Page Nav

HIDE

Grid

GRID_STYLE

FACTFUL - Factcheck - ఏదినిజం? : బతుకమ్మ ఎత్తిన ఇందిరాగాంధీ - సోషల్ మీడియాను ముంచెత్తుతున్న ఇమేజ్‌

బతుకమ్మ.. తెలంగాణలో అతిపెద్ద పండుగ. అత్యంత ముఖ్యమైన పండుగ. తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని, ప్రకృతిని ఆరాధించే గుణాన్ని తనలో ఇముడ్చుకున్...


బతుకమ్మ.. తెలంగాణలో అతిపెద్ద పండుగ. అత్యంత ముఖ్యమైన పండుగ. తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని, ప్రకృతిని ఆరాధించే గుణాన్ని తనలో ఇముడ్చుకున్న మహోన్నతమైన పండుగ. సాధారణంగా పండుగ అంటే ఒకేరోజు చేసుకుంటాం. కానీ, బతుకమ్మ మాత్రం తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలుగా జరుపుకుంటాం. అలాంటి బతుకమ్మ ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు.

తెలంగాణతో సంబంధమున్న, తెలంగాణ సంస్కృతి గురించి తెలిసిన ప్రతి రాజకీయ నాయకుడు తప్పనిసరిగా బతుకమ్మను ఎత్తుకోవాలని ఆరాటపడుతుంటారు. బతుకమ్మ ఉత్సవంలో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే ఇక్కడి రాజకీయ నాయకులే కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు, ఉత్తరాది రాజకీయ నాయకులు, నాయకురాళ్లు కూడా బతుకమ్మ వేడుకల్లో ఒక్కసారైనా పాల్గొనేందుకు తహతహలాడుతారు. అటు.. ప్రకృతి మాత ఆశీర్వాదాన్ని.. ఇటు ప్రజల ఆదరణను ఏకకాలంలో చూరగొంటారనడంలో సందేహం లేదు.

బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. రాజకీయ నాయకుల సందడి అంతా ఇంతా కాదు. నిత్యం మీడియాలో కనిపించేందుకు, ప్రచారం కోసం కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు రాజకీయ నాయకులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ పోటీ మరింత పెరిగింది. ప్రభుత్వం ఏకంగా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా యేటా నిధులను కేటాయిస్తోంది.

అయితే, ఇటీవల తెలంగాణ పాఠ్యాంశాల్లో ఓ అంశం వివాదాస్పదమయ్యింది. సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి వల్లే బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తం అయ్యిందంటూ పేర్కొన్నారు. ఒకరకంగా అంతకుముందు బతుకమ్మ పండుగ గురించి ఎవరికీ తెలియదన్న రీతిలో ఆ పాఠ్యాంశాన్ని రూపొందించారు. దీనిపై ప్రధానంగా సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతోంది. కవిత పుట్టకముందు నుంచే బతుకమ్మ వైభవం దేశ, విదేశాల్లో ఉందని, ప్రతియేటా.. విదేశాల్లోని తెలుగు సంస్థలు కూడా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాయని గుర్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ అరుదైన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా బతుకమ్మ ప్రాశస్త్యాన్ని గుర్తించారని, ఆమె కూడా బతుకమ్మ ఎత్తుకున్నారని ఆ ఫోటోకు రైటప్స్‌ జోడిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు, శ్రేణులు ఈ వాదాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.


ఆ ఫోటోను గమనిస్తే కొందరు మహిళలు, మరికొందరు ప్రముఖులు ఉన్న ఆ ఫోటోలో ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. ఆమె చేతిలో బతుకమ్మ ఉంది. ఫోటోను గమనిస్తే.. ఎప్పటిదో పాత ఫోటో... అందులో ఉన్న మహిళలను గమనిస్తే.. సంప్రదాయ చీరకట్టులో ఉన్న వాళ్ల హావభావాలు తెలుగు దనానికి నిదర్శనంగా ఉన్నాయి. అంటే... ఆ ఫోటోలో ఉన్నది తెలంగాణకు చెందిన మహిళలే అన్న విషయం అర్థమవుతోంది.


దీని గురించి ఫ్యాక్ట్‌ఫుల్‌.. ఫ్యాక్ట్‌ చెక్‌ చేపట్టింది. ఈ ఫోటోను పోలిన ఫోటోలు, ఇందిరాగాంధీకి బతుకమ్మతో ఉన్న సంబంధం గురించిన వార్తా కథనాలు ఏమైనా ఇంతకుముందు ఉన్నాయేమో అని పరిశీలించడం జరిగింది. దీంతో, సాక్షి దినపత్రికలో 2017 సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రచురితమైన ఓ వార్తాకథనం, ఆ కథనానికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటో కూడా జోడించి ఉండటం గుర్తించడం జరిగింది.


''ఆ వార్తా కథనంలో ఉన్న సారాంశాన్ని బట్టి చూస్తే.. 1978లో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమాచార కమిషనర్‌గా ఉన్న దుర్గా భక్తవత్సలం చొరవతో దేశ రాజధాని ఢిల్లీలో వరంగల్‌కు చెందిన మహిళలు బతుకమ్మ ప్రదర్శన ఇచ్చారని పేర్కొన్నారు. లయబద్ధంగా బతుకమ్మ పాటలకు మహిళల ఆట పాటలు చూసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆసక్తి చూపించారట. ఎంతో వైభవంగా వరంగల్‌లో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని, భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారని ఇక్కడినుంచి వెళ్లిన బృందం ఇందిరాగాంధీకి వివరించారట. దీంతో, బతుకమ్మ పండుగ గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం మాదిరిగా.. వరంగల్‌ ప్రాంతంలోనూ బతుకమ్మ ఆడుకోవడానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఇందిరాగాంధీ సూచించారని చెప్పారట.''


దాదాపు 43 యేళ్ల క్రితం నాటి సందర్భం అయినందున ఈ ఫోటోకు సంబంధించిన వివరాలు, మొదటగా ఆ ఫోటో ఎక్కడ తీశారు? ఎవరు తీశారన్న వివరాలు మాత్రం అందుబాటులో లేవు. కానీ, సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం బట్టి చూస్తే.. ఈ ఫోటో వాస్తవమే అన్న ఆలోచన కలుగుతోంది.


ఇక, ఇదే అంశంపై మరింత పరిశోధించగా.. మొదటగా ఈ ఫోటోను ఎప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారో తెలిసింది. VSSR అనే ప్రొఫైల్‌ కలిగిన సోషల్‌ మీడియా యూజర్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఈ ఫోటోను తొలిసారిగా 2019 అక్టోబర్‌ 17వ తేదీన పోస్ట్ చేశారు.


ఈ ట్వీట్‌ను కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ సీఎంఓ సహా పలువురు రీట్వీట్‌ చేయడంతో పాటు.. కొందరు లైక్‌ చేశారు.

=============================================
ప్రచారం : తెలంగాణ సంస్కృతి ప్రాశస్త్యాన్ని గుర్తించి బతుకమ్మ ఎత్తుకున్న ఇందిరాగాంధీ
వాస్తవం : ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు దొరికిన ఆధారాలు, పత్రికా కథనం ఆధారంగా ఈ ఫోటో వాస్తవమే అని అర్థమవుతోంది.
కంక్లూజన్‌ : దాదాపు అర్థ శతాబ్దం కిందటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. బతుకమ్మ ప్రాశస్త్యం గురించి సోషల్ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది.
=============================================

No comments