Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి?

Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె – పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి?
రాజకీయాల్లో లేని రాజకీయ దురంధరుడు ఆయన. చిటికెన వేలితో రాజకీయాలను శాసిస్తున్న వ్యూహకర్త ఆయన. కొందరు నేతలకు ఆయన చెప్పిందే వేదం. ఆయన స్కెచ్ వేశాడంటే సక్సెస్ కావడం ఖాయం. ఆయన కరుణ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తుంటాయి. అయితే, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారు. ఆ ఒక్క సక్సెస్‌ కొట్టారంటే ఆయనకు తిరుగుండదు. ఆయనే ప్రశాంత్ కిషోర్.

సక్సెస్‌ఫుల్‌ స్ట్రాటజిస్ట్‌ :

ఆయన చూపు కోసం క్యూ కట్టే నేతలున్నారు. మీరే గెలుస్తారని ఆయన ఒక్క మాట చెబితే ధైర్యంగా, హాయిగా నిద్రపోయే నేతలున్నారు. ఆయన సర్వే చేసినా, ఆయన వ్యూహాలు పన్నినా.. విజయలక్ష్మీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకుంటుందన్న నమ్మకం నాయకులది. గతంలో ఆయన సాధించిన సక్సెస్ రేటు అలాంటింది. పైగా అచ్చు గుద్దినట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంటుంది. అందుకే ప్రశాంత్ కిషోర్ ది సక్సెస్‌ఫుల్ స్ట్రాటజిస్టు అంటారు.

బెంగాల్‌లో దీదీకి, తమిళనాడులో స్టాలిన్‌కు భరోసా :

అనేక రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించాయి. విజయావకాశాలు లేని వాళ్లు కూడా సునాయాసంగా గెలిచారు. అందుకే అన్ని చోట్ల ఆయన్ను హైర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల ప్రశాంత్ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన నిర్వహించే సంస్థ ఐ- ప్యాక్… అటు పశ్చిమ బెంగాల్‌లోనూ, ఇటు తమిళనాడులోనూ ప్రధాన పార్టీలకు సేవలందిస్తోంది. బెంగాల్‌లో దీదీని గెలిపించే బాధ్యత ప్రశాంత్ కిషోర్ నెత్తికెత్తుకున్నారు. తమిళనాడులో స్టాలిన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెడతానని ప్రశాంత్ కిషోర్ ప్రతినబూనారు .

ప్రశాంత్ కిషోర్ చాలా రోజులుగా రాజకీయ వ్యూహాలు రచించే వృత్తిలో ఉన్నారు. ఈ సారి మాత్రం తన కెరీర్‌లోనే అత్యంత కీలతమైన ఎన్నికలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఒక్కరొక్కరుగా తృణమూల్ కాంగ్రెస్‌ను వీడిపోతున్నా… ఎలాంటి భయం లేదని దీదీకి ఆయన ధైర్యం చెబుతున్నారు. బెంగాల్‌ విషయంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలనాత్మక, క్రేజీ స్టేట్‌ మెంట్ ఇచ్చేశారు. ప్రధాని మోదీ ,అమిత్ షా, నడ్డా లాంటి నేతలంతా ప్రెస్టేజ్‌గా తీసుకుని బెంగాల్‌లో బీజేపీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నప్పటికీ మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆయన తేల్చేశారు. పైగా బెంగాల్‌ విషయంలో మిగతా సర్వేల కంటే తన మాటే శాసనం అవుతుందని ఆయన చెబుతున్నారు. అక్కడ బీజేపీ గెలుపు అసాధ్యమని, దీదీ మళ్లీ గెలుస్తారని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి రెండంకెలు దాటవని ప్రశాంత్ లెక్కతేల్చేశారు. అంటే కమలం పార్టీకి వంద సీట్లు దక్కవని ఆయన మాటగా అనుకోవాలి. దీదీకి కనీసం మెజార్టీ రావడంలోనూ ఢోకాలేదని ఆయన జోస్యం చెబుతున్నారు. పైగా తన లెక్క తప్పయితే ఇంకెప్పుడూ మీడియా ముందుకు రానని కూడా ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ చేయడంతో ఆయన సర్వే నిజమనిపించక తప్పదు.

నందిగ్రామ్‌ ప్లాన్‌ ప్రశాంత్‌కిషోర్‌దే…

నిజానికి ప్రశాంత్ కిషోర్ దీదీకి ఇచ్చిన ఒక సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నందిగ్రామ్‌ నుంచి దీదీ పోటీ చేస్తే రాష్ట్రం మొత్తం తిరుగుండదని ఆయన చెప్పేశారు. తాను గతంలో పోటీ చేసిన భవానీపూర్‌ను వదిలేసి మమత నేరుగా నందిగ్రామ్‌లో నామినేషన్ వేయబోతున్నారు. దీనితో బెంగాల్ రాజకీయాలే మారిపోయాయి. రాష్ట్ర ఎన్నికల రాజకీయం మొత్తం నందిగ్రామ్ చుట్టూ తిరుగుతోంది. దీనితో బీజేపీ కూడా డిఫెన్స్‌లో పడిపోక తప్పలేదు.

దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కూడా ప్రశాంత్ వ్యూహం ఫలిస్తోందని చెప్పక తప్పదు. రెండు సంవత్సరాలుగా ఆయన డీఎంకేకు వ్యూహకర్తగా ఉన్నారు. స్టాలిన్ పార్టీ విధానాల రూపకల్పనలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిందని ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాల్సిన అవసరం లేదని సలహా ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోరే కావడం విశేషం. ఇప్పుడు వస్తున్న అన్ని సర్వేలు స్టాలిన్ సీఎం అవుతారనే చెబుతున్నాయి.

పంజాబ్‌ ప్రభుత్వ సలహాదారుగా ప్రశాంత్‌ కిషోర్‌ :

పనిలోపనిగా ప్రశాంత్ కిషోర్ మరో అసైన్‌మెంట్ ప్రారంభించారు. పంజాబ్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు బాధ్యతలు చేపట్టారు. కేవలం ఒక రూపాయి జీతంతో ఆయన ఈ సేవలు అందించబోతున్నారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యూహకర్తగా ఉన్నారు. అప్పుడు పార్టీ ఘనవిజయం సాధించింది. వచ్చే ఏడాది మళ్లీ పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే సీఎం అమరీందర్ సింగ్‌…ఆయనన్ను ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈసారి పార్టీకి గెలిపించే బాధ్యతను పరోక్షంగా ఆయనకు అప్పగించారు.

బెంగాల్‌, తమిళనాడులో ప్రశాంత్ సలహాలిస్తున్న పార్టీలు గెలిస్తే ఆయన స్టార్ తిరిగిపోతుంది . ప్రతీ రాష్ట్రం, ప్రతీ పార్టీ ఆయన వైపు చూడటం ఖాయమవుతుంది. త్వరలో ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రశాంత్ కిషోర్‌ సలహాల కోసం ప్రయత్నించే వీలుంది. అది అఖిలేష్ యాదవా.. తేజస్వీ యాదవా.. స్వయంగా రాహుల్‌ గాంధీ సలహాలు పొందుతారా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనీ ఉండదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *