Page Nav

HIDE

Grid

GRID_STYLE

'మా'ను బజారుకీడ్చిందెవరో తెలుసా?

ఎన్నికలు ఈసారి ఎందుకు వివాదంగా మారాయి? అవసరానికి మించి పరస్పర విమర్శలకు కారణమేంటి? ఎమోషనల్‌ సీన్లను రక్తి కట్టించడం వెనుక మర్మమేంటి? వ్యక్తి...ఎన్నికలు ఈసారి ఎందుకు వివాదంగా మారాయి?
అవసరానికి మించి పరస్పర విమర్శలకు కారణమేంటి?
ఎమోషనల్‌ సీన్లను రక్తి కట్టించడం వెనుక మర్మమేంటి?
వ్యక్తిగత విమర్శలు, వార్నింగ్‌లకు దారి తీసిన పరిస్థితులేంటి?


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌.. సింపుల్‌గా అందరూ పిలుచుకునే పేరు 'మా'. నిజంగానే పేరుకు తగ్గట్టు కళామతల్లి నీడలో సినీ ఆర్టిస్టులందరూ ఒకే గొడుగు కింద సాధక బాధకాలను చర్చించుకునే వేదికగా, ఒకరికొకరు సహకరించుకునే, పరస్పరం తోడ్పాటునందించుకునే వ్యవస్థగా రూపుదిద్దుకుంది. ప్రముఖుల నుంచి సాధారణ నటుల దాకా అందరికీ ఓ వేదికగా 'మా' పనిచేస్తోంది. కేవలం సినీ నటులకు మాత్రమే సంబంధించిన ఈ అసోసియేషన్‌.. 2021 ఎన్నికల విషయంలో మాత్రం సాధారణ ఎన్నికలను తలపించేలా నువ్వా.. నేనా? అన్నట్లుగా మారిపోయాయి. పరిస్థితులను హీటెక్కించాయి. ప్రతి ఒక్కరి అటెన్షన్‌నూ అటువైపు తిప్పేలా సాగాయి.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఎప్పటిలాగే ఈ యేడాది కూడా జరుగుతున్నాయి. ఆ అసోసియేషన్‌లో ఓటు హక్కు ఉన్న సభ్యులు కేవలం 883 మంది మాత్రమే. అంటే.. మామూలుగా పోల్చుకుంటే ఏదైనా ఓ గ్రామంలో ఒక వార్డులో ఓటుహక్కు ఉన్నవాళ్లకంటే తక్కువ. అలా అని.. 'మా'ను తక్కువగా చేయడం కాదు. సంఖ్యా పరంగా పోల్చుకుంటే  ఉన్న ఓటర్ల సంఖ్య.

లక్ష్యాలు, ఆశయాలు :

మా పురుడుపోసుకుందంటే టాలీవుడ్‌లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు సంఘటితం కావడానికి, అవసరార్ధులకు అండగా ఉండటానికి, బాధ్యతలను పంచుకోవడానికి, కష్టాల్లో ఉండే తోటి కళాకారులను ఆదుకోవడానికి వంటి లక్ష్యాలకోసం. మరోవైపు.. ఏ సంఘమైనా, ఏ అసోసియేషన్‌ అయినా ఎన్నికల విషయానికి వచ్చినా, ఆ అసోసియేషన్‌లో ఇంటర్నల్‌గా జరిగే గొడవలు, మనస్పర్థలు, వివాదాలు ఎదురైనా వాళ్లకు వాళ్లు పరిష్కరించుకోవడం సహజం. ఇప్పుడు 'మా' పరిస్థితి కూడా అదే. వెయ్యిలోపు ఓటర్లున్న అసోసియేషన్‌లో ఎంతపెద్ద సమస్య ఎదురైనా, వాళ్లలో వాళ్లకు మనస్పర్థలు కలిగినా, అంతర్గతంగా సినీ పెద్దలతో కలిసి మాట్లాడుకుంటే, చర్చించుకుంటే సరిపోతుంది. కానీ, ఈసారి మాత్రం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపర్వం గతంలో ఎన్నడూ లేని రీతిలో భిన్నంగా జరిగింది.

ఈసారి హైలైట్‌లు ఏంటంటే...

రాజకీయ పార్టీల స్థాయిలో ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, ఎన్నికల తర్వాత అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన వాళ్లమే.. అన్న ఆలోచన కూడా మరిచి విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారాయి. సాధారణంగా మాలో ఉన్నవాళ్లంతా నటీనటులే. సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా నటిస్తూ జనాన్ని ఎంటర్‌టైన్‌ చేయడమే బాధ్యతగా సినీ రంగ వృత్తిలో రాటుదేలుతున్నవాళ్లే. కానీ, సినిమాల్లో నటనను మించి.. కేవలం ఒక్కరోజు ఎన్నికలకోసం ఎమోషన్లను రక్తి కట్టించుకోవడం అనేది ఈ సారి మా ఎన్నికల్లో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

ఈ పరిణామాల నేపథ్యంలో... గతంలో ఎన్నడూ లేనివిధంగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అటు.. సినీ పరిశ్రమలోనే కాకుండా.. ఇటు ప్రజల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా ఎన్నికల్లో రెండు ప్యానళ్లు పోటీ చేస్తుండగా.. ఒక ప్యానల్‌పై, మరో ప్యానల్‌ బాహాటంగా చేసుకున్న విమర్శలు, జరిగిన రచ్చ వాళ్ల సంఘంలోనే కాదు.. జనాలందరిలోనూ చర్చను లేవనెత్తాయి.

