KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా?

– యూడీఎఫ్‌ గెలుస్తుందా?
– ఎల్‌డీఎఫ్‌ చరిత్ర సృష్టిస్తుందా?

KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా?

నాలుగున్నర దశాబ్దాల్లో కేరళలో ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఐదేళ్లు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ పాలిస్తే తదుపరి ఐదేళ్లూ కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ పాలించేది. ఆ లెక్కన ఈ సారి యూడీఎఫ్‌ గెలవాలి. కానీ పరిస్థితి అలా కనబడడం లేదు. ఏ ప్రీపోల్‌ సర్వే చూసినా ఎల్డీఎఫ్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఇదే నిజమైతే సీఎం పినరయి విజయన్‌ చరిత్ర సృష్టించినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న ఓ గణనీయమైన మార్పేంటంటే.. సీనియర్లంతా విశ్రాంతి తీసుకోవడం. ఒకప్పుడు జాతీయస్థాయిలో సైతం చక్రం తిప్పిన కాంగ్రెస్‌ నేతలు పీజే కురియన్‌, పీసీ చాకో, వీఎం సుధీరన్‌, ముళ్లపల్లి రామచంద్రన్‌.. ఈ ఎన్నికల్లో పోటీచేయబోమని ఇప్పటికే ప్రకటించారు. 70 ఏళ్లు పైబడ్డ వారెవరినీ బరిలో దింపవద్దని మరో సీనియర్‌ నేత కేవీ థామస్‌ ఏఐసీసీ నాయకత్వాన్ని కోరారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కనీసం సగం మంది యువత లేదా ఒక్కసారి కూడా పోటీచేయని వారే ఉంటారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ నేత ఊమెన్‌ చాందీ ప్రకటించారు. సీపీఎం కూడా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పోటీచేసిన వారికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. కొద్దిమందికి మాత్రం నిర్ధిష్ట కారణాలతో అవకాశమిస్తోంది. టూ-టర్మ్‌ నిబంధనతో థామస్‌ ఐజాక్‌, రవీంద్రనాథ్‌, జయరాజన్‌తో సహా 8 మంది మంత్రులు, స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌ ఈసారి బరిలో దిగలేని స్థితి నెలకొంది.

సీపీఐ కూడా మూడుసార్లు కంటే ఎక్కువ పోటీచేసిన వారిని, గతంలో ఓడినవారిని ఈసారి పరిగణించేది లేదని ప్రకటించింది. పాత తరానికి స్వస్తి పలకడం సాధారణంగా లెఫ్ట్‌లో కనిపించదు. తొలిసారిగా ట్రెండ్‌ మారుతోంది. కాంగ్రెస్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య వర్గపోరు. మాజీ సీఎం ఊమెన్‌ చాందీ, సీఎల్పీ నేత రమేశ్‌ చెన్నితాల వర్గాలు ఆధిపత్యపోరులో ఉన్నాయి. కేరళలోని వయనాడ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈసారి యూడీఎఫ్‌ను అధికారంలోకి తేవాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. సోదరి, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కూడా ప్రచార రంగంలోకి దింపుతున్నారు. క్రైస్తవ ఓటర్లను తమ వైపు తిప్పుకోడానికి యత్నిస్తున్నారు. రమేశ్‌ చెన్నితాల రాష్ట్రమంతా పర్యటిస్తున్నప్పటికీ క్రైస్తవ ఓటుబ్యాంకు మీద కన్నేసిన కాంగ్రెస్‌ నాయకత్వం ఊమెన్‌ చాందీకే ప్రాధాన్యమిస్తోంది. రాహుల్‌ ఎన్నికల సమయమంతా రాష్ట్రంలోనే గడిపితే విజయం తమదేనని కాంగ్రెస్‌ నేతలంటున్నారు.

శబరిమల వివాదంతో, హిందూ ఓట్ల సంఘటితంతో రాష్ట్ర రాజకీయాల్లో పైకెదుగుదామని భావించిన బీజేపీ ఇప్పటికీ శక్తిగా రూపాంతరం చెందలేకపోయింది. అయితే ఐదేళ్లలో బీజేపీ తన ఓటు షేరును బాగా పెంచుకోగలిగింది. 2011లో 6 శాతం సాధించగా 2016 నాటికి 15 శాతానికి పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 13 శాతానికి తగ్గి ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. ఫిబ్రవరి 25న పార్టీలోకి చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేరళ బీజేపీ చీఫ్‌ సురేంద్రన్‌ ప్రకటించారు. అంతలోనే బీజేపీ అధిష్టానం తూచ్‌ అన్నది. బీజేపీ సీఎం అభ్యర్థిని మరోవైపు పరుగుల రాణి పీటీ ఉషను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తోంది. అయినప్పటికీ కాషాయదళం అంతగా ప్రభావం చూపలేకపోతోంది.

కేరళ ఓటర్లు విద్యాధికులు… తమ ప్రతినిధులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారని పేరు… అలాగని కేవలం ఆధునిక భావాలు, విశాల దృక్పథంతోనే ఓటేస్తారనేదేమీ లేదు. వర్గ సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కేరళలో 55% హిందువులు, 27% ముస్లింలు, 18% క్రైస్తవులు ఉన్నారు. అద్వైత సిద్ధాంతకర్త శంకరాచార్యులు పుట్టిన గడ్డ అయినప్పటికీ, పలు హిందూ ఆలయాలు, సంస్థలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారిది క్రియాశీల భూమిక కాదు. కాంగ్రెస్‌, వామపక్షాలకు సమానంగా ఓటేస్తుంటారు. గంపగుత్తగా ఓటేసేది ముస్లింలేనని విశ్లేషకులంటారు. అందుకే ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌తో జట్టుకట్టిన కాంగ్రెస్‌ 2019ఎన్నికల్లో యూడీఎఫ్‌ తరఫున 20 సీట్లకు గాను 19 స్థానాలను ఎగరేసుకుపోయింది. అయితే డిసెంబరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వామపక్ష కూటమి అభ్యర్థులు రాష్ట్రమంతా జయభేరి మోగించారు.

ఈసారి ఎల్డీఎఫ్‌ గెలవొచ్చన్న అంచనాలకు స్థానిక ఎన్నికల ఫలితాలే ప్రాతిపదిక. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ దాదాపుగా మట్టికరిచింది. యూడీఎఫ్‌ పరాజయం తమ ఎదుగుదలకు దోహదపడుతుందని బీజేపీ నమ్ముతోంది. పంచాయతీ ఎన్నికల్లో తాము 20 శాతానికి పైగా ఓట్లు సాధించిన 42 నియోజకవర్గాలపైనే బీజేపీ ప్రధానంగా గురిపెట్టింది. 2019 ఎన్నికల తరువాత రెండు కీలక పరిణామాలు జరిగాయి. ముస్లింలతో ఏళ్ల తరబడి సఖ్యంగా మెలిగిన క్రైస్తవుల్లో కాస్త అనుమానతలు రేగాయి. ఇవి ముస్లిం-క్రైస్తవ వర్గాల మధ్య అగాధంగా మారడానికి దోహదం చేసింది. తామెంత నాస్తికవాదులని చెప్పుకున్నా లెఫ్ట్‌ పార్టీలు విశ్వాసాలను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. శబరిమల వివాద సమయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్న వైఖరితో సీపీఎంకు తలబొప్పి కట్టింది. మరోవైపు ఎల్డీఎఫ్‌ను గోల్డ్‌ స్కాం ఇరుకున పెడుతోంది. కాంగ్రెస్‌ దాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతోంది.

కేరళలోని పబ్లిక్‌ పోల్స్‌ వామపక్షాల కూటమి ఎల్డీఎఫ్‌కు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అక్కడే తిష్టవేయడంతో యూడీఎఫ్‌ కూటమిలోనూ ఆశలు నెలకొన్నాయి. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికలుమాత్రం వామపక్ష కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయి. దేశంలో మరెక్కడా సీపీఎం అధికారంలో లేదు. బెంగాల్‌లో పూర్తిగా బలహీనపడింది. త్రిపురనూ కోల్పోయింది. జాతీయ స్థాయిలోనూ సీట్లు గణనీయంగా తగ్గాయి. కేరళను నిలబెట్టుకోగలిగితే అస్తిత్వం ఉన్నట్లు!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *