Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : భాగ్యనగరంలో గణపయ్యకు భక్తజనం వీడ్కోలు

  భాగ్యనగరం గణేశుడి ఘోషతో మారుమోగిపోతోంది. నవరాత్రులు చివరి అంకానికి చేరాయి. వాడవాడలా ప్రతిష్టించిన గణనాథులన్నీ హుస్సేన్‌ సాగరం వైపు తరలి వె...


 


భాగ్యనగరం గణేశుడి ఘోషతో మారుమోగిపోతోంది. నవరాత్రులు చివరి అంకానికి చేరాయి. వాడవాడలా ప్రతిష్టించిన గణనాథులన్నీ హుస్సేన్‌ సాగరం వైపు తరలి వెళ్తున్నాయి. గంగమ్మ చెంతకు చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. భక్తులు అంతే కోలాహలంతో గణనాథున్ని సాగనంపుతున్నారు.

ప్రతి గణనాధుని వెంట శోభాయాత్రలో భక్తజనం పరవశించిపోతోంది. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులన్నీ గణేశుడి శోభాయాత్రతోనే నిండిపోయాయి. భజనలు చేస్తున్నారు. సంప్రదాయ నృత్యాలతో గణనాధున్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఊరంతా ఏకమై ఆయన వెంట నడుస్తూ సందడి చేస్తున్నారు. దీంతో, గజం కదలడానికి గంట సమయం పడుతోంది. కిలోమీటర్‌ దూరం చేరుకోవడానికి ఓ పూట పడుతోంది. హైదరాబాద్‌లో గణేశుడి నిమజ్జన శోభాయాత్ర చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు.



ఈ ఉత్సవ పర్యవేక్షణ మొత్తం భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి చేపడుతోంది. భద్రతా ఏర్పాట్లను పోలీస్‌ విభాగం పర్యవేక్షిస్తోంది. ఇతర శోభాయాత్రకు సంబంధించిన పర్యవేక్షణ.. ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా బాధ్యతగా విధి నిర్వహణ నెరవేరుస్తోంది. ఫలితంగా.. అందరి సహకారంతో.. అన్ని విభాగాల సమన్వయంతో భాగ్యనగరంలో గణేశుడు గంగమ్మ చెంతకు తరలివెళ్తున్నాడు. పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నెలకొల్పారు. ప్రత్యేక బృందం ఆ పర్యవేక్షణ బాధ్యతలు నెరవేరుస్తోంది.


హైదరాబాద్‌లో గణేశుని నవరాత్రోత్సవాల పేరు వింటే గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి ఖైరతాబాద్‌ మహాగణపతి. రెండోది బాలాపూర్‌ లడ్డూ గణపతి. ఈ రెండు వినాయక ఉత్సవాలు ఖండాంతర ఖ్యాతిని సంపాదించాయి.  యేడాది కేడాది పురోభివృద్ది సాధిస్తున్నాయి. ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రతియేటా శోభాయాత్రలో హైలైట్.  ఈ యేడాది కూడా అలాగే, మహాగణపతి ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా చూస్తే ఖైరతాబాద్‌కు హుస్సేన్‌ సాగర్‌ కిలోమీటర్‌ దూరం కూడా ఉండదు. కానీ, ఉదయం మొదలైన శోభాయాత్ర.. మధ్యాహ్నానికి గానీ ట్యాంక్‌ బండ్‌కు చేరలేదు. మధ్యాహ్నం ఖైరతాబాద్‌ గణపతి నిమజ్జనం పూర్తయ్యింది. అయితే, రెండు మూడేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ మాత్రం తొందరగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటోంది. గతంలో అయితే, మరుసటిరోజు ఉదయానికి ట్యాంక్‌బండ్‌కు చేరుకునేది ఖైరతాబాద్‌ గణపతి. నగరంలోని అన్ని వినాయకులు నిమజ్జనమైన తర్వాత చివరిగా ఖైరతాబాద్‌ గణపతిని నిమజ్జనం చేసేవారు. కానీ, ట్రాఫిక్‌ సమస్యలు, ఇతర కారణాలతో ఖైరతాబాద్‌ గణేశున్ని త్వరగానే నిమజ్జనం చేస్తున్నారు. 


 

ఇక, బాలాపూర్‌ గణేశుడు కూడా.. ఉదయం వేలంపాట తర్వాత ట్యాంక్‌బండ్‌కు బయలుదేరాడు. ఈయేడాది బాలాపూర్‌ గణపతి లడ్డూ వేలంపాటలో రూ.18.60 లక్షలు పలికింది. మర్రి శశాంక్‌, రమేష్‌యాదవ్‌ అనే ఇద్దరు మిత్రులు కలిసి ఈసారి వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. 




No comments