Page Nav

HIDE

Grid

GRID_STYLE

factful : దటీజ్‌ బతుకమ్మ - నా బతుకమ్మ పాట గొప్పదనం ఇదే... ఆ గొప్పదనం ఏంటో తెలుసా?

బతుకమ్మ.. తెలంగాణలో పాలుగారే పసిపాప మొదలు కొని పండు ముదుసలి దాకా పేరు వింటేనే నిలువెల్లా జోష్‌ ఉరకలెత్తుతుంది. ప్రత్యేకంగా దీని గురించి వర్ణ...బతుకమ్మ.. తెలంగాణలో పాలుగారే పసిపాప మొదలు కొని పండు ముదుసలి దాకా పేరు వింటేనే నిలువెల్లా జోష్‌ ఉరకలెత్తుతుంది. ప్రత్యేకంగా దీని గురించి వర్ణించాల్సిన అవసరం అసలే లేదు. ప్రజల జీవితంతో ముడి వేసుకున్న  అతిగొప్ప పండుగ బతుకమ్మ. దసరా పర్వదినానికి ముందు దేవీ శరన్నవరాత్రుల సమయంలో తెలంగాణ లోగిళ్లన్నీ మురిసిపోయే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు.. ఊరూ వాడా పసందైన పాటల్లో మునిగిపోయే సందర్భం అది.

దేనినైనా ఇముడ్చుకునే స్వభావం :

బతుకమ్మ పాట.. అదో ప్రవాహం. నిరంతరం జాలువారే నీటి ఊట వంటిది. ఏ సందర్భాన్నయినా, ఏ అంశాన్నయినా, ఏ భావోద్వేగాన్నయినా, ఏ పరిస్థితులనైనా తనలో ఇముడ్చుకునే స్వభావం కలిగింది నా బతుకమ్మ పాట. పాజిటివ్‌ అయినా, నెగెటివ్‌ అయినా, ఒకే అంశాన్ని భిన్నంగా చెప్పినా ఏమాత్రం ఎబ్బెట్టు లేకుండా సాగిపోయే సాహితీ స్రవంతి బతుకమ్మ పాట.

లయబద్ధమైన సాహితీ స్రవంతి :

బతుకమ్మ పాట.. ఓ జీవనది వంటిది.. విరామం ఎరుగకుండా, విశ్రాంతి లేకుండా సాగిపోయే పాటల పల్లకి. సందర్భానుసారంగా అప్పటికప్పుడు పాటలు కై గట్టి ఓ క్రమ పద్ధతిలో, ప్రత్యేకమైన శైలిలో అల్లుకుపోయే స్వభావం ఉన్నది బతుకమ్మ పాట. అందుకే దసరా, శరన్నవరాత్రుల సీజన్‌ వచ్చిందంటే చాలు.. టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా దసరా పాటలను తయారు చేసుకుంటాయి. ప్రత్యేకంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ షూటింగ్‌ చేసి లయబద్ధమైన బతుకమ్మ పాటలను ప్రేక్షకులకు అందిస్తాయి. బతుకమ్మ పాటల పల్లకిలో జనాన్ని ఓలలాడిస్తాయి.

ముచ్చట్లు పెట్టుకునే భాష :

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల భాష బతుకమ్మ పాట భాష. జనం మాట్లాడుకునే, ముచ్చట్లు చెప్పుకునే భాష బతుకమ్మ పాటల్లో ప్రస్ఫుటిస్తుంది. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా బతుకమ్మ పాటల సాహిత్యం ఉండటం దాని గొప్పదనం. వ్యావహారిక భాష, పుస్తకాల భాష, సాహిత్యభాష, పట్టణీకరించిన భాష, నగరీకరణ ముసుగేసుకున్న భాషకు బతుకమ్మ పాటతో సంబంధం లేదు. అచ్చ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నడిరోడ్డుమీద కలిసిన వాళ్లు పలకరించుకునే భాష, రచ్చబండ దగ్గర నలుగురు మనుషులు చేరి ముచ్చట్లు చెప్పుకునే భాష బతుకమ్మ పాట భాష.

కైగట్టిన కరోనా పాటలు :

గతేడాది కరోనా సమయంలో కరోనా బతుకమ్మ పాటలు ఊరూ వాడలను ముంచెత్తాయి. ఛానెళ్లు, సోషల్ మీడియాను, ఆన్‌లైన్‌ మీడియాను ఉర్రూతలూగించాయి. లయ బద్ధంగా బతుకమ్మ పాటలను కరోనాను అనునయిస్తూ సాగిన పాటలు అందరినీ మైకంలో ముంచెత్తాయి. వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టేలా చేశాయి. మహమ్మారిని పాటలతోనే శపించిన సందర్భాలు బతుకమ్మ వేడుకల్లో దర్శనమిచ్చాయి.

పొలిటికల్‌ బతుకమ్మ సీజన్‌ :

ఇక, ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా పలు ఛానెళ్లు, సంస్థలు, సోషల్‌ మీడియా ఛానెళ్లు ప్రత్యేకంగా బతుకమ్మ పాటలను రూపొందించాయి. అత్యద్భుతమైన సాహిత్యంతో ప్రజలకు చేరవేశాయి. అయితే ఇదే తరుణంలో రాజకీయ బతుకమ్మ పాటలు ఈసారి హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. అయితే, ఎవరు ఏ పాటను బతుకమ్మకు అన్వయించినా.. సహజత్వం ఉట్టిపడుతోంది. అప్పటికప్పుడు సందర్భాన్ని, సబ్జెక్టును మార్చిన విషయం బయటపడటం లేదు. ఎవరు ఏ కోణంలో, ఎవరు ఏ ఆలోచనలో పాటను ఎత్తుకుంటే అందులో బతుకమ్మ పాట ఇమిడిపోతోంది.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రెండు మూడు పాటలను పరిశీలిద్దాం...

https://www.youtube.com/watch?v=yl9cHUYAM1U

ఈ పాటను పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ ముఖ్యంగా కేసీఆర్‌ను వ్యతిరేకిస్తూ రాసిన బతుకమ్మ పాట ఇది. కేసీఆర్‌ను విమర్శించినా, ప్రభుత్వం తీరును ఎండగట్టినా ఏ మాత్రం విమర్శించినట్లుగానీ, దూషించినట్లు గానీ కనిపించడం లేదు. కానీ, వెటకారం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బతుకమ్మ పాట సహజత్వం ఉట్టిపడుతోంది.
కేసీఆర్‌ పాలనా విధానాన్ని లయబద్ధంగా, ఆకట్టుకునేలా సాహిత్యాన్ని రూపొందించారు. ఎక్కడ కూడా బోర్‌ కొట్టకుండా వినేకొద్దీ మరింతగా వినేలా ఈ బతుకమ్మపాటను రూపొందించారు.

ఇంకో పొలిటికల్‌ బతుకమ్మ పాట ఎలా సాగిందో పరిశీలిద్దాం...

https://www.youtube.com/watch?v=lFpPoqdd2Pk

ఇక్కడ ప్రస్తావించిన పాట కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగింది. ముఖ్యంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. వాటి పురోగతిని ప్రశ్నిస్తూ సాగిందీ పాట. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక కోణంలో ఈ పాట సాహిత్యాన్ని రూపొందించారు. ఈ బతుకమ్మ పాటకు, మహిళల లయబద్ధమైన బతుకమ్మ నృత్యానికి అత్యద్భుతంగా సరిపోయింది.

ఇక, టీఆర్‌ఎస్‌ కోణంలో పై పాటలను ఎండగట్టిన బతుకమ్మ పాటను ఇప్పుడు చూద్దాం...


https://www.youtube.com/watch?v=zIk1hFAwq4w

పైన టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రూపొందించిన సాహిత్యానికి ఉపయోగించిన వీడియోనే దీనికి కూడా వినియోగించుకున్నారు. వీధిలో మహిళల బతుకమ్మ ఆటకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు తమకు అనుకూలమైన సాహిత్యాన్ని జోడించి ప్రతిగా సోషల్ మీడియాలోకి రిలీజ్‌ చేశారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ పాటను రూపొందించారు.

వీడియో ఒకటే అయినా పూర్తిభిన్నమైన సాహిత్యం :


వీడియో ఒకటే అయినా, సాహిత్యంలో తేడా ఉంది.  ఆ వీడియోకు కొందరు టీఆర్‌ఎస్‌ వ్యతిరేక పాటను జోడిస్తే.. మరికొందరు బీజేపీ వ్యతిరేక సాహిత్యంతో కూడిన పాటను జోడించారు.

అంటే.. ఏ పరిస్థితులనైనా, ఏ అంశాలనైనా, ఎవరిమీద విమర్శలనైనా, ఎవరిపై పొగడ్తలనైనా, ఏ సంస్కృతిని ఆకాశానికెత్తాలన్నా, ఏ వ్యవహారాన్ని అథః పాతాళంలోకి తొక్కేయాలన్నా.. ఏ రకమైన సాహిత్యాన్నయినా తనలో ఇముడ్చుకునే గొప్ప స్వభావం బతుకమ్మకే సొంతం.

దటీజ్‌ బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ... జనం బతుకును కోరే సాహితీ జీవధార బతుకమ్మ...
జయహో బతుకమ్మా.. జయ జయహో బతుకమ్మా...


2 comments

  1. Replies
    1. Thank you very much sir, for your compliment.. please fallow and give suggestions about factful articles...

      Delete