ఎందుకింత రచ్చ?

వీటన్నింటినీ ఓసారి పరిశీలించుకుంటే 'మా' ఎన్నికల గురించి ఈసారి ఈ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతుంది? నటులు కూడా అవసరానికి మించి బాహాటంగా పరస్పరం విమర్శలు చేసుకోవడానికి కారణమేంటి? ఎన్నికల ప్రచారపర్వంలో ఎమోషనల్‌ సీన్లను రక్తి కట్టించడం వెనుక మర్మమేంటి? వ్యక్తిగత విమర్శలు, వార్నింగ్‌లకు దారి తీసిన పరిస్థితులేంటి? అనే అంశాలను ఓసారి మననం చేసుకుంటే.. ఆసక్తికర సమాధానం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేయకమానదు.  

మీడియా - సోషల్‌ మీడియా :

మా ఎన్నికల ప్రక్రియ 2021 మొదలైనప్పటినుంచీ ప్రధాన స్రవంతి మీడియా, సోషల్‌ మీడియా వీటిపై ఎక్కువగా ఫోకస్‌ చేశాయి. గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో మా ఎన్నికల ప్రక్రియను సాధారణ రాజకీయ ఎన్నికల మాదిరి కలరింగ్‌ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లాయి. సహజంగా సినిమా రంగంలోని వాళ్ల ప్రసంగాలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, చర్చలు అంటే జనం పడి చస్తారు. ఇక, వ్యక్తిగతంగా ఎవరికి వారు ఫ్యాన్స్‌ అసోసియేషన్లు షరా మామూలే. అయితే, మా ఎన్నికల్లో ఫ్యాన్స్‌ దాకా వివాదం వెళ్లలేదు గానీ, సినీ ప్రముఖులే వ్యక్తిగతంగా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం, పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకోవడం, మీడియా ముందు భావోద్వేగాలను ప్రదర్శించడం.. అంతటితో ఆగకుండా తమ ప్యానల్‌ శ్రేయోభిలాషులతో తమకు అనుకూల ప్రచారం చేయించడం, ఎదుటి ప్యానల్ వాళ్లను తిట్టించడం దాకా వెళ్లింది. ఇలాంటి పరిణామాలతో సినిమా రంగంలో ఎన్నడూ లేని ఈ సంస్కృతికి ఈసారి వాళ్లే శ్రీకారం చుట్టారు.

సోషల్ మీడియాలో నిరంతరం విశ్లేషణలు, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో నిత్యం చర్చలు, రిపోర్టర్ల లైవ్‌లు, వార్తా కథనాలు, వార్తా విశ్లేషణలు ముంచెత్తాయి. జనం ఆసక్తిగాచూసే, జనాన్ని అటువైపు ఆకర్షంచే పరిణామాలకు సంబంధించి కొన్నాళ్లపాటు నిరంతర చర్చలు, విశ్లేషణలకు అలవాటు పడిపోయిన మీడియా.. మా ఎన్నికలను కూడా తమ వీక్షకుల సంఖ్యను పెంచుకోవడం, టీఆర్పీ రేటింగ్‌లను పెంచుకోవడానికి ఉపయోగించుకుంది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులను అడిగి, ఆహ్వానించి, సమయం ఇప్పించుకొని మరీ చర్చలు చేపట్టాయి మీడియా ఛానెళ్లు. వీటికితోడు లైవ్‌ రిపోర్టింగ్‌లో విలేకరులతో ఇంటర్వ్యూలు ఇప్పించుకోవడం వంటివి కూడా నిర్వహించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఒకరకంగా మీడియా, సోషల్‌ మీడియా చట్రంలో సినీ ప్రముఖులు ఇరుక్కున్నారు. ఆ ఆవరణంలో కూరుకుపోయి ఎలాగూ జనం చూస్తున్నారు, మీడియా చూపిస్తోంది.. తమకు ఎక్కువ ప్రచారం వస్తోంది.. అన్న ధ్యాసలో మరింత ఎక్కువగా రియాక్ట్‌ అయ్యారు.

పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ :

చివరకు పరిస్థితి ఎందాకా వచ్చిందంటే.. వెయ్యిలోపు సభ్యులు ఓటు హక్కును వినియోగించుకునే.. అది కూడా ప్రత్యక్షంగా 500 మంది దాకా ఓటు వేసే 'మా' అసోసియేషన్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా పోలీసు బందో బస్తును వినియోగించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించుకోవడం కోసం పోలీసు బందోబస్తు కావాలని స్వయంగా అభ్యర్థించుకునే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌లోని 'మా' పోలింగ్‌ కేంద్రం వద్ద మూడు ప్లటూన్ల పోలీసు బలగాలను కేటాయించారు. వారిలో ఓ మహిళా ప్లటూన్‌ కూడా ఉండటం విశేషం.

ఎన్నికల హోరులో వీటిని పరిశీలించిన సగటు వీక్షకుడు, ప్రేక్షకుడు విస్తుపోయారు. తమకు సినిమాల ద్వారా వినోదాన్ని పంచుతున్న నటీనటుల మధ్య ఈ స్థాయిలో అంతరాలుంటాయా? ఒకరిమీద ఒకరికి ఈ స్థాయిలో ద్వేషం ఉంటుందా? అని అవాక్కవడం ప్రేక్షకుల వంతు అవుతోంది.


2 comments