీ అభిప్రాయంగా పత్రికలు పేర్కొన్నాయ్…

కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోదని స్పష్టమయ్యాక.. ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కానీ.. ఆ ఉద్యమం బలంగా సాగలేదు. అసలు ఉద్యమం హింసాత్మకంగా మారటానికి విపక్షాలే కారణమని బ్రహ్మానందరెడ్డి తప్పుపట్టారు. ఉద్యమం విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ప్రతిపక్షాలు.. పోలీసుల కాల్పులపై న్యాయవిచారణ జరిపించాలన్న డిమాండ్‌‌ను ప్రభుత్వం తిరస్కరించటానికి నిరసనగా.. 1966 నవంబర్ 17వ తేదీన అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 67 మంది ఎంఎల్‌ఏలు.. తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. సీపీఐకి చెందిన నలుగురు లోక్‌సభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. కానీ.. ఆ తర్వాత 1967 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 165 అసెంబ్లీ సీట్లు, 35 లోక్‌సభ సీట్లు గెలుచుకుని కేంద్ర, రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. నాటికి మూడేళ్ల తర్వాత.. 1970 ఏప్రిల్ 17న.. విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు.

ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పనులు మొదలయ్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.
కానీ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతగా ఇనుప ఖనిజం గనులు లేకపోవటంతో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *