Second Wave – Lockdown : లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట !

  • సెకండ్‌ వేవ్‌..  తీసుకొస్తోందట

  • భారత్‌లో మరోసారి ప్రకంపనలు

సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట. అవును. లాక్‌డౌన్‌ ప్రజలను ఒకరకంగా కట్టేసినట్లు చేసింది. ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. కలలో కూడా అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొద్దని ప్రతి ఒక్కరూ వేడుకునేలా చేసింది. కానీ, అది మళ్లీ వస్తోందట. ఇప్పటికే బిక్క చచ్చిపోయిన జనాలను మరింత కుంగదీసేలా చేయబోతోందట.

దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. కంటికి కనిపించని ఆ వైరస్‌.. కొన్ని నెలలపాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. వేల సంఖ్యలో ప్రాణాలను హరించింది. లక్షల సంఖ్యలో ప్రజలను బాధితులుగా మార్చింది. అందరి వెన్నులోనూ వణుకు పుట్టించింది. అలాంటి భయంకరమైన మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. మళ్లీ లాక్‌డౌన్‌ను అనివార్యంగా మార్చేయబోతోంది.

సరిగ్గా తొమ్మిది నెలల క్రితం దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. పౌరులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా వ్యాప్తిని అరికట్టడమే ప్రధాన ధ్యేయంగా కష్టమైనా, నష్టమైనా, నిష్టూరమైనా భరించారు. క్రమ క్రమంగా ఒక్కో దేశం లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తుండటం చూసి సంబరపడ్డారు. కానీ, లాక్‌డౌన్‌ మిగిల్చిన ఆర్థిక నష్టాలు చూసి బెంబేలెత్తిపోయారు. అలాంటి పరిస్థితి పగవాళ్లకే కాదు.. ఈ భూమ్మీద ఉన్న ఏ ఒక్కరికీ రాకూడదని ప్రార్థించారు. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

సీసీఎంబీ డైరెక్టర్‌ ప్రకటనతో ప్రకంపనలు :

తాజాగా సీసీఎంబీ డైరెక్టర్ చేసిన ప్రకటన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ తప్పక పోవచ్చునని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా కుండబద్దలు కొట్టారు. కరోనా పట్ల భవిష్యత్తులో మరింత ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని రాకేష్ మిశ్రా ప్రజలకు సూచించారు. మానవ తప్పిదాల వల్లే కరోనా చాలాచోట్ల విజృంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు.

సెకండ్ వేవ్ అంటే భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయన్న ఆయన వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండడం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు. దేశమంతా సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టమని రాకేష్‌మిశ్రా హెచ్చరించారు. అయితే, ఇప్పుడు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే సెకండ్‌ వేవ్‌ కనిపిస్తోందన్నారు.

అలానే ఈ వైరస్ మన చుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దు అని ఆయన అప్రమత్తం చేశారు. కొన్ని సార్లు ఈ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు. పండగలు – పెళ్లిళ్లలో జాగ్రత్తలు పాటించక పోతే మరలా లాక్‌డౌన్ తప్పనిసరి అవుతుందని రాకేష్‌ మిశ్రా స్పష్టం చేశారు. 60 నుంచి 70 శాతం యాంటీబాడీలు వచ్చి హెర్డ్ ఇమ్మ్యూనిటీ లేదా వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ వేవ్‌లు వస్తూనే ఉంటాయని సీసీఎంబీ డైరెక్టర్‌ పేర్కొన్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలంటే రెండేళ్లసమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే మాస్క్, శానిటేషన్, భౌతిక దూరంతోనే ఈ మహమ్మారి వైరస్‌ని జయించాలని రాకేష్‌ మిశ్రా సూచించారు.

అయితే, రాకేష్‌ మిశ్రా అంచనా వెనుక కొన్ని కీలక అంశాలున్నాయి. పలు దేశాల్లో రెండోసారి లాక్‌డౌన్‌ విధించిన ఉదాహరణలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరగబోతుందో అనే అంచనాలున్నాయి. మరి.. ప్రపంచదేశాల్లో ఎక్కడెక్కడ రెండోసారి లాక్‌డౌన్‌ విధించారో చూద్దాం…

సెకండ్‌వేవ్‌ అంత ప్రమాదమా ? రెండోసారి లాక్‌డౌన్‌ అవసరమా ?

ఇక.. ఆయా దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యింది. దీంతో.. మరోసారి లాక్‌డౌన్‌ విధించని తప్పనిసరి పరిస్థితి నెలకొంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అంతకుమించి ఉపాయం కనిపించలేదు. అందుకే చాలా దేశాలు రెండో విడత లాక్‌డౌన్‌కు మొగ్గు చూపుతున్నాయి. అమెరికా, ఐరోపాల్లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు లక్ష వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా, యూఎస్‌లో మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువ అయ్యింది. దీంతో చాలాదేశాలు లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించి.. అమలు చేస్తున్నారు.

సెకండ్ వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్‌ మళ్లీ లాక్‌డౌన్ విధించింది. నవంబర్ 5 నుంచి నాలుగు వారాల పాటు దేశవ్యాప్తంగా ఈ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

కేసులు పెరిగిపోతుండడంతో ఫ్రాన్స్, జర్మనీలు కూడా మళ్లీ లాక్​డౌన్​ను విధించాయి. లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​ ప్రకటించారు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన రెండోవిడత లాక్‌ డౌన్‌.. నాలుగు వారాలపాటు కొనసాగనుంది. డిసెంబర్​1 దాకా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్​ ఎమర్జెన్సీ మినహా మిగతా అన్నీ క్లోజ్​ అని వెల్లడించారు. ఫస్ట్​వేవ్​ కన్నా సెకండ్​వేవ్​ చాలా తీవ్రంగా ఉందన్నారు. అందుకే లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక, జర్మనీలో కూడా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లను నవంబర్​ నుంచి మూసేస్తున్నట్టు జర్మనీ చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ ప్రకటించారు.

డిసెంబరు 13 వరకు బెల్జియంలో లాక్‌ డౌన్‌ అమల్లో ఉండనుంది. ఇక మరోవైపు గ్రీస్‌లో కంటైన్మెంట్‌ ఏరియాల్లో మాత్రమే ఉన్న పరిమితుల్ని.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. గ్రీస్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆదేశాలు ఇచ్చారు. సెకండ్​ వేవ్​ మొదలైందన్న ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్​లో పాక్షిక లాక్​డౌన్​ను విధించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా రెండోదశ వ్యాప్తి చాలా ప్రమాదంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తొలిసారి వచ్చినదానికన్నా రెండోసారి వచ్చే కరోనా సంక్షోభంలో అత్యధికులు మరణిస్తారని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో.. చాలా దేశాలు ఇప్పడు మళ్లీ కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం అయిన లాక్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. రోజువారీ కేసుల సంఖ్యలు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి.

 

 

One Comment on “Second Wave – Lockdown : లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట !”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *